రాజకీయ రచ్చబండ | rachabanda programme Political focus | Sakshi
Sakshi News home page

రాజకీయ రచ్చబండ

Published Sun, Nov 17 2013 3:06 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

rachabanda programme Political  focus

సాక్షి, రాజమండ్రి :‘పథకాల లబ్ధి పంచుతామని పిలిచారు. ప్రసంగాలతో సరిపుచ్చి పంపారు’ ఇదీ రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం పాల్గొన్న రచ్చబండకు హాజరైన జనం నిష్టూరంగా అనుకున్న మాట. నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన రచ్చబండకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సిన సీఎం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి 5.15 గంటలకు సుబ్రహ్మణ్య మైదానం  చేరుకునే సరికి సభా ప్రాంగణంలో ఒక్క కార్యకర్త కూడా లేడు. దీంతో అధికారులు మైదానం ప్రధాన ద్వారం వద్దకు పరుగున వెళ్లి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం వేదికనెక్కి జనానికి అభివాదం చేసే దాకా ఆయన వచ్చారన్న విషయమే తెలియలేదు. ముఖ్యమంత్రి ప్రసంగానికి సభలో కనీస స్పందన కూడా లభించక పోవడంతో రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తారు. ‘నేను, ఇక్కడున్న వాళ్లంతా అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.
 
 రాష్ట్రంపై బాంబు పడబోతోంది. దాన్ని తప్పించాలని నావంతు కృషి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. అయినా జనంలో ఆసక్తి కనిపించకపోవడంతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపైకి దృష్టి మళ్లించారు. జిల్లాలో నీలం తుపాను బాధితులైన మూడు లక్షల మంది రైతులకు రూ.139 కోట్ల  ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశామని, ఇప్పటికే 90 శాతం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయ్యాయని, 1,63,000 మంది రైతులకు రూ.212 కోట్ల పంటల బీమా చెల్లించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దమ్మున్న సీఎం అంటూ రౌతు అధ్యక్షోపన్యాసంలో ఆకాశానికెత్తగా, సీఎంను ఖడ్గతిక్కన్నగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అభివర్ణించారు. ఇక మంత్రి తోట నరసింహం అభివృద్ధి అంతా కిరణ్‌కే సాధ్యమని కీర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే చందన రమేష్ జిల్లాలో రోడ్ల దుస్థితిని ప్రస్తావించగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటే అది ఎమ్మెల్యే వైఫల్యం అంటూ కందుల విమర్శించారు. ఇలా రచ్చబండ కార్యక్రమం కొంతమేర రాజకీయ ‘రచ్చ’గా సాగింది. 
 
 స్టాల్స్ మూయించి సభలో కూర్చోబెట్టారు
 రచ్చబండకు కొద్దిగా హాజరైన జనం కూడా సీఎం రావడానికి ముందు స్టాళ్ల వద్ద రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల కోసం బారులు తీరారు. సీఎం రాగానే స్టాళ్లను మూయించి జనాన్ని కుర్చీల్లో కూర్చోబెట్టాలని మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ ఆదేశించడంతో పోలీసులు అలాగే చేశారు. దీంతో లబ్ధిదారులు ‘ఈ సభ ఎందుకు? మాకు పథకాలు ఇవ్వడానికా? ప్ర సంగాలు వినడానికా?’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 6.20 గంటలకు సభ ముగిశాక జనం స్టాళ్ల ముందు  క్యూలు కట్టారు. 
 
 సభకు రాని ఉండవల్లి, బలశాలి, శ్రీఘాకోళ్లపు
 ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ బలశాలి ఇందిర, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం సభకు దూరంగా ఉన్నారు. తాను పార్టీకి రాజీనామా చేశానని ఉండవల్లి గైర్హాజరు కాగా ఎమ్మెల్యే తనకు కావల్సిన ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చి మిగిలిన వారికి సముచితంగా సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ శ్రీఘాకోళ్లపు వర్గం సభను బహిష్కరించింది. ముందుగా సభలో ఫ్లెక్సీలు కూడా కట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గైర్హాజరయ్యారని తెలిసింది. కాగా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని గతంలో తాను విన్నవించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్న కినుకతోనే ఇందిర రానట్టు తెలిసింది. మొత్తమ్మీద సభలో పార్టీ కార్యకర్తలే కరువై వారు చేయాల్సిన పనులు కూడా అధికారులే చేసి సభ అయ్యిందనిపించారు. పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిన సభలో పది మందికి కూడా మంజూరు పత్రాలు ఇవ్వకుండానే సీఎం వెనుతిరిగారు. 
 
 మహిళ ఆత్మహత్యాయత్నం
 కాగా, సీఎం సభ వద్ద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన కలిగుడ్ల గిరికుమారి అనే మహిళ తన చీరను మెడకు బిగించి ఆత్మహత్యాయత్నం చేసుకోబోవడం కలకలం రేపింది. ప్రసంగం ముగించుకొని వేదిక దిగు తుండగా సీఎంను కలిసేందుకు ఆమె యత్నిం చింది. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అడ్డుకో వడంతో ఆత్మహత్యా యత్నం చేసుకోబో యింది. అది గమనించిన సీఎం అర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద తనను కలవాలని సూచించారు. తాను పేగు ఒరుపు, వెన్ను సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, హైదరాబాద్, చెన్నై ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేదని చెప్పింది. ఇప్పటికే రూ.10 లక్షల ఖర్చయిందని చెప్పింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తనను ఆదుకోవాలని వేడుకొంది. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చును మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు.
 
 ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా..
 ముఖ్యమంత్రి సాయంత్రం 3.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్థలంలో రూ.9.88 కోట్లతో నిర్మించిన ఐహెచ్‌ఎస్‌డీపీ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. కాగా ఉదయం నుంచి పడిగాపులు పడితే సీఎం నలుగురికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చి వెళ్లిపోయారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సీఎం ఆర్ట్స్ కళాశాల మైదానం చేరుకుని రూ.3.30 కోట్లతో నిర్మించే సంక్షేమ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సుబ్రహ్మణ్య మైదానంలో రచ్చబండ సభలో పాల్గొన్నారు. మహిళలకు అర్బన్ ఐకేపీ మంజూరు చేసిన రూ.6.21 కోట్లు, రూరల్ ప్రాంతంలో ఐకేపీ మంజూరు చేసిన రూ.3.47 కోట్ల రుణాలు అందచేశారు. 8,604 మందికి రేషన్ కార్డులు, 2028 మందికి వివిధ పింఛన్లు, 800 మందికి గృహాలు, ఎస్సీ, ఎస్టీలు 3900 మందికి రూ.2.70 లక్షలు విద్యుత్తు చార్జీల బకాయిలు చెల్లించినట్టు అధికారులు ప్రకటించారు.  ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యేలు చందన రమేష్, రౌతు సూర్యప్రకాశరావు, కె.కాశీ విశ్వనాథ్, కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, రాజా అశోక్‌బాబు, వంగా గీత, పాముల రాజేశ్వరీదేవి, ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ, శివకుమారి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచ్చబండ అనంతరం ఆర్ అండ్ బి అతిథిగృహం చేరుకున్న సీఎం అక్కడి నుంచి ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుల వివాహ రిసెప్షన్‌కు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. తిరిగి ఆర్ అండ్ బి అతిథిగృహం చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement