సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయిన బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ, రచ్చబండ కింద మూడు విడతలుగా మంజూరై ఇళ్లకు బిల్లులు నిలిచాయి. అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు రోడ్డెక్కుతున్నారు. గృహనిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం జిల్లాలో రూ.42 కోట్ల మేర బిల్లులు నిలిచాయి. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
నిలిచిన నిర్మాణాలు
ఇందిరమ్మ, రచ్చబండ, ఆర్‌అండ్‌ఆర్ పథకాల కింద జిల్లాకు 3,30,961 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,75,735 ఇళ్లు గ్రౌండింగ్ కాగా, ఇప్పటివరకు 2,03,705 ఇళ్లు పూర్తయినట్లు గృహనిర్మాణ సంస్థ రికార్డులు చెప్తున్నాయి. 25,949 ఇళ్లు పునాది, 9,214 లెంటల్ లెవెల్, 25,702 రూప్ లెవెల్, 1,27,258 ఇళ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందిరమ్మ మొదటి విడతలో 93,386 ఇళ్లు మంజూరైతే అందులో 91,108 ఇళ్లు గ్రౌండింగై 76,070 ఇళ్లు పూర్తి చేయగా లక్ష్యంగా 83 శాతంగా ఉంది. రెండో విడతలో 1,05,895 ఇళ్లకు 73, 219 ఇళ్లు పూర్తి కాగా 75 శాతం, మూడో విడతలో 72,764 ఇళ్లకు 36,838 ఇళ్లు పూర్తయి 65 శాతం లక్ష్యం నెరవేరాయి. మొదటి విడత రచ్చబండ 16,411 ఇళ్లకు 8,494 పూర్తి కాగా 62 శాతం, రెండో విడత రచ్చబండలో 19,157కు 3,404 ఇళ్లు పూర్తి కాగా 46 శాతం లక్ష్యం నెరవేరింది. జీవో 44 కింద మంజూరైన 10,324 ఇళ్లలో 23 గ్రౌండింగ్ కాగా ఒకే ఇల్లు పూర్తయింది. మంపు బాధితులకు 3,647 ఇళ్లు మంజూరైతే అందులో 941 పూర్తి చేసిన అధికారులు 14 శాతంతో లక్ష్యాన్ని సరిపెట్టారు.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కలిసిరాని పథకం
ఇందిరమ్మతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన 3,30,961 ఇళ్లలో 2,03,705 పూర్తి కాగా, పూర్తయిన ఇళ్లతోపాటు వివిధ స్థాయిల్లో ఉన్న వాటికి రూ.893.30 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రెండు, మూడు నెలల్లో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు చెందిన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచాయి. బకాయిల వివరాలపై ‘సాక్షి’ ఆరా తీయగా కచ్చితంగా చెప్పలేమని గృహనిర్మాణ శాఖ అధికారులు చెప్పారు. ఆన్‌లైన్‌లోనే ఉంటాయని సెలవిచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒకటి, రెండు మాసాల్లో నిలిచిన బిల్లులు సుమారు రూ.42 కోట్లకు పైగా ఉంటాయంటున్నారు. ఇందిరమ్మ పథకం కింద ఎస్సీ లబ్ధిదారులైతే రూ.లక్ష, ఎస్టీలైతే రూ.1.05 లక్షలు, బీసీ/ఇతరులకు రూ.80 వేలు చెల్లిస్తారు. పట్టణాల్లో నివసించే బీసీ/ఇతరులకైతే ఓ రూ.10 వేలు అదనంగా చెల్లిస్తారు. గృహనిర్మాణ శాఖ నిబంధనలకు ప్రకారం లబ్ధిదారులు ఏ కులానికి చెందిన వారైనా ఇళ్ల నిర్మాణ స్థాయిలను బట్టి అన్‌లైన్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణ ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయడం, సిబ్బంది కొరత వల్ల బిల్లులు నిలిచాయని అధికారులు చెప్తున్నారు. అప్పు చేసి ఇళ్లు కట్టుకుంటే, బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
‘ఇందిరమ్మ’ చెల్లింపులపై సర్కారు చిన్నచూపు
Published Sat, Aug 31 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement