అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు
రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
కలెక్టర్లతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇతర మంత్రుల వెల్లడి
ఈనెల 24 వరకు గ్రామ సభల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఈ పథకాలకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఈనెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ సభలు, వాటిలో నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల స్పందన తదితర అంశాలపై కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
4 పథకాలకు రూ.40 వేల కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్ల వ్యయం అవుతుందని మంత్రులు వెల్లడించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితాను గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హుల జాబితాను ప్రకటించలేదని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులను ప్రకటిస్తామని తెలిపారు.
దరఖాస్తుల్లో పేరు, ఆధార్ కార్డు నంబర్, చిరునామా తదితర వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు విజయవంతంగా జరిగాయంటూ జిల్లా కలెక్టర్లను మంత్రులు అభినందించారు. రాష్ట్రంలో 4,098 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment