
ఏప్రిల్ నుంచి ప్రతి నెలా రూ.500–600 కోట్లు ఇస్తాం..
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
ఏప్రిల్ నుంచి ఎలాంటి కొత్త బకాయిలు లేకుండా చూస్తాం
ఆర్ధికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.8 వేలకోట్ల బకాయిలను చెల్లిస్తామని.. ఏప్రిల్ నుంచి ప్రతీ నెలా ఐదారు వందల కోట్ల చొప్పున ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి వచ్చే కొత్త బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా.. ఏ నెలకు ఆ నెలలో క్లియర్ చేస్తామని చెప్పారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రజా ప్రభుత్వం రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిందని తెలిపారు. జీవితకాలం పనిచేసి దాచుకున్న డబ్బులకోసం ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి, తాను అర్థం చేసుకున్నామని చెప్పారు.
శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టితో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహాధ్యక్షుడు శ్యామ్, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, పలువురు ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగులు బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గ్రీన్ చానల్ ద్వారా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలోని రూ.5 వేల కోట్లు, ఈ ప్రభుత్వానివి కలిసి రూ.10,000 కోట్లు పెండింగ్ బిల్లులను ఇప్పటివరకు క్లియర్ చేశాం. మరో ఎనిమిది వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి’’అని చెప్పారు.
ఏప్రిల్ నుంచి కొత్త బకాయిలు ఉండవు..
ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త బకాయిలు ఉండవని, పాత బకాయిలను ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు చెల్లిస్తామని భట్టి హామీ ఇచ్చారు. గత పదేళ్లు పాలించినవారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థంకాని పరిస్థితి ఉండేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు.
కేవలం పదవీ విరమణ ప్రయోజనాలు, మెడికల్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరి్ధకేతర అంశాలపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్, వైద్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
45 ఆర్థికేతర, 12 ఆర్థిక సమస్యలను విన్నవించాం: ఉద్యోగ జేఏసీ
డిప్యూటీ సీఎం భట్టితో సమావేశం అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 45 ఆర్థికేతర, 12 ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 4 డీఏలు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, హెల్త్‌కార్డులు విడుదల చేయాలని కోరామన్నారు. ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.
ఆర్థికేతర అంశాల పరిష్కారానికి వీలైనంత త్వరగా కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించాలని కోరామన్నారు. దీనికి సంబంధించి ఐదారుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి.. పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment