కంఠం ప్రభుదాస్, పాడేరు :‘గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. చివరకు గాలికొగ్గేశారు. రుణమాఫీసేత్తామన్నారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. పంట నష్టానికి పరిహారం కూడా ఇవ్వలేదు. కాయితాలట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప పనులవటం లేదు. పోడు భూములకు వ్యక్తిగత పట్టాలివ్వలేదు. దీనివల్ల ఉపాధి పనులకు, బ్యాంకు రుణాలకు దూరమవుతున్నాం. గిరిజన యువతకు ఉద్యోగాలివ్వటం లేదు. ఏజెన్సీలో అనేక పోస్టులు ఖాళీ ఉన్నా.. నియామకాలు చేపట్టలేదు’ అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు మండలం కుజ్జెలి పంచాయతీ పరిధిలోని దిగుమోదాపుట్టు, కుజ్జెలి, రాములు పుట్టు, ఎగు మోదాపుట్టు గ్రామాల ప్రజలు ములపుట్టులో రచ్చబండ నిర్వహించారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చించి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆశపెట్టారని.. అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ధ్వజమెత్తారు. నిజమైన నిరుద్యోగులకు భృతి అందటం లేదని, ఐదెకరాలు దాటి ఉన్న కుటుంబాలకు పింఛన్లు ఇవ్వటం లేదని, జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే సబ్సిడీ పథకాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లను నమ్మి ఓటేసిన రైతులు, డ్వాక్రా మహిళలు వడ్డీల భారం మోయలేక రుణగ్రస్తులుగా మిగిలిపోయారని నిరసన తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో ఎవరేమన్నారంటే..
రైతుల కోసం ఒక్క పనీ చేయలేదు
రైతులకు మేలు చేసే పనులు ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు. పంట నష్టం కలిగితే పరిహారం ఇవ్వలేదు. జన్మభూమి గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారే తప్ప ఏ çపనీ చేయలేదు. ప్రతిసారి దరఖాస్తులుఇవ్వడానికి వ్యయప్రయాసలే తప్ప ప్రయోజనం లేదు. వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని పెట్టుబడులు కూడా చేతికి రావటం లేదు. అయినా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. – పాంగి దేముడు, కుజ్జెలి
ఉద్యోగాల్లేక చదువులు మానేశారు
చదువుకున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు.ప్రభుత్వం ఏజెన్సీలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో లేవు. ఆర్థిక స్థోమత, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో యువకులు ఇంటర్, డిగ్రీ తర్వాత చదువు మానేసి కూలి పనులకు వెళ్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి. – తామర నారాయణ, కుజ్జెలి
రుణమాఫీ జరగలేదు
ఆరేళ్ల క్రితం నా భూమి పట్టాపై పాడేరు యూనియన్ బ్యాంకులో రూ.50 వేలు పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ అవుతుందని చెప్పడంతో బ్యాంకుకు బాకీ కట్టలేదు. నాకు ఒక విడత కూడా రుణమాఫీ జరగలేదు. వడ్డీతో కలిపి రూ.80 వేలు అయ్యిందని, వెంటనే చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పంట రుణం మాఫీ అవుతుందని నమ్మి మోసపోయాను. – బొండా చిన్నబాలన్న, రాములపుట్టు
మంచి పాలన అందించాలి
ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇస్తుంటే బినామీలు పాలిస్తున్నారు. గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తించి గిరిజనులకు మేలు చేసేవిధంగా మంచి నాయకులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. – కుంతూరు సూరిబాబు, రాములపుట్టు
అటవీ హక్కు పత్రాలు ఇవ్వలేదు
మా పంచాయతీలో పోడు భూములు సాగు చేసుకుంటున్న కుటుంబాలు 500పైగా ఉన్నాయి. మాకు వీఎస్‌ఎస్ కింద ఉమ్మడి పట్టా ఇచ్చారు. వ్యక్తిగత పట్టాలివ్వాలని ఐదేళ్ల నుంచీ అడుగుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత పట్టాలు ఉన్నవారికే 50 రోజులు అదనంగా ఉపాధి పనులు కల్పిస్తున్నారు. రుణాలు ఇస్తున్నారు. ఉమ్మడి పట్టా కావడంతో మాకు ఇవేమీ అందటం లేదు.
– కె.నాగరాజు, రైతు,దిగుమోదాపుట్టు
గ్రామ సచివాలయవ్యవస్థ మేలు
అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడం పేదలకు ఒక వరంలాంటిది. ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. నవరత్న పథకాల వల్ల పేదరికం తొలగిపోతుంది. – గబ్బాడ చిట్టిబాబు, మాజీ సర్పంచ్, కుజ్జెలి
Comments
Please login to add a commentAdd a comment