సీఎం సొంత జిల్లాకు రూ.5,800 కోట్లు: హరీష్‌రావు
సిద్దిపేట: ప్రజాధనంతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం విద్వేష పూరిత ప్రసంగాలతో రాజకీయం చేయడం ఏమిటని కిరణ్‌కుమార్‌రెడ్డిపైటీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టమంటూ విశాఖ జిల్లాలో జరిగిన రచ్చబండలో సీఎం వ్యాఖ్యానించడం దొంగే.. దొంగ దొంగ.. అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
పదవిపై వ్యామోహం లేదనే భావన ప్రజల్లో కలిగించేందుకు ప్రయాస పడేకన్నా...సీఎం సీటును వదలుకొని సీమాంధ్రలో కార్యక్రమాలు పెట్టుకోవాలని కిరణ్‌కు ఆయన హితవు పలికారు. విభజన జరుగుతోన్న దశలోనూ తెలంగాణకు మరింత నష్టం కలిగించేలా సీఎం అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేలా దుమ్ముగూడెం ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తున్నారని ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారన్నారు.
తన సొంత జిల్లా చిత్తూరుకు రూ.5,800 కోట్లు కేటాయించుకున్నారని, రెండో మెడికల్ కాలేజీ పెట్టుకుంటున్నారని, ఉన్నత విద్యా మండలి కౌన్సిల్ చైర్మన్ పదవిని, ఆర్‌అండ్‌బీలో ఈఎన్‌సీ పోస్టునూ తన జిల్లా వాసులకే ఇచ్చుకున్నారని హరీష్ ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను విచ్చలవిడిగా బదిలీ చేస్తున్నారని విమర్శించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామంటున్న సీమాంధ్రకు చెందిన దళిత, గిరిజన మంత్రులు కొండ్రు మురళి, బాలరాజులను సీఎం అవమానిస్తున్నారని అన్నారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆయన్ను సీఎం పదవి నుంచి తక్షణం తప్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.