బొత్స రచ్చబండ రాజకీయం | botsa satyanarayana rachabanda programme Politics | Sakshi
Sakshi News home page

బొత్స రచ్చబండ రాజకీయం

Published Thu, Nov 21 2013 3:30 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

botsa satyanarayana rachabanda programme Politics

శృంగవరపుకోట, న్యూస్‌లైన్:‘ఒరేబాబూ కాస్త ఆగరా..నీపనిచేసి వెళ్తాను. మీసమస్యలు తీర్చ డానికే వచ్చాను. ఇతగాడికి కార్డుఎందుకు ఇవ్వలేదు సమస్యేంటి..’అంటూ సామాన్యుడి తరఫున వకాల్తా పుచ్చుకున్న రాష్ట్ర రవాణా శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ  లక్కవరపుకోటలో బుధవారం జరిగిన రచ్చబండలో తన మార్కు మ్యాజిక్ చేశారు. సభలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, రచ్చబండ ఆహ్వాన కమిటీ స భ్యురాలు తూర్పాటి వరలక్ష్మి మాత్రమే నాలు గు మాటలు మాట్లాడారు.  మంత్రి బొత్స వన్‌మేన్ షో చేసి అన్నీ తానై వ్యవహరించి రచ్చబండ సందర్భంగా తాజాగా జారీ చేసిన కార్డు లు, పింఛన్లు, ఇళ్ల వివరాలు అధికారులచే చెప్పించారు. లబ్ధిదారులను పిలిచి ‘ఎప్పుడు ధరఖాస్తు పెట్టావు. ఎన్నాళ్ల నుంచి తిరుగుతున్నావ్..’అని అడిగి సమాధానాలు రాబట్టారు. నాలుగేళ్లుగా ఉన్న మీ ఇబ్బందుల్ని తీర్చాం. ఇప్పుడున్న జాబితాలో రాకుండా మిగిలిపోయిన అర్హులు ఎవ్వరున్నా కార్డులు, పింఛన్లు, ఇళ్లు అన్నీ జనవరిలోగా  ఇచ్చేస్తామంటూ పదే పదే  చెప్పారు.
 
 మంత్రి బొత్స మాట్లాడుతూ  ఇందిరమ్మ ఇళ్లకు గతంలో రూ.40వేలు ఇస్తే, ఇప్పుడు రూ.80 వేలు నుంచి రూ.1,10,000 లుకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ కులస్థుల విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని, బంగారుతల్లి పథకంతో ఆడపిల్లలకు భద్రత ఇచ్చామని చెప్పారు. జిల్లా అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులెవ్వరికీ మాట్లాడే ఛాన్స్ రాలేదు. రచ్చబండ వేదికపై ముందు వరుసలో కలెక్టర్ మినహా ఇతర జిల్లా అధికారులెవ్వరికీ చోటు దక్కలేదు. ఆర్‌డీఓ వెంకటరావు, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి తదితర అధికారులు, మండల అధికారులు వెనుక వరుసకే పరిమితమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమం అయిన రచ్చబండ వేదిక కాంగ్రెస్ తాజా మాజీలతో నిండిపోయింది. బొత్స ఈ ధపా ఎస్.కోట నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు, ప్రజాభిమానం కూడగట్టటానికే ఇలా నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారంటూ పలువురు చర్చించుకున్నారు. గడిచిన నెల రోజుల్లో మంత్రి బొత్స వేపాడలో నాలుగుసార్లు, ఎస్.కోటలో ఒకసారి, జామిలో రెండుసార్లు, లక్కవరపుకోటలో మూడుసార్లు, కొత్తవలసలో మూడు సార్లు పర్యటించారు. 22న జామి, కొత్తవలసలలో జరిగే  రచ్చబండకు,  25న ఎస్.కోటలో జరగనున్న రచ్చబండ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మొత్తంగా సత్తెన్న రచ్చబండ సాక్షిగా రసవత్తర రాజకీయం సాగిస్తున్నారు. బుధవారం నాటి రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, లక్కవరపుకోట సర్పంచ్ సంఘం నాగమణి హాజరు కాలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement