బొత్సకు నేతల ఓదార్పు...?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి అన్నదాత నిలువునా మునిగిపోయాడు. పంటలన్నీ గంగపాలవగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అయి తే ఇలాంటి తరుణంలో వారికి అండగా నిలిచి ఓదార్చవలసిన నాయకులు చేస్తున్నదేమిటి?
అన్నదాతను గాలికి వదిలేసి ఇటీవల ప్రజల చేతిలో పరాభవానికి గురైన తమ గూటికి చెందిన నాయకుడ్ని అనునయిస్తున్నారా? ఆయనకు ధైర్య వచనాలు పలుకుతున్నారా?? అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాను గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. దీంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. అయితే వీరిని పరామర్శించే నెపంతో కేంద్ర మంత్రులు చిరంజీవి, రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీ మోహన్ జిల్లాకు వచ్చారు.
అయితే అన్నదాత కష్టాన్ని చూడలేక, వారికి ఆపన్న హస్తం అందించేందుకే వీళ్లంతా హుటాహుటిన ఇక్కడికి తరలివచ్చారని ఎవరైనా భావి స్తే మాత్రం పొరపాటేనని ఓ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. వాస్తవానికి సదరు నేతలంతా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పలకరించడానికే వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉవ్వెత్తున లేచిన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యవాదులు బొత్స సత్యనారాయణ, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన ప్రతిష్ట రాష్ట్ర వ్యాప్తంగా దిగజారింది. అంతేకాకుండా ప్రసార మాధ్యమాల్లోనూ ఆయనకు వ్యతిరేకకంగా కథనాలు వెల్లువెత్తాయి. ఆయన ఓ రకంగా అవమానకర పరిస్థితిని ఎదుర్కొన్నట్లయింది. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇలా జిల్లాకు వచ్చి పనిలోపనిగా కొన్ని గ్రామాలకు వెళ్లి రైతులను సైతం కలిసినట్లు కలరింగ్ ఇచ్చారు.
అంతే తప్ప బాధితులను ఎలా ఆదుకోవాలనుకుంటున్నదీ కనీసం చెప్పలేదు. గతంలోనూ జిల్లాలో వరదలు వచ్చి పంటలు మునిగాయి. అయితే గతంలో ఏనాడూ ఇంతమంది మంత్రులొచ్చి ప్రజల్ని పరామర్శించిన దాఖలాల్లేవు. జిల్లాలో ఏం జరిగినా అంతా సత్తిబాబే చూసుకునేవారు. పరిస్థితులన్నీ ఆయనే చక్కదిద్దేవారు. అయితే ఇప్పుడు ఆయనకే గడ్డుకాలం దాపురించడంతో నేతలంతా ఆయన్ను పరామర్శించడానికే వచ్చారన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.