పోలీసుల పహారా నడుమ మమ | Rachabanda programme public representatives of the ruling party protests | Sakshi
Sakshi News home page

పోలీసుల పహారా నడుమ మమ

Published Wed, Nov 27 2013 1:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Rachabanda programme public representatives of the ruling party protests

సాక్షి, గుంటూరు :పోలీసుల పహారా నడుమ  రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులు ‘మమ’ అనిపించారు. రచ్చబండలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు.. నిలదీతలు ఎదురైనా.. సభలు రచ్చ రచ్చగా మారినా.. ప్రజా సమస్యల్ని పెడచెవిన పెడుతూ కేవలం అర్జీల స్వీకరణతోనే సరిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా రచ్చబండ సభలు మంగళవారంతో ముగిశాయి. అయితే వాయిదా పడ్డ రెండు మూడు చోట్ల ఈ నెల 30 వరకు గడువిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల ఆశ చూపి జిల్లాలో పలు చోట్ల సభలకు జనాన్ని రప్పించడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమైనప్పటికీ అందిన దరఖాస్తుల పరిష్కారంలో ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తారన్నది తేలాల్సివుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆశలో  ఇబ్బడిముబ్బడిగా అర్జీలు అందజేశారు. 
 
 అక్కడక్కడా రచ్చ..రచ్చ.. 
 జిల్లాలోని తెనాలి డివిజన్ మినహా గుంటూరు, నర్సరావుపేట డివిజన్లలో అక్కడక్కడా రచ్చబండ సభలు రచ్చరచ్చగానే ముగిశాయి. వందల్లో హాజరైన జనం అర్జీలను అందజేసే క్రమంలో కిందటిసారి సమర్పించిన అర్జీల విషయంపైనా అక్కడక్కడా నిలదీశారు. నెలల తర బడి ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నా తమగోడు పట్టించుకున్న వారే కరువయ్యారని గుంటూరు పట్టణంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్న సభల్లోనూ ఈ నిరసనలు, నిలదీతలు కనిపించాయి. 
 
 ఈ సారి అర్జీలపై పరిశీలన జరిపి వాటికి పరిష్కారం చూపకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటేసే ప్రసక్తే లేదంటూ కొందరు మహిళలు తేల్చి చెప్పారు. సభల్లో ప్రసంగించడం, హామీలు గుప్పించడం, ఆపైన అర్జీలు స్వీకరించడంతోనే కార్యక్రమాలు ముగిశాయనిపించారు. తెనాలి డివిజన్‌లోని 18 మండలాల్లోనూ రచ్చబండ సభలు సజావుగానే సాగినా, ప్రజాప్రతినిధుల హాజరు పెద్దగా లేకపోవడం అర్జీదారుల్ని నిరాశ పరిచింది. నర్సరావుపేట మున్సిపాల్టీ, మండలంలో  మంగళవారం జరగాల్సిన రచ్చబండ సభలు వాయిదా పడ్డాయి. ఇక్కడ 29న సభలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కాసు  హాజరయ్యే అవకాశాలు లేకపోవడంతో వాయిదా వేశారు. 
 
 కిందటి అర్జీలకు పరిష్కారమే లేదు.. కిందటి సారి జరిగిన రచ్చబండ సభల్లో సమర్పించిన అర్జీలలో సగం సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. రకరకాల కారణాలు చూపుతూ ఇళ్ల మంజూరు, ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేసిన ప్రభుత్వం ఈసారైనా వాటిని మంజూరు చేస్తుందో లేదోనన్న అనుమానాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. రచ్చబండలో ప్రజల నుంచి అందిన అర్జీలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలంటూ కలెక్టర్ సురేశ్‌కుమార్ అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికలకు ముందు నిధుల్ని విడుదల చేయడం, ఉద్యోగాలు భర్తీ చేయడం వంటి ఓటర్లను ప్రభావితం చేసే జిమ్మిక్కులు  చేపట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ సభల్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మలుచుకొందనే విమర్శలు వినిపించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement