రెంజల్, న్యూస్‌లైన్ : రచ్చబండ సాక్షిగా కలెక్టర్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వంతో పేదలకు ప్రయోజనం చేకూరడం లేదు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మూడోవిడత రచ్చబండతో ప్రజాధనం వృథా అయ్యిందే తప్ప వారికి ఒరిగిందేమి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రచ్చబండలో భాగంగా జిల్లాలో 80వేల రేషన్‌కార్డులు, 4,300మంది అర్హులకు బంగారుతల్లి గుర్తింపుకార్డులు, 40వేల మందికి పింఛన్లు, 11వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు, రూ.19 కోట్లు ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బకాయి మాఫీ పత్రాలు అందించారు. వీరికి డిసెంబర్ నుంచి రూపాయి కిలో బియ్యంతో పాటు పింఛన్లు అందిస్తామని కలెక్టర్ ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలు ప్రశ్నార్థకం కావడంతో లబ్ధిదారులు హైరానా పడుతున్నారు. రేషన్ సరఫరాపై సమాధానం చెప్పలేక డీలర్లు, మండల స్థాయి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రచ్చబండ రోజునే పూర్తిస్థాయిలో మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసినా గ్రామాల్లో నేటికీ పంపిణీ కొనసాగుతోంది.
డిసెంబర్ నుంచి బియ్యం, పింఛన్లు అందించాలని చెప్పినా ఇంతవరకు డీలర్లు డీడీలు కట్టలేదు. జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రతీనెల 15వరకు స్టాక్ వివరాలు మండల కార్యాలయాలకు అందిస్తారు. దాని ఆధారంగా డీలర్లకు 18వరకు అలాట్‌మెంట్‌ను ఇస్తారు. డీలర్లు 20వరకు సంబంధిత బ్యాంకుల్లో డీడీలు కట్టి ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో సమర్పిస్తే 22 నుంచి డీలర్లకు రేషన్ సరుకుల సరఫరా ప్రారంభమవుతుంది. నెల మొదటి తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడం మొదలుపెడతారు. అయితే గతనెల రచ్చబండలో కార్డులు పొందిన వారికి డీఎస్‌ఓ కార్యాలయం నుంచి అలాట్‌మెంట్ రాకపోవడంతో డీలర్లు డీడీలు కట్టలేదని తెలుస్తోంది. దీంతో వారికి డిసెంబర్ నెల బియ్యంతో పాటు పింఛన్లు అందే అవకాశం కనిపించడం లేదు. వచ్చే నెలలోనైనా అందించాలని వారు కోరుతున్నారు.
కొత్త కార్డులకు ఈ నెల బియ్యం లేనట్లే
Published Thu, Dec 5 2013 5:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement