ఎర్రవల్లిలో నినాదాలు చేస్తున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు
మర్కూక్ (గజ్వేల్): సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నిర్వహించనున్న ‘రైతులతో రచ్చబండ’కార్యక్రమం స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రచ్చబండ నిర్వహిస్తే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించగా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు.
దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. ‘జై టీఆర్‌ఎస్, జై కేసీఆర్’.. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్.. గోబ్యాక్ కాంగ్రెస్’అని టీఆర్‌ఎస్ నాయకులు.. ‘కేసీఆర్ డౌన్ డౌన్.. టీఆర్‌ఎస్ డౌన్ డౌన్’అని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
రైతులతో రేవంత్ నేరుగా మాట్లాడతారు
ఎర్రవల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో సభాస్థలం పరిశీలనకు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడుతారని, అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా రచ్చబండ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment