narsareddy
-
‘రచ్చ బండ’ ఖాయం.. అడ్డుకుని తీరుతాం..
మర్కూక్ (గజ్వేల్): సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నిర్వహించనున్న ‘రైతులతో రచ్చబండ’కార్యక్రమం స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రచ్చబండ నిర్వహిస్తే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించగా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. ‘జై టీఆర్ఎస్, జై కేసీఆర్’.. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్.. గోబ్యాక్ కాంగ్రెస్’అని టీఆర్ఎస్ నాయకులు.. ‘కేసీఆర్ డౌన్ డౌన్.. టీఆర్ఎస్ డౌన్ డౌన్’అని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. రైతులతో రేవంత్ నేరుగా మాట్లాడతారు ఎర్రవల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో సభాస్థలం పరిశీలనకు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడుతారని, అడ్డుకోవడానికి టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా రచ్చబండ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. -
దళిత, గిరిజనులకు చేసిందేమిటి?
గజ్వేల్: అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలతో కాలం గడపడం తప్ప దళిత, గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. అంతకుముందు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నదన్నారు. మరోపక్క ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం 2014 నుంచి 2021 వరకు దళితుల అభ్యున్నతికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను దారి మళ్లించారన్నారు. అధికార పార్టీ మోసాలను ఎండగట్టగడానికే రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిల సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి త్వంపై చర్చల్లో శ్రావణ్‌కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటనర్సింహారెడ్డిల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు దామోదర రాజ నర్సింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డి, సురేశ్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, దుబ్బాక సమన్వయకర్త నగేశ్ ముదిరాజ్‌ల అభి ప్రాయం తీసుకోగా ఎక్కువ మంది నర్సారెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్టు తెలు స్తోంది. పార్టీ ఇన్చార్జి మాణిక్యం సోమవారం ఉదయం టీపీసీసీ నేతలతో మరోమారు సమావేశం అయిన తర్వాత ఈ ప్రతిపాదనతో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 7వ తేదీన పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుం దని టీపీసీసీ వర్గాలంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక కోసం 147 మంది ఇన్చార్జులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆదివారం ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు ఏడుగురు ముఖ్యనేతలకు, 140 గ్రామాలకు 140 మంది పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా ఈ నెల 7వ తేదీ నుంచి నియోజకవర్గంలో ఉండి పని చేయాలని ఆయన ఆదేశించారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వం హామీలను విస్మరించింది.. అందుకే నిరాహార దీక్ష
సాక్షి, సిద్దిపేట : ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపడతానని నర్సారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలు, డబుల్ బెడ్రూం నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజలను మేల్కొల్పడానికి, ఇంకా అనేక సమస్యల సాధన కొరకు గజ్వేల్‌లో దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే నేను చేపట్టబోయే దీక్షకు ప్రభుత్వం అడ్డు తగులుతుందని ఆరోపించారు. జిల్లాలో 30వ సెక్షన్ అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుందని, కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం చాలా రోజులుగా కొనసాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మిషన్ భగీరథ కోసం పగలకొట్టిన రోడ్లను మళ్లీ నిర్మించలేదని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్, ఎర్రవల్లిలో సీఎం ఇంటి నిర్మాణం 6 నెలల్లోనే పూర్తి చేశారు.. మరి పేదలకు అందజేయాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎన్ని రోజులు కావాలంటూ నర్సారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
'వారి ఉద్యోగాలు తొలగించే అధికారం కేసీఆర్‌కు లేదు'
సాక్షి, దుబ్బాక : కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసే అధికారం ప్రజలకు ఉంది.. కానీ కార్మికులను తీసేసే అధికారం కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ రెండు లక్షల అరవై కోట్ల అప్పు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు 39 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్రను ప్రభుత్వం మరిచిపోయిందని, రెండు నెలలుగా కార్మికులు అన్ని పండుగలకు దూరమై ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. దాదాపు కోటి మంది జనాభాకు రవాణా సదుపాయం కల్పిస్తున్న కార్మికుల పట్ల కేసీఆర్ అహంకార దోరణిని ప్రదర్శించడం తగదని హెచ్చరించారు. ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు సంస్థను లాబాల్లోకి తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం కార్మికుల పట్ల కఠిన వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆర్టీసీకి రావాల్సిన మూడు వందల కోట్లు ఇవ్వాలని కేసీఆర్ బిల్లు పాస్ చేస్తే ఆయన కొడుకు కేటీఆర్ మాత్రం బిల్లును ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలనిపేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ నష్టానికి కార్మికులే భారమైతే ఆంధ్రలో ఈ పరిస్థితి ఎందుకు రాలేదో చెప్పాలని తెలిపారు. దేశంలో అన్నిటికంటే ఎక్కువ జాతీయ అవార్డులు పొందిన ఏకైక సంస్థ ఆర్టీసీయేనని వెల్లడించారు. ఇప్పటికైనా కేశవరావు, హరీష్ రావులు కార్మికుల పక్షాన నిలబడాలని, లేదంటే మీ పదవులు ఊడడం ఖామమని హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస నేత తూంకుంట నర్సారెడ్డి తెలిపారు.సిద్దిపేట లో ట్రిపుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు పథనం సిద్దిపేట నుంచి త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. -
అన్నా.. పచ్చ కండువా కప్పుకో!
ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, స్వామిగౌడ్‌లకు అరికెల ఆఫర్ హైదరాబాద్: ‘ఏ రంగైతే ఏందన్నా... మా పార్టీ రంగు కండువా కప్పుకో’ అన్నట్టుగా శాసనమండలిలో టీడీపీ పక్ష నాయకుడు అరికెల నర్సారెడ్డి సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఆఫర్లు ఇచ్చి ఆకట్టుకున్నారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఎన్నికల ముందు కారెక్కిన పి.నరేందర్ రెడ్డి మండలిలో ప్రమాణం చేసి వెళ్తుండగా... చివరి వరుసలో కూర్చొన్న అరికెల నర్సారెడ్డి నవ్వుతూ తన మెడలోని పచ్చజెండా తీసి తీసుకోమన్నట్టుగా సైగలు చేశారు. దీంతో నరేందర్‌రెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు. అలాగే చివరలో మరో ఎమ్మెల్సీ స్వామి గౌడ్‌ను ప్రమాణం చేయాల్సిందిగా చైర్మన్ విద్యాసాగర్ పిలిచినప్పుడు.. ఆయన మెడలో టీఆర్ఎస్ కండువా లేదు. దాంతో కండువా ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డిని అడిగారు. ఇది గమనించిన అరికెల పచ్చ కండువా తీసి స్వామిగౌడ్‌కు ఆఫర్ చేశారు. అప్పటికే సుధాకర్‌రెడ్డి స్వామిగౌడ్‌కు కండువా ఇవ్వడంతో అది తీసుకొని ప్రమాణం చేశారు. -
గజ్వేల్ లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
గజ్వేల్, న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్‌లోనితెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్ఎస్లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే.. కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్‌రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్‌నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. -
ఉలిక్కిపడిన అక్కారం
గజ్వేల్, న్యూస్‌లైన్: మండలంలోని అక్కారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వేళ ఊరంతా షాక్‌కు గురైంది. సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణలో విద్యుత్‌శాఖ యంత్రాంగం ప్రదర్శిస్తున్న అలసత్వానికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. విద్యుదాఘాతానికి బుడిగె చంద్రయ్య(35), బుడిగె రాజు(28) మృతి చెందిన సంగతి తెలిసిందే.. రోజువారీ కూలీతో పూట గడుపుకునే బాధిత కుటుంబాలలో తీరని శోకం అలుముకుంది.. సమాచారం తెలుసుకుని గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామస్థులు నిలదీశారు. నిర్లక్ష్యంవల్లే ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మృతుల కుటుంబాలకు శాఖాపరంగా రూ.లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విద్యుత్‌శాఖ డొల్లతనం మరోసారి బయటపడింది. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అనూహ్యంగా ‘ఊరంతా షాక్’ ఇందుకు నిదర్శనంగా నిలిచింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తలెత్తిన ఎర్తింగ్ లోపంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. అందరి ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ముట్టుకున్నా, ఇనుప వస్తువులను తాకినా షాక్‌కు గురయ్యారు. తొలుత గ్రామంలో కరెంట్ పనులు చేసే తిప్పారం యాదగిరి తన ఇంట్లో ట్యూబ్లైటు సరిచేస్తూ షాక్‌కు గురయ్యాడు. ఈ సందర్భంగా అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. దీంతో అతను సంబంధిత లైన్‌మన్‌కు సమాచారం అందించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కోరాడు. అయినా సరఫరా బంద్ కాలేదు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో సెల్ చార్జింగ్ పెడుతూ బుడిగె రాజు మృతి చెందాడు. కాగా బుడిగె చంద్రయ్య తన ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఇనుప డోరును తీస్తూ షాకు బారిన పడి మృతి చెందాడు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుసగా మరణాలు సంభవించడంతో ఇళ్లల్లో ఉన్న వారంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఫోన్లో మాట్లాడటంతో సరఫరా నిలిచిపోయింది. ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో అదే రాత్రి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని గ్రామస్థులకు సూచించగా వారు ఒప్పుకోలేదు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఆ రెండు కుటుంబాలకు పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించి కూర్చున్నారు. రాత్రంతా దయనీయస్థితిలో శవజాగారం చేశారు. బాధిత కుటుంబాలకు నేతల పరామర్శ బాధిత కుటుంబీకులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి పరామర్శించారు. కుటుంబీకులకు న్యాయం చేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. కలెక్టర్‌కు ఫిర్యాదు విద్యుత్ షాక్ గల కారణాలను తెలుసుకోవడానికి ఉదయం గ్రామాన్ని సందర్శించిన ఆ శాఖ తూప్రాన్ డీఈ యాదయ్య, గజ్వేల్ శాఖ ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్ కుమార్‌ను గ్రామస్థులు తీవ్రస్థాయిలో నిలదీశారు. నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని కోపోద్రిక్తులయ్యారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని పట్టుబట్టడంతో రూ. లక్ష చొప్పున చెల్లిస్తామని డీఈ యాదయ్య ప్రకటించారు. దీంతో గ్రామస్థులు శవాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామాన్ని విద్యుత్ శాఖ ఎస్ఈ రాములు సందర్శించారు. ‘ఊరంతాషాక్ల’కు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపారు. ఇదిలావుంటే శుక్రవారం గజ్వేల్‌లో ‘మార్పు’ సమీక్షా సమావేశానికి హాజరైన కలెక్టర్ స్మితాసబర్వాల్‌కు గ్రామస్థులు ‘ఊరంతా షాక్’ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విచారణ జరపాలని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డిని ఆదేశించారు. ‘ఊరంతా షాక్’ల పర్వం అక్కారం గ్రామాన్ని మూడేళ్లుగా వణికిస్తోంది. మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ మంద శ్రీనివాస్ షాక్ గురై మృతిచెందాడు. అంతకుముందు గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు మల్లేశం షాక్‌కు గురై మత్యువాతకు గురయ్యాడు. ఈ రెండు కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహరం అందలేదు. తాజాగా గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన బుడిగె చంద్రయ్యకు భార్య కనకమ్మ, పదేళ్లలోపు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఈ కుటుంబానిది. విద్యుత్ షాక్ రూపంలో చంద్రయ్యను మృత్యువు కబళించడంతో అతని కుటుంబీకులు దిక్కులేని వారయ్యారు. బుడిగే రాజుకు భార్య రేణుకతోపాటు పదేళ్లలోపు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ యజమాని మరణంతో కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని ఈ కుటుంబాన్ని అగాధంలోకి నెట్టేసింది. విద్యుత్ శాఖ ఏఈపై వేటు అక్కారం గ్రామంలో చోటుచేసుకున్న ‘ఊరంతా షాక్’ ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖ(ఏపీసీపీడీసీఎల్) గజ్వేల్ ఏఈ అనిల్‌కుమార్‌పై వేటు వేసింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనే అభియోగంతో ఆయనను ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ యాదయ్య ధ్రువీకరించారు. -
ప్రభుత్వ భూమి స్వాధీనంపై దుమారం
గజ్వేల్, న్యూస్‌లైన్ : గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలోగల ప్రభుత్వ భూమి స్వాధీన ప్రక్రియ దుమారం రేపింది. స్వాధీనానికి అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు 15 మంది దళితులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం, దీనిని తట్టుకోలేక ఓ మహిళా సొమ్మసిల్లి పడిపోవడం వివాదాస్పదమైంది. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజిరెడ్డిపల్లిలోని 155/1 సర్వే నంబర్లో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫెన్సింగ్ వేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ భూమిని గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉన్నామని, దీనిపై పట్టాలిచ్చి తమకు ఆదుకోవాలని గ్రామానికి చెందిన ఎస్సీ భూ బాధితులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వాధీన ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాయిత యాదమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం తెలుసుకున్న టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్సీల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుండగా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేద దళితులు 30 ఏళ్లుగా సాగులో ఉన్న భూములను టార్గెట్‌గా చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. ప్రధాని చేతుల మీదుగా జిల్లాలో భూ పంపిణీ జరగ్గా ఈ పేదలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డికి పట్టదా? అంటూ విమర్శించారు. భేషరుతుగా దళితులపై కేసులను ఎత్తి వేయడమే కాకుండా ఆ భూమిపై పట్టాలిచ్చి హక్కులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, టీడీపీ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఉప్పల మెట్టయ్య, నాయకులు విరాసత్ అలీ, నయ్యర్ పఠాన్, మతిన్, బోస్, ఆర్కే శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి కోట కిశోర్, సీఐటీయూ నాయకులు జంగం నాగరాజులు సంఘీభావం తెలిపారు.