ఉలిక్కిపడిన అక్కారం | two persons died due to electricity department negligence | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన అక్కారం

Published Sat, Dec 28 2013 3:00 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

two persons died due to electricity department negligence

గజ్వేల్, న్యూస్‌లైన్: మండలంలోని అక్కారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వేళ ఊరంతా షాక్‌కు గురైంది. సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణలో విద్యుత్‌శాఖ యంత్రాంగం ప్రదర్శిస్తున్న అలసత్వానికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. విద్యుదాఘాతానికి బుడిగె చంద్రయ్య(35), బుడిగె రాజు(28) మృతి చెందిన సంగతి తెలిసిందే.. రోజువారీ కూలీతో పూట గడుపుకునే బాధిత కుటుంబాలలో తీరని శోకం అలుముకుంది.. సమాచారం తెలుసుకుని గ్రామానికి వచ్చిన  అధికారులను గ్రామస్థులు నిలదీశారు. నిర్లక్ష్యంవల్లే ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మృతుల కుటుంబాలకు శాఖాపరంగా రూ.లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

 ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విద్యుత్‌శాఖ డొల్లతనం మరోసారి బయటపడింది. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అనూహ్యంగా  ‘ఊరంతా షాక్’ ఇందుకు నిదర్శనంగా నిలిచింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తలెత్తిన ఎర్తింగ్ లోపంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. అందరి ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ముట్టుకున్నా, ఇనుప వస్తువులను తాకినా షాక్‌కు గురయ్యారు. తొలుత గ్రామంలో కరెంట్ పనులు చేసే తిప్పారం యాదగిరి తన ఇంట్లో ట్యూబ్‌లైటు సరిచేస్తూ షాక్‌కు గురయ్యాడు. ఈ సందర్భంగా అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. దీంతో అతను సంబంధిత లైన్‌మన్‌కు సమాచారం అందించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కోరాడు.

 అయినా సరఫరా బంద్ కాలేదు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో సెల్ చార్జింగ్ పెడుతూ బుడిగె రాజు మృతి చెందాడు. కాగా బుడిగె చంద్రయ్య తన ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఇనుప డోరును తీస్తూ షాకు బారిన పడి మృతి చెందాడు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుసగా మరణాలు సంభవించడంతో ఇళ్లల్లో ఉన్న వారంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఫోన్‌లో మాట్లాడటంతో సరఫరా నిలిచిపోయింది. ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో అదే రాత్రి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని గ్రామస్థులకు సూచించగా వారు ఒప్పుకోలేదు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఆ రెండు కుటుంబాలకు పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించి కూర్చున్నారు. రాత్రంతా దయనీయస్థితిలో శవజాగారం చేశారు.

 బాధిత కుటుంబాలకు  నేతల పరామర్శ
 బాధిత కుటుంబీకులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి పరామర్శించారు. కుటుంబీకులకు న్యాయం చేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబీకులను ఓదార్చారు.  
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 విద్యుత్ షాక్ గల కారణాలను తెలుసుకోవడానికి ఉదయం గ్రామాన్ని సందర్శించిన ఆ శాఖ తూప్రాన్ డీఈ యాదయ్య, గజ్వేల్ శాఖ ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్ కుమార్‌ను గ్రామస్థులు తీవ్రస్థాయిలో నిలదీశారు. నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని కోపోద్రిక్తులయ్యారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని పట్టుబట్టడంతో రూ. లక్ష చొప్పున చెల్లిస్తామని డీఈ యాదయ్య ప్రకటించారు. దీంతో గ్రామస్థులు శవాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామాన్ని విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాములు సందర్శించారు. ‘ఊరంతాషాక్‌ల’కు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపారు. ఇదిలావుంటే శుక్రవారం గజ్వేల్‌లో ‘మార్పు’ సమీక్షా సమావేశానికి హాజరైన కలెక్టర్ స్మితాసబర్వాల్‌కు గ్రామస్థులు ‘ఊరంతా షాక్’ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విచారణ జరపాలని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డిని ఆదేశించారు.

 ‘ఊరంతా షాక్’ల పర్వం అక్కారం గ్రామాన్ని మూడేళ్లుగా వణికిస్తోంది. మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ మంద శ్రీనివాస్ షాక్ గురై మృతిచెందాడు. అంతకుముందు గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు మల్లేశం షాక్‌కు గురై మత్యువాతకు గురయ్యాడు. ఈ రెండు కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహరం అందలేదు. తాజాగా గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన బుడిగె చంద్రయ్యకు భార్య కనకమ్మ, పదేళ్లలోపు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఈ కుటుంబానిది. విద్యుత్ షాక్ రూపంలో చంద్రయ్యను మృత్యువు కబళించడంతో అతని కుటుంబీకులు దిక్కులేని వారయ్యారు. బుడిగే రాజుకు భార్య రేణుకతోపాటు పదేళ్లలోపు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ యజమాని మరణంతో కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని ఈ కుటుంబాన్ని అగాధంలోకి నెట్టేసింది.
 విద్యుత్ శాఖ ఏఈపై వేటు
 అక్కారం గ్రామంలో చోటుచేసుకున్న ‘ఊరంతా షాక్’ ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖ(ఏపీసీపీడీసీఎల్) గజ్వేల్ ఏఈ అనిల్‌కుమార్‌పై వేటు వేసింది.
    విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనే అభియోగంతో ఆయనను ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ యాదయ్య ధ్రువీకరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement