గజ్వేల్, న్యూస్‌లైన్ : గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలోగల ప్రభుత్వ భూమి స్వాధీన ప్రక్రియ దుమారం రేపింది. స్వాధీనానికి అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు 15 మంది దళితులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం, దీనిని తట్టుకోలేక ఓ మహిళా సొమ్మసిల్లి పడిపోవడం వివాదాస్పదమైంది. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
రాజిరెడ్డిపల్లిలోని 155/1 సర్వే నంబర్‌లో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫెన్సింగ్ వేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ భూమిని గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉన్నామని, దీనిపై పట్టాలిచ్చి తమకు ఆదుకోవాలని గ్రామానికి చెందిన ఎస్సీ భూ బాధితులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వాధీన ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాయిత యాదమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం తెలుసుకున్న టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్సీల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుండగా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేద దళితులు 30 ఏళ్లుగా సాగులో ఉన్న భూములను టార్గెట్‌గా చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. ప్రధాని చేతుల మీదుగా జిల్లాలో భూ పంపిణీ జరగ్గా ఈ పేదలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డికి పట్టదా? అంటూ విమర్శించారు. భేషరుతుగా దళితులపై కేసులను ఎత్తి వేయడమే కాకుండా ఆ భూమిపై పట్టాలిచ్చి హక్కులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, టీడీపీ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఉప్పల మెట్టయ్య, నాయకులు విరాసత్ అలీ, నయ్యర్ పఠాన్, మతిన్, బోస్, ఆర్‌కే శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి కోట కిశోర్, సీఐటీయూ నాయకులు జంగం నాగరాజులు సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వ భూమి స్వాధీనంపై దుమారం
Published Tue, Dec 24 2013 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement