public protests
-
ఎంపీపీ అనగాని రవి అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
-
ఈ మార్పు మంచికేనా?
ప్రజాందోళన పెరిగితే దాన్ని నీరుగార్చడానికైనా పాలకులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కనీసం వేసినట్టు కనిపిస్తారు. మూడు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతెన్యాహూ ఆ పనే చేశారు. ప్రభుత్వమే జవాబుదారీ అంటూ ఆ దేశ న్యాయమూర్తులకు ఇప్పటి దాకా అనేక అధికారాలున్నాయి. వాటిని నిర్వీర్యపరిచేలా న్యాయ వ్యవస్థలో మార్పులకు దిగిన ఆయన, చివరకు ప్రజాగ్రహంతో ఆగాల్సి వచ్చింది. రక్షణమంత్రిపై వేటు ప్రకటన గత వారాంతంలో కథలో ఈ కొత్తమలుపునకు దారి తీసింది. ప్రధాని చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘం సమ్మెకు దిగేసరికి, ఆస్పత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విదేశాల్లో ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు – అన్నీ సోమవారం మూతబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, సొంత దేశాధ్యక్షుడితో పాటు అమెరికా సహా అంత ర్జాతీయ సమాజదృష్టి పడడంతో ఒత్తిడి పెరిగి నెతెన్యాహూ మనసు మార్చుకున్నట్టు కనిపించారు. మిత్రదేశమైన అమెరికా సైతం నెతెన్యాహూకు సుద్దులు చెప్పాల్సి వచ్చింది. రక్షణమంత్రి ఉద్వాసన వార్తలందాక కలవరపడి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని ఇజ్రాయెల్‌ను పదే పదే హెచ్చరించింది. మార్పులకు విరామమిచ్చినట్టు నెతెన్యాహూ ప్రకటించగానే, ఆయనను అమెరికా అధ్యక్షుడితో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు అమెరికన్ రాయబారి వెల్లడించడం గమనార్హం. ప్రధానిగా నెతెన్యాహూ పదవి చేపట్టి 3 నెలలు దాటినా, ఇంతవరకూ కలవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు హుటాహుటిన భేటీ జరపనుండడం ఆసక్తికర పరిణామమే. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి. వాషింగ్టన్, జెరూసలేమ్‌ల సైనిక భాగస్వామ్యంపైనే దాని దృష్టి. నిజానికి మార్పుల్ని వ్యతిరేకించిన రక్షణమంత్రిని ఇంటికి పంపి, తన పంతం నెగ్గించుకోవచ్చని నెతెన్యాహూ తప్పుగా అంచనా వేశారు. ఇజ్రాయెలీ సైనికదళాలకు వెన్నెముక లాంటి సైనిక రిజర్వి స్టులు సైతం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో దేశ భద్రతకే ముప్పొచ్చింది. ఎగసిన వ్యతిరేకతకు తలొగ్గి, మార్పులకు సర్కార్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. 73 ఏళ్ళ నెతన్యాహూ మాట నమ్మి, కార్మిక సంఘం సమ్మె విరమించింది. అలా మంగళవారం ఇజ్రాయెలీ వీధులు పైకి ప్రశాంతంగా కనిపించాయి. కానీ, సంక్షోభం పరిష్కారమైందనుకోలేం. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నెతెన్యాహూ జడ్జీల ఎంపిక వ్యవస్థపై పట్టు బిగించే ప్రతిపాదిత బిల్లుకు పూర్తిగా స్వస్తి పలికారనుకోలేం. మిత జాతీయవాదులు, ఛాందసులు, అతి మితవాదుల కలగాపులగమైన సంకీర్ణ సర్కారు ఆ బిల్లు తుది రూపాన్ని మంగళవారం పరిశీలనకు చేపట్టడమే అందుకు ఉదాహరణ. జనం ఎన్నుకొనని శిష్టవర్గీయుల చేతిలో, వామపక్షం వైపు మొగ్గే వ్యవస్థగా జ్యుడీషియరీ మారిందనేది ప్రభుత్వ ఆరోపణ. సుప్రీం కోర్ట్ నిర్ణయాల్ని సైతం సాధారణ మెజారిటీతో పార్లమెంట్ కొట్టిపారేసే వీలు కల్పించాలనీ, జడ్జీల నియామక సంఘంలో ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలనీ, న్యాయ సలహాదారుల సలహాను మంత్రులు శిరసావహించాలనే చట్టాన్ని ఎత్తేయా లనీ... ఇలా పలు మార్పులు చేద్దామని ప్రభుత్వ యోచన. కానీ, ఈ మార్పులు చివరకు న్యాయ వ్యవస్థను నీరుగార్చి, పాలకుల వైపే మొగ్గుతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళన. ప్రభుత్వం మాత్రం పాలకులకు మరింత జవాబుదారీగా ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలనే తమ ప్రయత్నం అంటోంది. దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామిక మని నెతెన్యాహూ బృందం వాదిస్తోంది. వెరసి, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు కథ మళ్ళీ పైకి రావచ్చు. ఈ 2 నెలల జాప్యంతో భారీ పౌర నిరసనపై నీళ్ళు జల్లి, ఏకాభిప్రాయం పేర ఏదో ఒక రూపంలో బిల్లుకు ముద్ర వేయాలనేది పాలకుల ప్రస్తుత వ్యూహం. అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం నెతెన్యాహూ స్వభావం కాబట్టి, కుట్రలకు ఆయన తెర దించేవరకూ ప్రజా ఉద్యమంతో ఒత్తిడి పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో నెతెన్యాహూకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రాజకీయ బుద్ధి సూక్ష్మతకూ, అవసరమైతే రాజీపడే నేర్పుకూ గట్టి దెబ్బే తగిలింది. పరస్పర విరుద్ధ ఎన్నికల హామీ లిచ్చిన పార్టీల్ని సైతం కలుపుకొని, పంచకూట కషాయమైన సంకీర్ణ సర్కార్‌ను ఆయన ఏర్పాటుచేసి నిండా 4 నెలలైనా కాలేదు. న్యాయవ్యవస్థను తిరగదోడే పని ఆయన కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఆపేస్తే సంకీర్ణంలో అతి మితవాద పక్షాలు వైదొలగుతాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. దీన్నెలా దాటతారన్న దాన్నిబట్టి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో తేలుతుంది. వరుస సంక్షోభాలతో, గత నాలుగేళ్ళలో 5 సార్లు ఎన్నికలతో ఇజ్రాయెల్ రాజకీయ అని శ్చితితో సతమతమవుతోంది. మళ్ళీ వెంటనే మరో ఎన్నికను భరించలేని ఇజ్రాయెల్‌కూ, అక్కడి ప్రజాస్వా మ్యానికీ తాజా సంక్షోభం మరో అగ్నిపరీక్ష. కాకపోతే మూడు నెలలుగా లక్షలాది ప్రజలు వీధికెక్కి, తెలుపు – నీలం రంగుల జాతీయ పతకాన్ని చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా హింసాకాండ చెలరేగకపోవడం, చుక్క రక్తం చిందకపోవడం చెప్పుకోవాల్సిన విశేషం. జీవం తొణికిస లాడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ప్రజలకు దక్కింది తాత్కాలిక విజయమే కావచ్చు. లక్షలాది జనం పార్లమెంట్ ముంగిట చేస్తున్న ‘డెమోక్రాషియా’ (ప్రజాస్వామ్యం) నినాదాలు, ప్రతిధ్వనిస్తున్న జెరూసలేమ్ వీధుల ప్రజాచేతన... ప్రపంచానికి ఆశాకిరణాలు. -
విషవు రాతలపై ఫైర్
-
హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): విలువైన భూములను త్యాగం చేసి హెరిటేజ్ ఫ్యాక్టరీకి ఇస్తే అడుగడుగునా తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ చంద్రగిరి మండలం కాశిపెంట్ల పంచాయతీ పరిధిలోని కాశిపెంట్ల, దిగువ కాశిపెంట్ల, మొరవపల్లి, కొత్త ఇండ్లు గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సోమవారం కాశిపెంట్లలోని హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. పాల వ్యాన్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు మాట్లాడుతూ హెరిటేజ్ ఫ్యాక్టరీ నిర్మించడం ద్వారా స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నమ్మించి భూములు తీసుకున్నారని తెలిపారు. అర్హతకు తగిన ఉద్యోగం కాకుండా నాలుగో తరగతి ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. పాల సేకరణ కోసం ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలను అద్దెకు తీసుకున్నారని వాపోయారు. అమరావతిలో రైతులకు అన్యాయం జరిగిందంటూ నిరసనలకు దిగుతున్న చంద్రబాబు 25 ఏళ్ల క్రితం ఆయనను నమ్మి భూములిచ్చిన రైతులు నేడు వీధిన పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యాలను భరిస్తూ చంద్రబాబుకు అండగా నిలిస్తే, స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. స్థానికుల డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్లాంట్ అధికారులు హామీ ఇవ్వగా.. 15 రోజుల్లోపు పరిష్కరించకుంటే తిరిగి నిరసనకు దిగుతామని హెచ్చరించిన గ్రామస్తులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. -
ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాల్ని ఆపాలి: హరగోపాల్
హైదరాబాద్: ప్రజా ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాలను ఆపాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. భూమి కింద ఉన్న అభివృద్ధిని చూస్తున్నారు కాని భూమిపైన ఉన్న మనుషుల్ని చూడటంలేదని, మనుషుల కోసమే అభివృద్ధి అని ఇప్పుడు వారినే విధ్వంసం చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని, సహజ వనరులు ఉండటమే ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఈ విధ్వంసం నుంచి దూరం కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్రం ఏర్పడ్డాక మార్పు ఉంటుందని భావించామని, కాని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గత పాలకులు చేసినట్టుగానే వ్యవహరిస్తోం దని విమర్శించారు. జాతీయత, దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు వనరులను కాపాడుతుందనుకుంటే పరుగెత్తి మార్కెట్‌ను పూర్తిగా ఓపెన్ చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియంను బయటకు తీశామంటే అది విషంగా మారుతుందని, గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించారు. నదులు, నీరు, గాలి విషతుల్యమై ఆదివాసీలతో పాటు హైదరాబాద్ ప్రజలు కూడా విషపు నీరు తాగాల్సి వస్తుందని, అలాంటి అభివృద్ధి అవసరమా అని టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. ఇది కేవలం నల్లమల సమస్య కాదని, అమరావతి, హైదరాబాద్‌కు కూడా ప్రమాదకరమన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ హోదాతో ఇక్కడికి వచ్చావ్..!
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫమైన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులను ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేశాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. తాజగా వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుదేశం నాయకులకు ఇదే పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం ఇనగలూరులో శుక్రవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం నేత, శాసన మండలి మాజీ వైఎస్ ఛైర్మెన్ సతీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అక్కడి ప్రజలను నుంచి సతీష్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఏహోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ స్థానిక ప్రజలు ఆయన్ను నిలదీశారు. దీంతో సతీష్‌రెడ్డి చేసేది ఏమీలేక అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగాడు. -
బ్రిటిష్ చట్టాన్ని ఇప్పటికీ అమలు చేయడమా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడం బ్రిటిష్ కాలం నాటి అంశం. జాతీయవాదులు ఒకే చోట సమావేశం కాకుండా, గుమికూడకుండా ఉండేందుకు నాడు బ్రిటిష్ పాలకులు చట్టంలో ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఈ సెక్షన్ ను ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అందుకు బదులుగా దుర్వినియోగం చేస్తోందని చెప్పడం ఇక్కడ ఎంతైన సబబు. ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాల లాంటి వివిధ రకాల ప్రజా పోరాటాలను, ముఖ్యంగా ప్రభుత్వం పట్ల అసంతప్తిని అణచివేసేందుకు ఈ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు నలుగురికి మించి ఒక చోట గుమికూడరాదు. సమావేశం కాకూడదు. ప్రసంగాలు, నినాదాలు చేయరాదు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మాత్రమే, అంటే శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు మాత్రమే ఈ సెక్షన్‌ను ఉపయోగించాలి. అంటే జాతుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య అల్లర్లు చెలరేగిన సందర్భాల్లో, ఫలానా ప్రజాందోళన కార్యక్రమం వల్ల శాంతియుత పరిస్థితులకు కచ్చితంగా భంగం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే, మరోవిధంగా చెప్పాలంటే అత్యయిక పరిస్థితుల్లోనే ఈ సెక్షన్‌ను ఉపయోగించాలి. కానీ మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాస్తూ ప్రజల ఆందోళనలను, నిరసనలను, ధర్నాలను, ర్యాలీలను అడ్డుకునేందుకు అడ్డగోలుగా ఈ సెక్షన్‌ను ఉపయోగిస్తున్నాయి. శాంతియుత పరిస్థితులు నెలకొనడం కోసం తాత్కాలిక ప్రాతిపదికనే, అంటే రెండు నెలలకు మించి ఈ సెక్షన్‌ను అమలు చేయడానికి వీల్లేదు. కానీ ఢిల్లీలో పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాల వద్ద ప్రతిరోజు ఈ సెక్షన్ అమల్లో ఉంటోంది. అంటే ప్రతి రెండు నెలలకోసారి ఈ నిషేధాజ్ఞలను ఢిల్లీ పోలీసులు నోటిఫికేషన్ ద్వారా గుడ్డిగా పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం ఉద్యమాలు చేపడుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేయడం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ ను వేదికగా ఎంపిక చేసుకున్నారు. గతంలో పార్లమెంట్ భవనం ముందు వరకు ప్రజల నిరసన ప్రదర్శనలను అనుమతించేవారు. 1988లో భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ కొన్ని లక్షల మంది రైతులతో ర్యాలీ తీయడంతో ఇండియా గేట్ సమీపంలోని మున్సిపల్ లాన్స్, బోట్ క్లబ్, రాజ్ పథ్, పార్లమెంట్ భవనం వరకు రైతులు నిండిపోయారు. ఆ తర్వాత నుంచి పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాలకు సమీపంలో 144వ సెక్షన్‌ను అమలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద కూడా ప్రజల ఆందోళనకు ఆస్కారం లేకుండా పోయింది. తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎంపీలు, సంపన్నులు ‘గ్రీన్ ట్రిబ్యునల్’ను ఆశ్రయించడంతో ప్రజల ఆందోళన వేదికను పోలీసులు రామ్ లీలా మైదాన్‌కు మార్చారు. అక్కడ ప్రజలు తమ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలంటే అందుకు డబ్బులు చెల్లించాలి. ఈ నేపథ్యంలోనే ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అన్యాయంగా ఉపయోగిస్తున్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని లేదంటూ దాన్ని ప్రయోగించడానికి సరైన మార్గదర్శకాలనైనా సూచించాలని రిట్లో డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రజలకుగల హక్కులకు, శాంతి భద్రతల పరిరక్షణకు మధ్య సమతౌల్యాన్ని పాటించేందుకు మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఈ పిటిషన్ వాదనలను సోమవారం నాడు ఆలకించిన జస్టిస్ ఏకే సిక్రీ, ఆశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్ తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఎప్పుడో ఆచార్య జగదీశ్వరానంద అవధూత కేసులోనే 144వ సెక్షన్ దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అప్పుడే ప్రజా సంఘాలు రిటి పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండింది. ఇంతకాలానికైనా దాఖలైనందుకు ముదావహం. -
ప్రభుత్వ భూమి స్వాధీనంపై దుమారం
గజ్వేల్, న్యూస్‌లైన్ : గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలోగల ప్రభుత్వ భూమి స్వాధీన ప్రక్రియ దుమారం రేపింది. స్వాధీనానికి అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు 15 మంది దళితులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం, దీనిని తట్టుకోలేక ఓ మహిళా సొమ్మసిల్లి పడిపోవడం వివాదాస్పదమైంది. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజిరెడ్డిపల్లిలోని 155/1 సర్వే నంబర్లో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫెన్సింగ్ వేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ భూమిని గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉన్నామని, దీనిపై పట్టాలిచ్చి తమకు ఆదుకోవాలని గ్రామానికి చెందిన ఎస్సీ భూ బాధితులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వాధీన ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాయిత యాదమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం తెలుసుకున్న టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్సీల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుండగా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేద దళితులు 30 ఏళ్లుగా సాగులో ఉన్న భూములను టార్గెట్‌గా చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. ప్రధాని చేతుల మీదుగా జిల్లాలో భూ పంపిణీ జరగ్గా ఈ పేదలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డికి పట్టదా? అంటూ విమర్శించారు. భేషరుతుగా దళితులపై కేసులను ఎత్తి వేయడమే కాకుండా ఆ భూమిపై పట్టాలిచ్చి హక్కులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, టీడీపీ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఉప్పల మెట్టయ్య, నాయకులు విరాసత్ అలీ, నయ్యర్ పఠాన్, మతిన్, బోస్, ఆర్కే శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి కోట కిశోర్, సీఐటీయూ నాయకులు జంగం నాగరాజులు సంఘీభావం తెలిపారు.