హెరిటేజ్ ప్రధాన ద్వారం వద్ద స్థానికులు ఆందోళనకు దిగడంతో నిలిచిపోయిన పాల సేకరణ వాహనాల రాకపోకలు
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): విలువైన భూములను త్యాగం చేసి హెరిటేజ్ ఫ్యాక్టరీకి ఇస్తే అడుగడుగునా తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ చంద్రగిరి మండలం కాశిపెంట్ల పంచాయతీ పరిధిలోని కాశిపెంట్ల, దిగువ కాశిపెంట్ల, మొరవపల్లి, కొత్త ఇండ్లు గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సోమవారం కాశిపెంట్లలోని హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. పాల వ్యాన్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు మాట్లాడుతూ హెరిటేజ్ ఫ్యాక్టరీ నిర్మించడం ద్వారా స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నమ్మించి భూములు తీసుకున్నారని తెలిపారు. అర్హతకు తగిన ఉద్యోగం కాకుండా నాలుగో తరగతి ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. పాల సేకరణ కోసం ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలను అద్దెకు తీసుకున్నారని వాపోయారు.
అమరావతిలో రైతులకు అన్యాయం జరిగిందంటూ నిరసనలకు దిగుతున్న చంద్రబాబు 25 ఏళ్ల క్రితం ఆయనను నమ్మి భూములిచ్చిన రైతులు నేడు వీధిన పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యాలను భరిస్తూ చంద్రబాబుకు అండగా నిలిస్తే, స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. స్థానికుల డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్లాంట్ అధికారులు హామీ ఇవ్వగా.. 15 రోజుల్లోపు పరిష్కరించకుంటే తిరిగి నిరసనకు దిగుతామని హెచ్చరించిన గ్రామస్తులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment