heritage company
-
అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర లబ్ధి కోసమే ఐఆర్ఆర్ భూ దోపిడీ
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) భూ దోపిడీ వ్యవహారంలో అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసు అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర సహకారానికి సంబంధించినదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసు అని చంద్రబాబు తరపు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కుటుంబానికి, పార్టీ కి, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు పరస్పరం సహకరించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, బాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరపున ఏజీ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పోలీసు కస్టడీ కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి వీల్లేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడానికి వీల్లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికే అరెస్టయిన నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన డీఫాల్ట్‌గా కస్టడీలో ఉన్నట్లు భావిస్తూ ఆయన న్యాయవాదులు ప్రస్తావిస్తున్న తీర్పులు ఇక్కడ వర్తించవన్నారు. ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్, మరో కేసులో పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడంలేదు కాబట్టే, ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందని చెప్పారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదన్నారు. కింది కోర్టుకెళ్లకుండా నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం శ్రీరామ్ వాదనల నిమిత్తం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గత ప్రభుత్వం, అధికారులు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలకు నేర స్వభావాన్ని ఆపాదిస్తున్నారని తెలిపారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగలేదని, ఎలాంటి భూమినీ సేకరించలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. హెరిటేజ్ కంపెనీతో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. అది లిస్టింగ్ కంపెనీ అని, లక్షల మంది వాటాదారులున్నారని తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా 2014లో ఆ కంపెనీ అమరావతి పరిధిలో కొన్న భూమి రింగ్ రోడ్డుకు 9 కి.మీ. దూరంలో ఉందన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పు ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చారని, అందులో భాగంగానే కరకట్ట వద్ద ఉన్న ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లింగమనేని రమేష్ ఖాతాలో జమ చేసిన రూ.27 లక్షలు అవినీతి సొమ్ము కాదని, ఈ డబ్బు చంద్రబాబు తను ఉంటున్న ఇంటికి చెల్లించిన అద్దె మొత్తమని తెలిపారు. -
హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): విలువైన భూములను త్యాగం చేసి హెరిటేజ్ ఫ్యాక్టరీకి ఇస్తే అడుగడుగునా తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ చంద్రగిరి మండలం కాశిపెంట్ల పంచాయతీ పరిధిలోని కాశిపెంట్ల, దిగువ కాశిపెంట్ల, మొరవపల్లి, కొత్త ఇండ్లు గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సోమవారం కాశిపెంట్లలోని హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. పాల వ్యాన్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు మాట్లాడుతూ హెరిటేజ్ ఫ్యాక్టరీ నిర్మించడం ద్వారా స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నమ్మించి భూములు తీసుకున్నారని తెలిపారు. అర్హతకు తగిన ఉద్యోగం కాకుండా నాలుగో తరగతి ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. పాల సేకరణ కోసం ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలను అద్దెకు తీసుకున్నారని వాపోయారు. అమరావతిలో రైతులకు అన్యాయం జరిగిందంటూ నిరసనలకు దిగుతున్న చంద్రబాబు 25 ఏళ్ల క్రితం ఆయనను నమ్మి భూములిచ్చిన రైతులు నేడు వీధిన పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యాలను భరిస్తూ చంద్రబాబుకు అండగా నిలిస్తే, స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. స్థానికుల డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్లాంట్ అధికారులు హామీ ఇవ్వగా.. 15 రోజుల్లోపు పరిష్కరించకుంటే తిరిగి నిరసనకు దిగుతామని హెచ్చరించిన గ్రామస్తులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. -
హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా?..
సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హైదరాబాద్ ఉప్పల్‌లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా, చాలామందిని క్వారంటైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా టీవీ ఛానల్స్‌లో చాలా ప్రబలంగా, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా వేలు, లక్షల మందికి పాలు తీసుకువెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్‌గా ఉండే ప్రాంతాలలో వైరస్ వచ్చినప్పుడు అది ఇంకా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ( రాజకీయ దుర్బుద్ధి తప్ప.. ప్రజలపై ప్రేమ ఏదీ! ) కాబట్టి తక్షణమే బయటకు వచ్చి దీనిలో వాస్తవాలేంటి.. అవాస్తవాలేంటి.. ఏం జరిగింది.. ఎంతమందికి వచ్చింది.. ఎంతమందిని క్వారంటైన్ చేశారనే దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయనాయకుడిగా మీపై ఉంది. హెరిటేజ్ ఆయన స్వంతసంస్థ అయినప్పటికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడుకు గుర్తుచేస్తున్నాను. ఎందుకంటే వారు కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌కు చాలా సలహాలు ఇస్తున్నారు. రోజూ గంటల తరబడి వారు చాలా విషయాలు చెబుతున్నారు. ( చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? ) కానీ, హెరిటేజ్‌లో సంభవించిన ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంది. హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా?. పాల ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయా. ఆ పాల ఉత్పత్తుల వల్ల ప్రమాదం లేదా?. వీటన్నింటికి వివరణ ఇవ్వకపోయినట్లైతే ఆంధ్రరాష్ర్టానికి సంబంధించిన ప్రజలు గానీ, తెలంగాణ రాష్ర్ట ప్రజలు గానీ కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై తక్షణమే చంద్రబాబు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పితీరాలని కూడా మేం డిమాండ్ చేస్తున్నా’’మని అన్నారు. -
హెరిటేజ్.. ‘టెట్రా’షాక్!
బొబ్బిలి: ఒకపక్క కరోనా కలకలం.. మరోవైపు లాక్డౌన్ వల్ల నిత్యావసరాల కోసం సామాన్యులు అల్లాడుతున్న సమయంలో హెరిటేజ్ కంపెనీ పాల ధర పెంచేసింది. హెరిటేజ్ స్పెషల్ మిల్క్ టెట్రా ప్యాకెట్లపై జనవరి నుంచి రూ.2 వరకు ధరలు పెరిగాయి. జనవరి 26న తొలుత రూపాయి పెంచగా మార్చి 1న మరోసారి రూపాయి చొప్పున పెంచారు. ప్రస్తుతం అరలీటర్ రూ.27 చొప్పున విక్రయిస్తున్నారు. విజయనగరం జిల్లాలో దాదాపు 36 వేల మంది పాడి రైతులు హెరిటేజ్ మిల్క్ సెంటర్లకు పాలు పోస్తున్నారు. ప్రతి నెలా 1 నుంచి 14 వరకు, తిరిగి నెలాఖరు వరకు వారికి రెండు బిల్లులను చెల్లిస్తున్నారు. పాలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తామూ రైతులకు ధరలు పెంచుతున్నట్లు హెరిటేజ్ తెలిపింది. అయితే ఇంతవరకు రైతులకు పెంచకుండానే రిటైల్ విక్రయదారులకు మాత్రం టెట్రా ప్యాకెట్ల మీద రెండు సార్లు రేట్లు పెంచింది. -
బాలయ్య తాతా.. అఫిడవిట్లో హెరిటేజ్ షేర్లేవీ?
సాక్షి, అమరావతి: ఆస్తుల ప్రకటన డ్రామాతో జనాల చెవుల్లో హెరిటేజ్ క్యాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు అండ్ కో. అసలు ఎవరైనాసరే తమ దగ్గర లేని షేర్లను ఇంకొకరికి గిఫ్ట్‌గా రాసిచ్చేయడం సాధ్యమేనా? 2018–19 ఏడాదికి గాను తాజాగా ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్ష్‌కు తాత 26,440 హెరిటేజ్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన లేదు. అయితే ఇక్కడ ప్రకటిస్తున్నది తమ కుటుంబ ఆస్తులు కాబట్టి తాతంటే చంద్రబాబే అని పేర్కొంటూ గురువారం రాత్రి ప్రధాన వెబ్సైట్లన్నీ రాశాయి. కొద్దిసేపటికి అసలు చంద్రబాబు పేరుతో షేర్లే లేనప్పుడు ఆయన మనవడికి గిఫ్ట్ ఎలా ఇస్తారని కొందరు లోకేశ్‌తో ధర్మసందేహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తమ కోటరీ పత్రికలను ఈ తప్పు సరిదిద్దమంటూ పురమాయించారు. తెల్లారేసరికి తమ అనుకూల పత్రికలన్నింటిలో తాత బాలకృష్ణ ఈ షేర్లను దేవాన్ష్‌కు బహుమానంగా ఇచ్చారంటూ రాయించారు. తప్పు మీద తప్పు.. తాత పేరు విషయంలో తడబడ్డ చంద్రబాబు అండ్ కో.. దీన్ని సరిదిద్దుకునే క్రమంలో మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అసలు 2019 మార్చి 22న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో బాలకృష్ణ తన పేరుమీద హెరిటేజ్ షేర్లు ఉన్న విషయాన్నే పేర్కొనలేదు. అది మరిచిపోయి, తాతంటే చంద్రబాబు కాదు.. బాలయ్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. 2019 అఫిడవిట్లో బాలకృష్ణ తనకు రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో రూ.12 కోట్ల విలువైన 12 శాతం వాటా, సికింద్రాబాద్‌లోని ఒక సంస్థలో రూ.7 లక్షల విలువైన ఏడోవంతు వాటా, క్లాసిక్ ఇన్ఫోటెక్లో 25 శాతం వాటా (విలువ 19.21 కోట్లు), 27 రిలయన్స్ పెట్రోలియం షేర్లు (విలువ రూ.7,310), ఎన్బీకే ఫిల్మ్‌లో రూ.50,000 విలువైన వాటాలు ఉన్నట్లు మాత్రమే పేర్కొన్నారు. తన వద్ద మొత్తం 5 కంపెనీలకు సంబంధించి మొత్తం రూ.31.28 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాత్రమే తెలిపారు. ఎక్కడా హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఉన్నట్లు ప్రకటించలేదు. మరి తన దగ్గర లేని షేర్లను బాలకృష్ణ ఇప్పుడు మనవడు దేవాన్ష్‌కు ఎలా ఇచ్చాడో లోకేశ్ చెప్పాలి. స్టాక్ ఎక్స్చేంజ్కు తెలుపలేదెందుకు? దేవాన్ష్ పేరిట 2017–18లో హెరిటేజ్ షేర్లు లేవు. అంటే 2018–19లోనే హెరిటేజ్ షేర్లు దేవాన్ష్ పేరిట బదిలీ అయ్యి ఉండాలి. దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరి కంపెనీ ఎండీ, తల్లి బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. ఇలా ప్రమోటర్లకు రక్త సంబంధీకుడైన దేవాన్ష్ పేరిట ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన 26,440 షేర్లు బదలాయింపు జరిగితే అది తప్పకుండా స్టాక్ ఎక్స్చేంజ్కి తెలియజేయాల్సిందేనని కంపెనీ సెక్రటరీలు స్పష్టం చేస్తున్నారు. 2018–19 ఆర్థిక ఏడాదికి స్టాక్ ఎక్స్చేంజ్ని పరిశీలిస్తే మనవడి పేరిట షేర్లు వచ్చినట్లు భువనేశ్వరి కానీ, కొడుకు పేరిట షేర్లు వచ్చినట్లు లోకేశ్ కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఇది కచ్చితంగా కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఇలా ఒక వ్యక్తి పేరు మీద ఉన్న షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ ప్రమేయం లేకుండా మరో వ్యక్తికి ఎలా బదలాయిస్తారో, ఆ మాయ ఏంటో స్టాక్ మార్కెట్లో తలపండిన వాళ్లకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో గ్యాంగ్ ఇంకో కొత్త డ్రామాకు తెరతీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. -
దేశమంతట్లోకి ఏపీలోనే తక్కువ ధర
-
ఇక మార్కెట్ యార్డుల్లోనూ ఉల్లి
రైతు బజార్లలో ఇవాళ ఇంత క్యూలు ఉన్నాయంటే దానికి కారణం వినియోగదారులు హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.200 పెట్టి కొనుక్కోలేక పోవడమే. రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నాం కనుకే జనం క్యూ కడుతున్నారు. ఈ విషయాలేవీ చంద్రబాబుకు అర్థం కావు. శవాల మీద రాజకీయం చేసే రకం. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలు ఇక్కట్లు పడకుండా రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున విక్రయాలు కొనసాగిస్తూనే వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్ యార్డులలోనూ ఉల్లిగడ్డలను అమ్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదన్నారు. ఈనెల 12, 13 తేదీలలో విదేశాల నుంచి ఉల్లిగడ్డలు ముంబయి పోర్టుకు రానున్నాయని, వాటిల్లోనూ మన రాష్ట్రానికే అత్యధికంగా కేటాయించాలని ఇండెంట్ పెట్టామన్నారు. ఉల్లిపై మంగళవారం రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు. ఉల్లిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం బాధనిపిస్తోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీలోనే తక్కువ ధర ‘దేశంలో ఉల్లిని తక్కువ ధరకు విక్రయిస్తున్న రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రం మనదే. బిహార్‌లో కిలో ఉల్లి రూ.35, పశ్చిమ బెంగాల్లో రూ.59, తెలంగాణలో రూ.40, తమిళనాడులో రూ.35–40 మధ్య, మధ్యప్రదేశ్‌లో రూ.50 చొప్పున పరిమితమైన సరుకు అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కిలో రూ.25 చొప్పున విక్రయిస్తున్నాం. తెలంగాణలో ఒకే ఒక్క రైతుబజార్లో 25 టన్నులు, తమిళనాడులో 50 టన్నులు కన్నా తక్కువగా విక్రయించారు. బిహార్‌లో నవంబర్ 22 నుంచి 28 వరకు అమ్మకాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో ఇవాల్టి (మంగళవారం) నుంచి అమ్ముతారని సమాచారం. మహారాష్ట్రలో ఇంకా మొదలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయల్లో అత్యధికంగా 2,100 మెట్రిక్ టన్నులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ సరుకు ఈనెల 12, 13 తేదీల్లో ముంబయికి రాబోతోంది. ప్రజలకు మంచి చేసే సమయంలో ఎలాంటి జాప్యం, లోపం చూపించాల్సిన అవసరం లేదని, కాస్త దూకుడు(అగ్రెసివ్)గా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించాం. రైతు బజార్లలోనే కాకుండా వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్ యార్డుల్లోనూ సబ్సిడీపై ఉల్లిపాయల అమ్మకం ప్రారంభిస్తాం. దేశంలో మరెక్కడా కూడా ఈ స్థాయిలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అయినా ప్రతిపక్షం రాజకీయం చేస్తోంది. ఇది ధర్మమేనా? వాళ్లు గుండెల మీద చేయి వేసుకుని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కొరత ఉన్నా ఇబ్బంది పడకుండా చూస్తున్నాం : మోపిదేవి మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఉల్లిపై చర్చను ప్రారంభిస్తూ.. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ మధ్య నుంచి కొరత ప్రారంభమైందన్నారు. డిసెంబర్ మొదటి వారానికి హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి రూ.100–130 మధ్య పలికిందని, ప్రస్తుతం రూ.80–100 మధ్య ఉందన్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల దిగుబడి తక్కువగా వచ్చిందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర ఉల్లి సాగు చేసే రాష్ట్రాలలో పంట నష్టం జరిగిందని వివరించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి సూచన మేరకు కిలో రూ.25కే వినియోగదారులకు సరఫరా చేస్తున్నామన్నారు. కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్, షోలాపూర్, అల్వార్ మార్కెట్ల నుంచి ఉల్లిపాయలు తెప్పించామని తెలిపారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా ప్రతిపక్షం దుర్బుద్ధితో విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిదీ రాజకీయమేనా బాబూ?: కన్నబాబు కిలో ఉల్లికి వంద రూపాయల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విపక్షాన్ని ప్రశ్నించారు. రాజకీయాన్ని వ్యవసాయానికి ముడిపెట్టవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూడడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మహిళల భద్రతపై చర్చ జరుగుతుంటే సమయం, సందర్భం చూడకుండా శవం బొమ్మలతో ఉల్లిదండలు వేసుకుని వచ్చి ఆటంకం సృష్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఓ వ్యక్తి సహజ మరణాన్ని తన రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకోవడాన్ని ఆక్షేపించారు. చంద్రబాబు సోమవారం సభలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు, మంత్రి కొడాలి నాని మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం టీడీపీ సభ్యురాలు భవాని చర్చలో పాల్గొంటూ రేషన్ డిపోలలోనూ ఉల్లిని విక్రయించాలని, గ్రామ వలంటీర్లతో ఇంటింటికీ సరఫరా చేయించాలన్నారు. ముందే గుర్తించి చర్యలు : పార్థసారధి అతివృష్టి, అనావృష్టి కారణంగా దేశంలో ఉల్లి కొరత ఏర్పడితే అదేదో మన రాష్ట్రం ఒక్కదానికే పరిమితమైన సమస్యగా విపక్షం చిత్రీకరిస్తోందని ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. సమస్య తీవ్రతను తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు నెలల ముందే గుర్తించి మార్కెట్లో జోక్యం చేసుకోండని అధికారులను ఆదేశించారన్నారు. ముందు చూపుతో వ్యవహరించినందు వల్లే ప్రజలకు ఇబ్బంది లేకుండా సరుకు తెప్పించి కిలో రూ.25కు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇవేవీ పట్టించుకోకుండా సహజ మరణాలను కూడా ఉల్లి మరణాలుగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షం శవ రాజకీయం చేస్తోందని విమర్శించారు. జగన్ మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి కాగా, చంద్రబాబు రైతు వ్యతిరేకన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తుంటే ఓర్వలేక బాబు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. దళారులను నిలువరించిన ఘనత జగన్‌దేనని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ పాలనలో రైతుకు జరిగిన మేలును ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
హెరిటేజ్ మేనేజర్ కల్తీ దందా
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్‌ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. -
హెరిటేజ్ వ్యాన్‌లో సొమ్ము తరలింపు
చోడవరం టౌన్/ ఎస్.రాయవరం(పాయకరావుపేట): ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపుకోసం ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు పంచిపెట్టేందుకోసం భారీ ఎత్తున డబ్బు తరలిస్తున్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ వ్యాన్లు, విశాఖ డెయిరీకి చెందిన పాల వ్యాన్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విశాఖ జిల్లాలో ఈ వాహనాల్లో డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్ అనకాపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పాల వ్యాన్‌లో గ్రామాలకు సొమ్ము తరలిస్తుండగా చోడవరం –చీడికాడ రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. అందులో అక్రమంగా తరలిస్తున్న రూ.2,02,050ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ పాలవ్యాన్‌లో పోలీసుల సోదాల్లో రూ.1,08,390 పట్టుపడింది. ఈ సొమ్మును సీజ్ చేసి కేసులు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. భారీగా బంగారం, నగదు పట్టివేత విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు చెక్‌పోస్ట్ పరిధిలో వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్న కోటీ 40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.45 లక్షల నగదు పట్టుబడింది. జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వెళుతున్న వాహనాన్ని చెక్‌పోస్ట్ పోలీసులు శుక్రవారం తనిఖీ చేయగా.. అందులో 4 కేజీల 653 గ్రాముల బంగారు ఆభరణాలున్నట్టు గుర్తించారు. కళ్యాణి జ్యువెల్లరీ వ్యాపారులు తరలిస్తున్న ఈ బంగారు ఆభరణాలకు పూర్తి ఆధారాలు, ఒరిజినల్ బిల్లు లేకపోవడంతో సీజ్ చేసి విశాఖ ట్రెజరీకి తరలించినట్టు ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. కోటీ 40 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. మరోవైపు నక్కపల్లి నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న మరో వాహనంలో రూ.45 లక్షలు పట్టుకుని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఏటీఎం మిషన్లలో పెట్టేందుకు ఈ నగదును తీసుకెళుతున్నట్లు సిబ్బంది చెబుతున్నప్పటికీ వాహనంతో పాటు ఉన్న ఇన్వాయిస్కు, ఉన్న నగదుకు వ్యత్యాసం రావడం, వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
హెరిటేజ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య
సాక్షి, దర్శిటౌన్: హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కంపెనీ తనను అకారణంగా తొలగించడంతోనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు(48) 2012లో హెరిటేజ్‌కు చెందిన పాలు, సంబంధిత పదార్థాల సీ అండ్ ఎఫ్ (కారీయింగ్ అండ్ ఫార్వార్డింగ్) డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు. రూ.2.8 లక్షలు కూడా డిపాజిట్ చేశాడు. ఒంగోలు నగరంలో ఉంటున్న ఆయన.. కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదనంగా డిపాజిట్ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్టు హరిబాబుకు జనవరి 5న కంపెనీ నుంచి మెయిల్ అందింది. కంపెనీ పెద్దలను బతిమాలుకున్నా ఫలితం లేకపోవడంతో మర్నాడే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు లేఖ రాశాడు. తనను ఆపేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడతానని లెటర్లో వేడుకున్నాడు. ఇతర కంపెనీలతో పోల్చితే హెరిటేజ్‌లో తక్కువప్రోత్సాహకం ఇస్తున్నా టీడీపీపై అభిమానంతోనే పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆ ఉత్తరానికి కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బకాయిలు ఆగిపోవటం, డిపాజిట్ వెనక్కు ఇవ్వకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నానని, ఆత్మహత్యే శరణ్యమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ తనను తీసేయడంతో అప్పుల పాలై చివరికి తన 3.5 ఎకరాల పొలం అమ్మి కొంతమేర బాకీలు తీర్చాడు. ఈ నేపథ్యంలో శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు అద్దంకిలోని ఆస్పత్రికి తరలించగా> అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
హెరిటేజ్, రత్నదీప్ షాప్‌లపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న వ్యాపార, వాణిజ్య సంస్థలపై తూనికలు, కొలతల శాఖ కొరఢా ఝుళిపించింది. జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రియిస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో తూనికల కొలతల శాఖ గురువారం నాడు తనిఖీలు నిర్వహించింది. జీఎస్టీకి సంబంధించి కొన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. మరికొన్ని వస్తువులపై జీఎస్టీని తొలగించింది. కానీ తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం షాపింగ్ మాల్స్, సూపర్ బజార్లలో విక్రయాలు జరపడం లేదని తూనికల కొలతల శాఖకు భారీగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 32 మంది అధికారులు 16 బృందాలుగా ఏర్పడి గ్రేటర్ హైదరాబాద్‌లోని మనికొండ, మాధాపూర్, హైటెక్ సిటీ, బాచుపల్లి, కొంపల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బేగం బజార్, కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న పలు మార్కెట్లపై కేసులు నమోదు చేశారు. వీటిలో ప్రముఖ రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 8 కేసులు, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై13 కేసులు, మోర్ సూపర్ మార్కెట్‌పై 5 కేసులు, స్పెన్సర్స్‌పై 7 కేసులు, బిగ్‌బజార్‌పై 15 కేసులు, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్ సి, హైపర్ మార్కెట్ వంటి తదితర షాపింగ్ మాల్స్‌పై మొత్తం 125 కేసులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు. తూనికల కొలతల శాఖ అధికారులకు పదోన్నతులు తూనికల కొలతల శాఖలో 16 మంది ఇన్స్పెక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2012 నుంచి ఈ పదోన్నతుల ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్లుగా ఉన్న వారిని జిల్లా తూనికల కొలతల అధికార్లు (డీఎల్‌ఎంఓ)గా పదోన్నతి కల్పించినట్లు అకున్ సబర్వాల్ తెలిపారు. పదోన్నతులు పొందిన వారిలో బి. ప్రవీణ్ కుమార్, డి. శ్రీవల్లి, డి. సరోజ, మొహమ్మద్ సుజాత్ అలి, కె. రామమోహన్, ఎన్. సంజయ్ క్రిష్ణ, బి. భూలక్ష్మి, పి. శ్రీనివాస్ రెడ్డి, జి. అశోక్‌బాబు, పి. రవీందర్, ఎండి రియాజ్ అహ్మద్ ఖాన్, ఎం.ఎ. జలీల్ ఉన్నారు. -
చంద్రన్న మాల్స్ స్వాహా
సాక్షి, అమరావతి: భయం గానీ, పక్షపాతం గానీ,రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు స్వప్ర యోజనాలు, స్వార్థమే పరమావధిగా భావిస్తున్నారు. పవిత్రమైన ప్రమాణానికి పాతరేస్తున్నారు. ప్రజలు ఓట్లేసి, గెలిపించి, కట్టబెట్టిన అధికారాన్ని సొంత లాభం కోసం ఎంతగానో వాడుకుంటున్నారు. తన కుటుంబ వ్యాపార సంస్థకు జనం సొమ్మును దోచిపెట్టేందుకు ప్రభుత్వ పథకాన్ని అనువుగా మార్చేసుకుంటున్నారు. ‘చంద్రన్న మాల్స్’ చంద్రబాబు కుటుంబ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే దుకాణాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ వ్యాపార సంస్థ ‘హెరిటేజ్’ దినదిన ప్రవర్థమానంగా ఎదిగిపోతోంది. గత నాలుగేళ్లలో హెరిటేజ్‌కు ఎన్నివిధాలుగా లబ్ధి జరిగిందో తెలియందేమీ కాదు. చంద్రన్న మాల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరో దోపిడీకి తెరతీసింది. అన్ని కిరాణా, ఫ్యాన్సీ సరుకులు విక్రయించే విధంగా చౌక దుకాణాలను చంద్రన్న మాల్స్‌గా మారుస్తున్నామంటూ సీఎం చంద్రబాబు వాటి నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా తన సొంత కంపెనీకి ధారాదత్తం చేస్తున్నారు. హెరిటేజ్ గ్రూపు భాగస్వామిగా ఉన్న ఫ్యూచర్ రిటైల్ గ్రూపునకు కీలకమైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో చంద్రన్న మాల్స్‌కు సరుకుల సరఫరా, నిర్వహణ బాధ్యతలను కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఈ మూడు జిల్లాల్లోని చౌక దుకాణాల నిర్వహణ ఫ్యూచర్ రిటైల్ అంటే హెరిటేజ్ చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో 6,806 చౌక దుకాణాల పరిధిలో 37,19,206 రేషన్ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. తొలి విడతలో భాగంగా ఈ మూడు జిల్లాల్లో 96 రేషన్ షాపులను చంద్రన్న మాల్స్‌గా మార్చనున్నారు. ఈ మాల్స్‌లో ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే సరుకులతోపాటు అన్ని రకాల కిరాణా, ఫ్యాన్సీ సరుకులను విక్రయించన్నారు. ఈ మాల్స్‌కు సరుకులను ఫ్యూచర్ గ్రూప్ పంపిణీ చేయనుంది. హెరిటేజ్‌తో బంధమిది హెరిటేజ్ గ్రూపు పలు రాష్ట్రాల్లో హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 124 ఔట్లెట్లతో ఏటా రూ.583 కోట్ల వ్యాపారం చేసేది. 2016 నవంబర్‌లో ఈ రిటైల్ వ్యాపారం మొత్తాన్ని వ్యూహాత్మకంగా ఫ్యూచర్ రిటైల్‌కు హెరిటేజ్ సంస్థ విక్రయించింది. ఈ విక్రయం ద్వారా నగదు తీసుకోకుండా ఫ్యూచర్ రిటైల్‌లో భాగస్వామ్య వాటాలను మాత్రమే తీసుకుంది. ఇలా మొత్తం వ్యాపారాన్ని విలీనం చేసినందుకు గాను ఫ్యూచర్ రిటైల్‌లో 3.56 శాతానికి సమానమైన 1.78 కోట్ల విలువైన షేర్లు హెరిటేజ్ ఫుడ్స్‌కు దక్కాయి. అప్పట్లో ఈ ఒప్పందం విలువ రూ.295 కోట్లు అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆ సమయంలో ఫ్యూచర్ రిటైల్ షేరు విలువ కేవలం రూ.154 ఉండగా, ఇప్పుడది ఏకంగా రూ.586.75కు ఎగబాకింది. దీంతో ఫ్యూచర్ రిటైల్‌లో హెరిటేజ్ ఫుడ్ వాటా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.1,047.19 కోట్లకు చేరింది. తన కుటుంబానికి వాటాలున్న కంపెనీకి చౌక దుకాణాల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరల బాదుడు షురూ బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చంద్రన్న మాల్స్‌లో 40 శాతం తక్కువ ధరలకే సరుకులు విక్రయిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. గతేడాది డిసెంబర్ 12న విజయవాడలో చంద్రన్న మాల్స్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో బాధ్యతలను తీసుకున్న రిలయన్స్ రిటైల్ ఇప్పటికే 56 చంద్రన్న మాల్స్‌ను ప్రారంభించింది. చంద్రన్న మాల్స్‌లో ఉన్న ధరలను చూసి వినియోగదారులు షాక్ తింటున్నారు. బయటి మార్కెటే నయమంటూ సరుకులు కొనకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. దీంతో అమ్మకాలు అనుకున్న స్థాయిలో సాగడం లేదని చంద్రన్న మాల్స్‌కు చెందిన డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 29,995 రేషన్ షాపులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబుకు ఆ భయం పట్టుకుంది: రోజా
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్ షాపులను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానో...లేదో అనే భయంతోనే 21 పథకాలకు చందన్న పేరు పెట్టించుకున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఆహార భద్రత కల్పించేందుకే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చౌక దుకాణాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పేదలపై ప్రేమతో నాడు ఎన్టీ రామారావు రూ.2 కిలో బియ్యం ఇచ్చారని, చంద్ర బాబు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు, నోట్ల కట్టలకు పుట్టిన బిడ్డగా ఈ ప్రభుత్వ పాలన ఉందని ఆమె అభివర్ణించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో పేదల పొట్టి కొట్టి కార్పొరేట్ శక్తులకు పెడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటును ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, సామాన్యులకు చౌకగా నిత్యావసర వస్తువులు అందడం లేదని రోజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సర్వనాశనం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సీఎం పదవి అడ్డుపెట్టుకొని.. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం పదవిని అడ్డుపెట్టుకొని చిన్న చిన్న వ్యాపారుల పొట్టి కొట్టేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మార్చారని రోజా మండిపడ్డారు. ఈ మాల్స్ స్వయంగా చంద్రబాబు కుటుంబానికి వాటాలు ఉన్న ఫ్యూచర్ గ్రూప్‌కు, వాళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్న రిలయన్స్ గ్రూప్‌లకు కట్టబెట్టారన్నారు. దీని అర్థం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మాల్స్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా అని నిలదీశారు. రేషన్‌షాపులో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, వాటన్నింటిని రద్దు చేసి, తీరా తన దోపిడీని విస్తరింపజేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. 5 నుంచి 35 శాతం తగ్గించి ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఈ రోజు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తన సంస్థకు లాభాలు లేకుండా పేదలకు ఎందుకు చౌకగా ఇస్తుందని ప్రశ్నించారు. గతంలో రిలయన్స్, ఫ్యూచర్ సంస్థలు వంద నుంచి 200 శాతం ప్రజల నుంచి గుంజుకున్నదన్నారు. రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్‌షాపుల్లో ప్రభుత్వమే నిత్యావసరాలు ఇస్తే పేదలకు లాభం ఉంటుందని, చంద్రన్న మాల్స్ పేరుతో వేల కోట్లు దండుకోవాలన్నదే టీడీపీ ధ్యేయమన్నారు. మీకు పేదలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గింవచ్చు అన్నారు. పేదవాళ్లు ఏమైతే నాకేంటి అన్నట్లుగా చంద్రబాబు తాను, తన కొడుకు బాగుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. బాబు తన సీఎం పదవిని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారన్నారు. 21 పథకాలకు చంద్రన్న పేర్లు చంద్రబాబును భవిష్యత్తులో మరిచిపోతారన్న భయం ఉందని, అందుకే ఈ నాలుగేళ్లలో 21 ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు తన తండ్రి ఖర్జురపు నాయుడు వాటా తీసుకొని వచ్చి ఇస్తున్నారా అని నిలదీశారు. అంతగా పేర్లు పెట్టుకోవాలంటే ప్రజలకు మేలు చేసిన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లు పెట్టుకోవాలి కానీ, ఇలా తన పేరు పెట్టుకోవడం ఎక్కడ చూడలేదన్నారు. భవిష్యత్తులో చంద్రబాబును పట్టించుకోరనే భయంతో ఇప్పుడే తన పేరుతో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చంద్రన్న కానుకలో నెయ్యి ఇస్తామన్నారు. ఆ నెయ్యిని హెరిటేజ్ కంపెనీ నుంచి తెప్పించారన్నారు. చంద్రన్న చలివేంద్రాలకు హెరిటేజ్ నుంచి పెరుగు తెప్పించారన్నారు. భవిష్యత్తులో దోచుకోవడానికి అవకాశం ఉంటుందో? లేదో అన్న భయంతో చౌకదుకాణాలను రిలయన్స్ సంస్థకు ఇచ్చి దోచుకునే కుట్ర చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ కార్పోరేట్ దోపిడీకి పుల్ స్టాఫ్పెట్టాలని, ప్రభుత్వమే గతంలో మాదిరిగా 10 రకాల సరుకులు రేషన్‌షాపుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని రోజా హెచ్చరించారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు రాజకీయ అవగాహన లేని లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత మంత్రిని చేశారో అప్పటి నుంచి ప్రతిది సూట్‌కేసు గురించే చంద్రబాబు పని చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు చేయడం లేదని రోజా విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. పోలవరంలో అవినీతి నెలకొందని, పట్టిసీమలో రూ.350 కోట్లు దోచుకున్నారని కాగ్ రిపోర్టు ఇచ్చిందన్నారు. బొగ్గు, మట్టి, మద్యం, ఇసుక వ్యాపారాలతో వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచిన నీకు ప్రజలను మోసం చేయడం ఓ లేక్కా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్న పేరు పెట్టి పేదలకు నీరు ఇవ్వలేకపోయావంటే మీ మామపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలిసి పోయిందన్నారు. నీ లొసుగులన్ని బయట పెట్టి ప్రజల చేత తరిమికొట్టిస్తామని రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
మజ్జిగ సరఫరా హెరిటేజ్ చేతికి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మజ్జిగ సరఫరా పథకాన్ని సొంత కంపెనీ హెరిటేజ్‌కు కట్టబెట్టుకుంది. ఇప్పటికే చంద్రన్న సంక్రాంతి కానుకల్లో వరుసగా రెండేళ్లు హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. తాజాగా ఏపీ మజ్జిగ సరఫరా పథకాన్ని కూడా హెరిటేజ్‌కే అప్పగించింది. వడగాల్పుల నుంచి రక్షణ కోసమంటూ మజ్జిగ సరఫరాను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 45 రోజుల పాటు మజ్జిగ సరఫరా చేస్తామంటూ స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి మజ్జిగ సరఫరాను అన్ని జిల్లాల్లో హెరిటేజ్ నుంచి కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున రూ.39 కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం సహకార డైరీలకు అందకుండా చేసింది. -
'హెరిటేజ్'కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు
హైదరాబాద్: పిల్లల ఆరోగ్యంపైన దుష్ర్పభావం చూపే నాణ్యత లేని, గడువుతీరిన తినుబండారాల విక్రయించడం క్రిమినల్ చర్య కిందకు వస్తుందని భావించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెరిటేజ్ సంస్థకు మంగళవారం నోటీసులు జారీచేసింది. జూన్ 20వతేదీలోగా దీనికి వివరణ ఇవ్వాలని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌ను ఆదేశించింది. సోమవారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు స్వయంగా వనస్థలిపురంలోని హెరిటేజ్ సూపర్మార్కెట్లోని వస్తువుల నాణ్యతను పరిశీలించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన పిల్లలు తినే ఆహారపదార్థాలు, శీతల పానీయాల గడువు తీరిపోయినా విక్రయిస్తున్నట్లు గుర్తించి సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు. -
తిరుమలలో హెరిటేజ్ దుకాణం
-
తిరుమలను హెరిటేజ్ తిరుమలగా మార్చుతారేమో?
-
తిరుమలను హెరిటేజ్ తిరుమలగా మార్చుతారేమో?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను తన వ్యాపారాలకు వాడుకోవడం దారుణమని చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల కొండపై హెరిటేజ్ పార్లర్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని ఆయన బుధవారమిక్కడ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తిరుమలను తన జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డి విమర్శించారు. టీటీడీ అధికారులు కూడా బాబుకు వంతపాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తిరుమల పేరును కూడా హెరిటేజ్ తిరుమలగా మార్చినా ఆశ్చర్యపోనక్కలేదని చెవిరెడ్డి అన్నారు. -
తిరుమలలో హెరిటేజ్ దుకాణం
సీఎం సొంత సంస్థకు నిబంధనల నుంచి మినహాయింపు సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు విజయ డెయిరీని నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబునాయుడు.. ఈ దఫా తిరుమలలో తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలకు తెరలేపారు. టీటీడీలోని సంబంధిత శాఖల అధికారులకు కూడా తెలియకుండా, హెరిటేజ్‌కు దుకాణం కేటాయిస్తూ టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకునేలా బాబు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద తిరుమలలో ఆ కంపెనీ దుకాణం వెలసింది. వారం రోజులుగా ఇక్కడ పాల ఉత్పత్తులతో పాటు ఇతర తినుబండారాల అమ్మకం కొనసాగిస్తోంది. వాస్తవానికి తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పన కోసం టీటీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందులో తమ ఇళ్లు, దుకాణాలు, స్థలాలు పోగొట్టుకున్న స్థానికులకు మాత్రమే టీటీడీ పునరావాసం కింద దుకాణాలు, ఇళ్లు కేటాయించాలనే స్పష్టమైన నిబంధన ఉంది. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలైంది. చంద్రబాబు సీఎం అయ్యాక 1996 నుంచి 2003 వరకు ప్రణాళికను వేగంగా అమలు చేశారు. అందులో తమ ఇళ్లు, దుకాణాలు, ఆస్తులు కోల్పోయిన బాధితులు.. పునరావాసం కోసం దశాబ్దాలుగా టీటీడీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ చంద్రబాబు పదవిలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరించకుండా.. తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ఉత్పత్తులకు తిరుమలలో ప్రచారం కల్పించే యోచన చేశారు. ఇంకేముందీ టీటీడీ ఉన్నతాధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. పంచాయితీ, రెవెన్యూ విభాగాలకు తెలియకుండానే టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ మాజీ చైర్మన్ జేఎస్ శర్మ, మాజీ ఈవో ఎంజీ గోపాల్ నేతృత్వంలో దుకాణం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. దీనిపై అన్ని వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నా కుటుంబానిది సమాజ సేవ: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వ్యాపారాలు చేయడం ద్వారా తన కుటుంబసభ్యులు సమాజానికి సేవ చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. వారు ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడకుండా వృత్తి నైపుణ్యంతో వాటిని నిర్వహిస్తున్నారన్నారు. హెరిటేజ్ కంపెనీ ఆరు రాష్ట్రాల్లోని 11 లక్షల మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తోందన్నారు. తనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకే శ్, కోడలు బ్రహ్మణిల ఆస్తుల వివరాలంటూ సోమవారం తన నివాసంలో విలేకరులకు బాబు పలు పత్రాలు విడుదల చేశారు. 1992లో రిజిస్టరయిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 1993లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. సంస్థ టర్నోవర్ ప్రస్తుతం రూ.1,600 కోట్లు కాగా నికర లాభం రూ.49.96 కోట్లని చెప్పారు. కంపెనీ బాధ్యతలను తన భార్య చూసుకుంటున్నారని, ప్రస్తుతం కోడలు కూడా అందులో భాగస్వామి అయ్యారని చెప్పారు. తాను కంపెనీ నుంచి వైదొలగినప్పటి నుంచీ భార్య కష్టపడి దాన్ని ఈ స్థితికి తెచ్చారన్నారు. నెలలో 10 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి పర్యవేక్షిస్తుండటం వల్లే చిల్లింగ్ సెంటర్ స్థాయి నుంచి సంస్థ ఈ స్థితికి చేరుకుందన్నారు. ప్రస్తుతం తన ఆస్తి రూ.42 లక్షలు మాత్రమేనని ఈ సందర్భంగా బాబు చెప్పారు. అందులో తనకు వేతనంగా లభించే మొత్తంతో పాటు ప్రస్తుతం నివాసముంటున్న భవనం, పాత కారు ఉన్నాయన్నారు. భువనేశ్వరికి రూ.33 కోట్లు (అప్పులు మినహాయించి), లోకేశ్‌కు రూ.4.9 కోట్లు (అప్పులు మినహాయించి), బ్రహ్మణికి రూ.3.3 కోట్ల ఆస్తి మాత్రమే ఉందన్నారు. తన కుటుంబీకులు నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్‌కు రూ.25.41 కోట్ల ఆస్తులు, రూ.28.28 కోట్ల అప్పులున్నాయని చెప్పారు. లోకేశ్ బెంగళూరులోని తన ఆస్తిని ఇటీవలే విక్రయించారన్నారు. తనకు డబ్బులపై వ్యామోహం లేదన్నారు. రాజకీయ నాయకుల ఆస్తులను ప్రకటించడానికి చట్టం తేవాలన్నారు. ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, దాన్ని సరిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ‘సాక్షి’ని స్వాధీనం చేసుకోరేం?! విలేకరుల సమావేశంలో యథావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లపై బాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి పత్రిక, చానల్, భారతి సిమెంట్లను ఎందుకు స్వాధీనం చేసుకోరని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులను ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్‌పై ఉన్న సీబీఐ కేసును నీరుగార్చేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వారి మధ్య అవగాహన కుదిరిందని, అందుకే ‘మా నేతకు బెయిల్ వస్తుంద’ని వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ గెలిచేసి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందోనన్న భయంతోనే రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా వచ్చే సానుకూల ఓటు కోసం టీఆర్ ఎస్తో సఖ్యతగా ఉంటూ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని రాష్ట్రపతి, ప్రధాని పలు పార్టీల నేతలకు వివరించేందుకు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రధాని చేతిలో అధికారం లేదని మొత్తం సోనియానే నడిపిస్తున్నారని అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ కుట్రపూరితంగా పదవీచ్యుతుణ్ణి చేశాక ఆయనతిరిగి సీఎం అయిన సెప్టెంబర్ 16న తాను ఆస్తులు వెల్లడిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర కుమారుడు, లీకు వీరుడని ఎద్దేవా చేశ్నారు. డీజీపీ వి.దినేశ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనను పదవిలో కొనసాగించటం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయటం తప్పన్నారు.