విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భీమడోలు సీఐ సుబ్బారావు, ఎస్సై రామ్‌కుమార్
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్‌ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment