పాల కల్తీకి చెక్‌ | Establishment of Milk Analyzers at six cooperative dairies in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పాల కల్తీకి చెక్‌

Published Thu, Jan 27 2022 5:00 AM | Last Updated on Thu, Jan 27 2022 5:00 AM

Establishment of Milk Analyzers at six cooperative dairies in Andhra Pradesh - Sakshi

సహకార డెయిరీల్లో ఏర్పాటు చేస్తున్న యంత్రాలు

సాక్షి, అమరావతి: వినియోగ దారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం రాష్ట్రంలో సహకార పాలడెయిరీల్లో డెన్మార్క్‌ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్‌ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పాలల్లో ఉండే కొవ్వు, ఘనపదార్థాలు, నీళ్ల శాతమే కాదు.. ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి కల్తీ పదార్థాలనైనా పసిగట్టే అవకాశం రానుంది.

రోజుకు 4.22కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి..
రాష్ట్రంలో 27లక్షల రైతుకుటుంబాల వద్ద 46లక్షల ఆవులు, 62లక్షల గేదెలున్నాయి. వాటి ద్వారా రోజుకు 4.22 కోట్ల లీటర్ల పాలఉత్పత్తి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.34 కోట్ల లీటర్ల పాల వినియోగమవుతుండగా, 2.88 కోట్ల లీటర్లు మార్కెట్‌కు వస్తున్నాయి. దాంట్లో 21.7 లక్షల లీటర్ల పాలను సహకార పాల డెయిరీలు సేకరిస్తుండగా, 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్నాయి. 2.19 కోట్ల లీటర్లు అన్‌ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌ కింద మార్కెట్‌కు వస్తున్నాయి. పాలల్లో ప్రధానంగా కొవ్వు పదార్థాలు 4 శాతం, పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్‌) 4.7 శాతం, మాంసకృత్తులు(ప్రొటీన్స్‌) 3.3 శాతం, నీరు 88 శాతం ఉంటాయి. ఆవు పాలల్లో 69 కిలో కేలరీలు, గేదె పాలల్లో 100 కిలో కేలరీల శక్తి ఉంటుంది. ప్రధానంగా గేదె పాలల్లో కొవ్వు 5.5శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ (ఘనపదార్థాలు) 8.7 శాతం, ఆవు పాలల్లో కొవ్వు 3.2 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 8.3 శాతం ఉంటే మంచి పోషక విలువలున్న పాలుగా పరిగణిస్తారు. 

కల్తీ లేని పాల సరఫరాయే లక్ష్యం
ఈ రోజుల్లో మార్కెట్‌లో దొరికే పాలల్లో స్వచ్ఛత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతుంటారు. మరికొంతమంది రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తుంటారు. పాలల్లో ప్రధానంగా అమ్మోనియం సల్ఫేట్, డిటర్జెంట్, గ్లూకోజ్, మాల్టోస్, మెలమైన్, ఉప్పు, సోడియం కార్బోనేట్, సోడియం సిట్రేట్, సార్బిటాల్, స్టార్చ్, సుక్రోజ్, యూరియా, వెజిటబుల్‌ ఆయిల్, ఫార్మాల్డిహైడ్‌ వంటి కల్తీ పదార్థాలను వాడుతుంటారు. ప్రస్తుతం పాలకేంద్రాల్లో ఉండే మిషనరీ ద్వారా పాలల్లో కొవ్వు, ఘనపదార్థాలు, నీటి శాతాన్ని మాత్రమే గుర్తించగలుగుతున్నారు.  

క్వాలిటీ కంట్రోల్‌ లేబొరేటరీల బలోపేతం
ప్రభుత్వ డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్‌ లేబొరేటరీలను బలోపేతం చేయడం ద్వారా కల్తీ పాలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాలడెయిరీల్లో హై ఎండ్‌ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి రూ.84లక్షల అంచనా వ్యయంతో పోరియర్‌ ట్రాన్స్‌ఫార్మ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ (ఎఫ్‌టీఐఆర్‌) టెక్నాలజీ కలిగిన  మిల్క్‌ ఎనలైజర్స్‌ (మిల్క్‌ స్కానర్స్‌)ను ఏర్పాటు చేశారు.

వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.5.44 కోట్లు ఖర్చు చేసింది. వీటిద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఘన పదార్థాలు, ఎస్‌ఎన్‌ఎఫ్‌ వంటి వాటితో పాటు 24 పారామీటర్స్‌లో కల్తీ పదార్థాలుగా గుర్తించిన వాటి శాతాన్ని కూడా పసిగడుతుంది.కాగా, పాలసేకరణ, రవాణాలో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు వీలుగా పశుసంవర్ధక శాఖాధికారులకు అధికారాలిచ్చారు. ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాల శాంపిల్స్‌ను సేకరించి మిల్క్‌ ఎనలైజర్స్‌ ద్వారా కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement