Adulterated milk
-
తెల్లనివన్నీ పాలు కాదు!
తెల్లనివన్నీ పాలు కాదు.. పాలు అనుకుని మనం తాగుతున్నవన్నీ అచ్చమైన పాలు కానే కాదు.. కుళాయి నీళ్ల నుంచి యూరియా, ఇతర రసాయనాల దాకా ఏవేవో కలిపిన కల్తీ పాలు.. నకిలీ పాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి.. పాడి పశువుల పెంపకం తగ్గిపోయి.. పాల ఉత్పత్తి పడిపోతోంది. నగరంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడుతోంది. దీనితో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కి.. కల్తీ, నకిలీ పాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సగటున 28 లక్షల లీటర్ల పాలు అవసరమని అంచనా. ఇందులో 22 లక్షల లీటర్లు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నాయి. డెయిరీ రైతులు, డబ్బావాలాలు, ఇతర వ్యాపారులు నేరుగా మరో ఆరు లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో రెండు, మూడు లక్షల లీటర్ల మేర కల్తీ చేసినవో, కృత్రిమంగా తయారు చేసినవో ఉంటున్నాయని అంచనా. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఇటీవల చేవెళ్ల, నందిగామ, ఆల్మాస్‌గూడ, నాదర్గుల్, ముచ్చింతల్, పసుమాములలోని పలు ప్రైవేటు డెయిరీల నుంచి నమూనాలు సేకరించి.. పరిశీలించగా అక్రమాలు వెలుగుచూశాయి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు పాలు లేకపోవడంతో ఆయా డెయిరీల యజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. బీర్ దాణా » పాలకు డిమాండ్ నేపథ్యంలో కొందరు డెయిరీల నిర్వాహకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అడ్డగోలు మార్గం పడుతున్నారు. అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రమాదకరమైన ‘బీర్ దాణా’ తాగిస్తున్నారు. దీనికితోడు పాలలో పాలపొడి, కుళాయి నీళ్లు, రసాయనాలు కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ఆ పాలు నాసిరకంగా, రుచి లేకుండా ఉంటున్నాయి. పెరుగు తోడుకోకపోవడం, తోడుకున్న పెరుగు కూడా సాయంత్రానికే దుర్వాసన వెదజల్లుతుండటం వంటివి జరుగుతున్నాయి. ఇదీ పాడి లెక్క » ఒకప్పుడు సిటీలో వాడే పాలలో చాలా వరకు శివారు జిల్లాల్లోని వ్యక్తిగత డెయిరీల నుంచే సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో 27,068 గోజాతి, 59,895 గేదె జాతి పశువులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,88,182 గోజాతి, 1,22,587 గేదె జాతి పశువులు ఉన్నాయి.వీటిలో 1,25,246 ఆవులు, గేదెలు మాత్రమే పాలు ఇస్తున్నట్టు గుర్తించారు. వాటి నుంచి రోజుకు సగటున 5,56,055 లీటర్ల పాల దిగుబడి వస్తుండగా.. అందులో 43,688 లీటర్లు రైతులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. 97,998 లీటర్లు ప్రభుత్వ డెయిరీలకు విక్రయిస్తున్నారు. మరో 1,80,382 లీటర్ల పాలను స్వయంగా ఔట్లెట్లు తెరిచి విక్రయిస్తున్నారు.ఇంటింటా తిరిగి పాలు పోసే డబ్బావాలాలు మరో 1,27,965 లీటర్ల మేర అమ్ముతున్నారు. ప్రైవేటు డెయిరీలు 1,60,556 లీటర్లు విక్రయిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నగరానికి పాలు దిగుమతి అవుతున్నాయి.కృత్రిమంగా పాలు తయారు చేస్తూ.. »ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లికి చెందిన ఓ పాడి రైతు ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కృత్రిమంగా తయారు చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 120 లీటర్ల కృత్రిమ పాలు, పది పాల పౌడర్ ప్యాకెట్లను స్వా«దీనం చేసుకుని కేసు కూడా నమోదు చేశారు.» పాశమైలారానికి చెందిన ఓ వ్యాపారి.. స్థానికంగా మూతపడ్డ ఓ పరిశ్రమను అద్దెకు తీసుకుని, గుట్టుగా కల్తీ పాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ డెయిరీ లేబుళ్లతో కల్తీ పాలు, పెరుగు, ఇతర పాల పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. పాల స్వచ్ఛతను గుర్తించొచ్చు ఇలా..» స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకడితే అందులో నీళ్లు కలిశాయని అర్థం.» లాక్టోమీటర్ సాయంతో పాలలోని కొవ్వు, ఇతర ఘనపదార్థాలు ఎంత శాతం ఉన్నాయో గుర్తించవచ్చు.» పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి.. మూతపై నీటిలా ఏర్పడితే సరే. అలాకాకుండా స్పటికాల్లా ఏర్పడితే యూరియా కలిసి ఉండే చాన్స్ ఎక్కువ. » స్వచ్ఛమైన పాలను నున్నటి తలంపై వేస్తే.. అది పారినంత మేర తెల్లటి చార ఏర్పడుతుంది. అలా చార ఏర్పడకుంటే.. నీళ్లు ఎక్కువగా కలిసినట్టే.»వేడి చేసినప్పుడు పాలపై పసుపు రంగులో మీగడ ఏర్పడటం, పెరుగు సరిగా తోడుకోకపోవడం జరిగితే.. అందులో వనస్పతి కలిసి ఉన్నట్టే.»పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతుంటారు. అలాంటి పాలను మరిగించి, తోడు వేస్తే పెరుగు సరిగా ఏర్పడదు. అంతా నీళ్లలా కనిపిస్తుంది.పాలలో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు.. » పాడి పశువుల సంఖ్య తగ్గి, పాలలో కల్తీ పెరిగింది. నీళ్లు కలిపితే పెద్దగా నష్టం లేదు. కానీ పాలు చిక్కగా కనిపించేందుకు కార్న్‌ఫ్లోర్.. వెన్నశాతం కోసం యూరియా, వనస్పతి వంటివి కలుపుతున్నారు. పాలు విరిగిపోకుండా ఉండేందుకు డిటర్జెంట్స్, తినే సోడా, అమ్మోనియం సల్ఫేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, రుచి మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ కలుపుతున్నారు. అలాంటి పాలు తాగడం ప్రమాదకరం. అయోడిన్ సొల్యూషన్‌తో పాలను పరీక్షించడం ద్వారా పిండి పదార్థాలు కలిపారా? రెడ్ లిట్మస్ పేపర్ ద్వారా యూరియా కలిపారా గుర్తించొచ్చు. – ఎన్.రాజు, రసాయన శాస్త్రవేత్త ఆ పాలు తాగితే అనారోగ్యమే.. » కొందరు పాల విక్రేతలు, చిన్న డెయిరీల నిర్వాహకులు పాల కల్తీకి పాల్పడుతున్నారు. ప్యాకెట్ పాలను నమ్మకుండా.. బయట కొనేవారి బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గం పడుతున్నారు. అపరిశుభ్ర పరిస్థితులతో.. వాటిలో ఈ–కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా మరిగించకుండా తాగితే రోగాల బారినపడటం ఖాయం. రసాయనాలు కలిపిన పాలు వాడితే అనారోగ్యమే. – డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి, సీనియర్ సర్జన్ (రిటైర్డ్) సబ్ స్టాండర్డ్ కేసులే.. » ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే పాలు, ప్యాకెట్ పాల నాణ్యతా ప్రమాణాలను తరచూ పరిశీలిస్తున్నాం. చాలా వరకు సబ్ స్టాండర్డ్ (వెన్నశాతం, నాణ్యతలో తేడాలు)గా గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో ఏమీ దొరకలేదు. ఇక కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. – ఉదయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా -
పాల కల్తీకి చెక్
సాక్షి, అమరావతి: వినియోగ దారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం రాష్ట్రంలో సహకార పాలడెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పాలల్లో ఉండే కొవ్వు, ఘనపదార్థాలు, నీళ్ల శాతమే కాదు.. ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి కల్తీ పదార్థాలనైనా పసిగట్టే అవకాశం రానుంది. రోజుకు 4.22కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి.. రాష్ట్రంలో 27లక్షల రైతుకుటుంబాల వద్ద 46లక్షల ఆవులు, 62లక్షల గేదెలున్నాయి. వాటి ద్వారా రోజుకు 4.22 కోట్ల లీటర్ల పాలఉత్పత్తి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.34 కోట్ల లీటర్ల పాల వినియోగమవుతుండగా, 2.88 కోట్ల లీటర్లు మార్కెట్‌కు వస్తున్నాయి. దాంట్లో 21.7 లక్షల లీటర్ల పాలను సహకార పాల డెయిరీలు సేకరిస్తుండగా, 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్నాయి. 2.19 కోట్ల లీటర్లు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్‌కు వస్తున్నాయి. పాలల్లో ప్రధానంగా కొవ్వు పదార్థాలు 4 శాతం, పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్) 4.7 శాతం, మాంసకృత్తులు(ప్రొటీన్స్) 3.3 శాతం, నీరు 88 శాతం ఉంటాయి. ఆవు పాలల్లో 69 కిలో కేలరీలు, గేదె పాలల్లో 100 కిలో కేలరీల శక్తి ఉంటుంది. ప్రధానంగా గేదె పాలల్లో కొవ్వు 5.5శాతం, ఎస్ఎన్ఎఫ్ (ఘనపదార్థాలు) 8.7 శాతం, ఆవు పాలల్లో కొవ్వు 3.2 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.3 శాతం ఉంటే మంచి పోషక విలువలున్న పాలుగా పరిగణిస్తారు. కల్తీ లేని పాల సరఫరాయే లక్ష్యం ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతుంటారు. మరికొంతమంది రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తుంటారు. పాలల్లో ప్రధానంగా అమ్మోనియం సల్ఫేట్, డిటర్జెంట్, గ్లూకోజ్, మాల్టోస్, మెలమైన్, ఉప్పు, సోడియం కార్బోనేట్, సోడియం సిట్రేట్, సార్బిటాల్, స్టార్చ్, సుక్రోజ్, యూరియా, వెజిటబుల్ ఆయిల్, ఫార్మాల్డిహైడ్ వంటి కల్తీ పదార్థాలను వాడుతుంటారు. ప్రస్తుతం పాలకేంద్రాల్లో ఉండే మిషనరీ ద్వారా పాలల్లో కొవ్వు, ఘనపదార్థాలు, నీటి శాతాన్ని మాత్రమే గుర్తించగలుగుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీల బలోపేతం ప్రభుత్వ డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీలను బలోపేతం చేయడం ద్వారా కల్తీ పాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాలడెయిరీల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి రూ.84లక్షల అంచనా వ్యయంతో పోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ (ఎఫ్టీఐఆర్) టెక్నాలజీ కలిగిన మిల్క్ ఎనలైజర్స్ (మిల్క్ స్కానర్స్)ను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.5.44 కోట్లు ఖర్చు చేసింది. వీటిద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఘన పదార్థాలు, ఎస్ఎన్ఎఫ్ వంటి వాటితో పాటు 24 పారామీటర్స్‌లో కల్తీ పదార్థాలుగా గుర్తించిన వాటి శాతాన్ని కూడా పసిగడుతుంది.కాగా, పాలసేకరణ, రవాణాలో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు వీలుగా పశుసంవర్ధక శాఖాధికారులకు అధికారాలిచ్చారు. ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాల శాంపిల్స్‌ను సేకరించి మిల్క్ ఎనలైజర్స్ ద్వారా కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. -
హెరిటేజ్ మేనేజర్ కల్తీ దందా
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్‌ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. -
పాలకేంద్రం ముసుగులో కల్తీపాలు
ప్రకాశం, గుడ్లూరు: పాల కేంద్రం ముసుగులో కల్తీపాలు తయారు చేసి అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న యువకుడిని ఎస్ఐ సంపత్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్‌మీరా గురువారం వలపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడి నుంచి కల్తీ పాల పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో కలకలం రేపుతున్న ఈ సంఘటన రావూరులో వెలుగు చూసింది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిరియం ప్రభాకర్ పాలకేంద్రం నడుపుతున్నాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో ఆరు నెలలు నుంచి ఇంట్లో కల్తీపాలు తయారు చేయడం ప్రారంభించాడు. కల్తీ పాలు తయారీకి అవసరమైన పాలపొడి, నూనె ప్యాకెట్లు, యూరియా, ఉప్పు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పశుపోషకుల వద్ద 30 లీటర్లు మంచి పాలు కొనుగోలు చేసి వాటికి తగిన మోతాదులో పాలపొడి, ఉప్పు, యూరియా, నూనె, నీళ్లు కలిపి 100 లీటర్లు చేస్తాడు. ఆ కల్తీపాలు కావలిలోని స్వీట్ దుకాణాలు, టీ షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇలా రోజుకు 200 లీటర్ల కల్తీపాలు తయారు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. కల్తీపాలు తయారీ సమచారం అందుకున్న ఎస్ఐ సంపత్‌కుమార్.. విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్‌మీరాకు చేరవేశారు. అనంతరం ఇద్దరూ తమ సిబ్బందితో కలిసి రావూరులో ప్రభాకర్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నిల్వ ఉంచిన 200 లీటర్ల కల్తీపాలు, 11 బస్తాల పాలపొడి, 250 ప్యాకెట్ల ప్రీఢం సన్‌ప్లవర్ ఆయిల్, యూరియా బస్తాలు, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ నాగూర్‌మీరా మాట్లాడుతూ కల్తీపాలను ప్రమాదకర కెమికల్స్‌ను ఉపయోగించి తయారు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కల్తీ పాలు ఉపయోగిస్తే కా>్యన్సర్‌తో పాటు ఊపిరి తిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కల్తీపాలు గృహాలకు కాకుండా స్వీట్, టి. దుకాణాలకు మాత్రమే సరఫరా చేయడంతో వారు పెద్దగా తనిఖీలు చేయరని భావించి ప్రభాకర్ ఈ మార్గాన్ని ప్రభాకర్ ఎన్నుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ, ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు రైటర్ డానియేలు, పోలీస్ సిబ్బంది ఖాదర్‌బాషా, కృష్ణ, శ్రీనివాసులు ఉన్నారు. -
కల్తీ పాల వ్యవహారంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: కల్తీ పాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికతో సాక్షి పత్రికలో గత ఏడాది డిసెంబర్ 12న ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్) పరిగణనలోకి తీసుకుంది. సాక్షి కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన పాఠకుడు కె.నర్సింహారావు లేఖ రూపంలో కల్తీ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈ వ్యాజ్యంలో పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఎండీ, ఫుడ్ సేఫ్టీ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 30న ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ గ్రేటర్ హైదరాబాద్‌లో సాక్షి బృందం పర్యటించి పలు కంపెనీల పాల ప్యాకెట్ల శాంపిల్స్‌ను సేకరించింది. వాటిని నాచారంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరీక్షా కేంద్రంలో పరీక్షలు చేయించింది. ఈ పాలు హానికరమని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలను పాలల్లో కలుపుతున్నారని పరీక్షల్లో తేలింది. ‘ఇలాంటి పాలను వినియోగిస్తే టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్.. వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది’అని సాక్షి కథనంలో వచ్చిన అంశాలను పిటిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో కల్తీపాల కేంద్రాలు
- దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాలకేంద్రంపై సోమవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 80 లీటర్ల పాలు, 3 పాల ప్యాకెట్లు, ఖాళీ పాల ప్యాకెట్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీపాల దందా గుట్టురట్టు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ కంపెనీల పాలను కల్తీ చేసి... రీ-ప్యాకింగ్‌తో విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నిర్వహిస్తున్న నిందితుడి నుంచి ప్యాకింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన డి.అమృతలాల్ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నేరేడ్మెట్లోని సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఐదేళ్లుగా హెరిటేజ్ పాల కంపెనీకి డిస్ట్రిబూటర్‌గా పనిచేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను కొని టీస్టాల్స్, హోటల్స్‌తో పాటు కొన్ని ఇళ్లల్లోనూ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే పాలను నీళ్లతో కల్తీ చేసి, మళ్లీ రీ-ప్యాక్ చేసి విక్రయించడం మొదలుపెట్టాడు. కల్తీ తంతు ఇదీ... అమృత్లాల్ టీ స్టాల్స్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తుంటాడు. రోజూ తెల్లవారుజామున మూడున్నరకల్లా హెరిటేజ్ కంపెనీ నుంచి ఇతడికి 300 నుంచి 400 లీటర్ల పాల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లను అనుమానం రాకుండా కత్తిరించి, పాలను టబ్‌లో పోస్తాడు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 100 లీటర్లకు పైగా నీళ్లు కలుపుతాడు. శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేకపోతే... ఒక్కోసారి కలుషిత నీటినే వాడేసేవాడు. ఆ పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలో నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ చేస్తాడు. ఆ ప్యాకెట్లను హోటళ్లు, టీ స్టాళ్లు, ఇళ్లకు బట్వాడా చేయిస్తున్నాడు. సేకరించిన ఖాళీ పాల ప్యాకెట్లలో కొన్ని పాతవి ఉంటే వాటిపై ఉన్న తయారీ తేదీని థిన్నర్ సాయంతో తుడిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం దాడి చేసి అమృత్లాల్ను పట్టుకున్నారు. దాడి సమయంలో 237 పాల ప్యాకెట్లతో పాటు రెండు ప్యాకింగ్ మిషన్లు, మూడు థిన్నర్ బాటిళ్లు, వివిధ కంపెనీలకు చెందిన 100 ఖాళీ పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే తరహాలో గతంలోనూ నగర శివార్లలో యూరియా, మంచినూనె కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠానూ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్యాకెట్ల సైజ్ కాస్త చిన్నగా ఉంటుందని, ప్యాకెట్లలో ఖాళీస్థలం తక్కువగా ఉంటుందని, ప్యాకె ట్లపై తయారీ తేదీ చెరిపేసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్యాకెట్లను అనుమానించాలని, వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు విని యోగదారులకు సూచిస్తున్నారు. -
కల్తీపాల తయారీ ముఠా గుట్టురట్టు
ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలో మంగళవారం కల్తీ పాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. కల్తీ పాలను తయారు చేస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న పంచదార, మంచినూనె, సర్పు పొడి, ఉప్పు, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘పాల’కూట విషం
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. - ఘట్కేసర్ టౌన్/ ఘట్కేసర్ గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో తరలింపు.. ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్‌కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు... వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి. కరువైన నిఘా.. అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం. తయారీ ఇలా... 10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు. పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు. ఇలా సొమ్ము చేసుకుంటూ.. కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్‌కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు. కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం .. కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి. -డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్కేసర్ -
కఠిన శిక్షలతోనే కల్తీకి కట్టడి
న్యూఢిల్లీ: ఆహార కల్తీదారులకు కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప కల్తీ బెడదను అరికట్టలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడటంతో నగరంలో కల్తీ పాల విక్రయం మరోమారు చర్చనీయాంశమైంది. చిన్నపిల్లలు కూడా ఆహారంగా తీసుకునే పాలవంటి వాటిని కల్తీ చేసేవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం సమంజసమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆహార భద్రత-ప్రమాణాల చట్టానికి తగిన సవరణలను చేయాలని సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ నాణ్యమైన పాల సరఫరా, పాల ఉత్పత్తులు పౌరులకు లభించగలవా అన్న ప్రశ్న తలెత్తుతోంది.‘‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో అనేక లొసుగులున్నాయి. నిజానికి ఈ చట్టం ఇప్పటికీ కల్తీదారులకు అనుకూలంగా ఉంది. ఇందులోని లొసుగుల ఆధారంగా నేరం చేసిన వారు సులభంగా బయటపడుతున్నారు’’ అని ఆహార కల్తీ నిరోధక విభాగం డైరక్టరేట్ తరఫున వాదించిన మాజీ ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి మాట్లాడుతూ ‘‘పాలు లేదా మరే ఇతర ఆహార పదార్థంలోనూ కల్తీ జరిగిందని నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ల్యాబరేటరీల్లో రూపొందే తుది నివేదికలను మార్చడం చాలా సులభం. వ్యాపారులు లేదా నిందితులు లంచాల ద్వారా నివేదికలను తేలికగా మార్చుకొనే అవకాశం ఉంది. ఒక వేళ అక్కడ తప్పని పరిస్థితిలో ఏ అధికారైనా అనుకూల నివేదిక ఇవ్వడానికి అంగీకరించని పక్షంలో కోర్టుల్లో కొద్దిపాటి జరిమానాలు చెల్లించి దర్జాగా బయటపడగలుగుతారు’’ అని వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాతీయ రాజధానిలో పాల కల్తీని గురించి మాట్లాడుతూ ‘‘జాతీయ రాజధాని పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కాదు. పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడి తన అవసరాలను తీర్చుకుంటుంది. రోజువారీ అవసరాలకే కాకుండా నిత్యం జరిగే భారీ వేడుకలకు భారీ మొత్తంలో పాలు అవసరమౌతాయి. ఇంత భారీ డిమాండ్‌ను తీర్చడం ఎలా? అందుకే నగరంలో పాల వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పాలను కల్తీ చేసి ఈ భారీ డిమాండ్‌ను పూరిస్తున్నారు’’ అని వివరించారు. గ్వాలగద్దీ (పాల ఉత్పత్తిదారుల సంఘం) జాతీయ అధ్యక్షుడు మోహన్ సింగ్ అహ్లూవాలియా మాట్లాడుతూ ‘‘పాల కల్తీకి పాల్పడేది ఉత్పత్తిదారులు కాదు. స్థానిక పాల పంపిణీదారులు, చిల్లర వ్యాపారులే దీనికి ఎక్కువ బాధ్యులు. జాతీయ రాజధానితో పాటు ప్రాదేశిక ప్రాంత నగరాలు నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్‌లలో తొంబై శాతం పాలు, పెరుగు, జున్ను కల్తీవే అన్నది నిజం’’ అని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తుల వ్యాపార కేంద్రాలైన ఆజాద్‌పూర్ మండీ, తిలక్మార్కెట్లను గురించి మాట్లాడుతూ ‘‘మండీలో వ్యాపారిని పన్నీర్ అడగండి. వెంటనే నంబర్ 1 కావాలా? దో నంబర్ చలేగా? అని ప్రశ్నిస్తాడు. తిలక్మార్కెట్లోనూ ఇదే వరుస. ఇక్కడ పాలను తెల్లటి పాలరాతి పొడితో కల్తీ చేస్తారు. స్థానిక బ్రాండుల పాల ఉత్పత్తుల్లో కల్తీ ఎక్కువ’’ అని వివరించారు. ఇక క ల్తీ ఇంత విచ్చలవిడిగా జరగడానికి ఆహార కల్తీ నిరోధక విభాగం ఫుడ్ ఇన్స్పెక్టర్లే ప్రధాన కారణం అని ఆయన ఆరోపించారు. ‘‘యావజ్జీవ కారాగార శిక్షలను గురించి సానుకూలంగా స్పందించే ముందు ప్రభుత్వం ముందుగా ఈ ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ప్రజల ప్రాణాలను బలి ఇవ్వడానికి సిద్ధమయి వారి బ్యాంక్ ఖాతాలను భర్తీ చేసుకుంటున్నారు’’ అని మోహన్‌సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. నగరంలో పాల కల్తీని గురించి ఢిల్లీ మిల్క్ స్కీమ్ జనరల్ మేనేజర్ డాక్టర్ బీఎల్ బేణివాల్ మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో కల్తీ పాలు అనేది పెద్ద సమస్యకాదు. ప్రజలు కచ్చితంగా నాణ్యమైన పాలను ఎంపిక చేసుకుంటున్నారు’’ అని సెలవిచ్చారు. ఢిల్లీ మిల్క్ స్కీమ్ పూర్తిగా పొరుగు రాష్ట్రాల స్టేట్ డెయిరీ ఫెడరేషన్ల మీద ఆధారపడి నడుస్తోంది. కో-ఆపరేటివ్ సొసైటీలు సరఫరాను పెంచుతున్నాయి. అయితే ఇది ఢిల్లీ పాల వినియోగంలో కేవలం ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ‘‘కొన్ని సొసైటీలు సరఫరా చేసిన పాలు నాణ్యతాప్రమాణాలకు సరితూగక పోవడంతో తిరస్కరించాము. అవన్నీ కల్తీ జరిగినట్లు కాదు. పోషకాలు తక్కువ స్థాయిలో ఉన్నవాటిని కూడా నాన్ కన్ఫార్మింగ్ శాంపుల్‌గా ప్రకటిస్తాము. కొన్నిసార్లు ఇవి తాజా పాలు కాకపోవచ్చు. మరికొన్నిసార్లు వీటిలో తగిన స్థాయిలో పోషకాలు ఉండకపోవచ్చు. అయితే ఏదిఏమైనా కల్తీవ్యాపారులు చట్టానికి తూట్లు పొడవడంలో సమర్థులు’’ అని తెలిపారు.