కఠిన శిక్షలతోనే కల్తీకి కట్టడి | Adulterated milk: supreme court asks states to make punishment harsher | Sakshi
Sakshi News home page

కఠిన శిక్షలతోనే కల్తీకి కట్టడి

Published Thu, Dec 12 2013 11:09 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Adulterated milk:  supreme court  asks states to make punishment harsher

 న్యూఢిల్లీ: ఆహార కల్తీదారులకు కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప కల్తీ బెడదను అరికట్టలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడటంతో నగరంలో కల్తీ పాల విక్రయం మరోమారు చర్చనీయాంశమైంది. చిన్నపిల్లలు కూడా ఆహారంగా తీసుకునే పాలవంటి వాటిని కల్తీ చేసేవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం సమంజసమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆహార భద్రత-ప్రమాణాల చట్టానికి తగిన సవరణలను చేయాలని సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ నాణ్యమైన పాల సరఫరా, పాల ఉత్పత్తులు పౌరులకు లభించగలవా అన్న ప్రశ్న తలెత్తుతోంది.‘‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో అనేక లొసుగులున్నాయి. నిజానికి ఈ చట్టం ఇప్పటికీ కల్తీదారులకు అనుకూలంగా ఉంది. ఇందులోని లొసుగుల ఆధారంగా నేరం చేసిన వారు సులభంగా బయటపడుతున్నారు’’ అని ఆహార కల్తీ నిరోధక విభాగం డైరక్టరేట్ తరఫున వాదించిన మాజీ ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి మాట్లాడుతూ ‘‘పాలు లేదా మరే ఇతర ఆహార పదార్థంలోనూ కల్తీ జరిగిందని నిరూపించడం చాలా కష్టం. 
 
 ఎందుకంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ల్యాబరేటరీల్లో రూపొందే తుది నివేదికలను మార్చడం చాలా సులభం. వ్యాపారులు లేదా నిందితులు లంచాల ద్వారా నివేదికలను తేలికగా మార్చుకొనే అవకాశం ఉంది. ఒక వేళ అక్కడ తప్పని పరిస్థితిలో ఏ అధికారైనా అనుకూల నివేదిక ఇవ్వడానికి అంగీకరించని పక్షంలో కోర్టుల్లో కొద్దిపాటి జరిమానాలు చెల్లించి దర్జాగా బయటపడగలుగుతారు’’ అని వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాతీయ రాజధానిలో పాల కల్తీని గురించి మాట్లాడుతూ ‘‘జాతీయ రాజధాని పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కాదు. పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడి తన అవసరాలను తీర్చుకుంటుంది. రోజువారీ అవసరాలకే కాకుండా నిత్యం జరిగే భారీ వేడుకలకు భారీ మొత్తంలో పాలు అవసరమౌతాయి. ఇంత భారీ డిమాండ్‌ను తీర్చడం ఎలా? అందుకే నగరంలో పాల వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పాలను కల్తీ చేసి ఈ భారీ డిమాండ్‌ను పూరిస్తున్నారు’’ అని వివరించారు. 
 
 
 గ్వాలగద్దీ (పాల ఉత్పత్తిదారుల సంఘం) జాతీయ అధ్యక్షుడు మోహన్ సింగ్ అహ్లూవాలియా మాట్లాడుతూ ‘‘పాల కల్తీకి పాల్పడేది ఉత్పత్తిదారులు కాదు. స్థానిక పాల పంపిణీదారులు, చిల్లర వ్యాపారులే దీనికి ఎక్కువ బాధ్యులు. జాతీయ రాజధానితో పాటు ప్రాదేశిక ప్రాంత నగరాలు నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్‌లలో తొంబై శాతం పాలు, పెరుగు, జున్ను కల్తీవే అన్నది నిజం’’ అని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తుల వ్యాపార కేంద్రాలైన ఆజాద్‌పూర్ మండీ, తిలక్‌మార్కెట్‌లను గురించి మాట్లాడుతూ ‘‘మండీలో వ్యాపారిని పన్నీర్ అడగండి. వెంటనే నంబర్ 1 కావాలా? దో నంబర్ చలేగా? అని ప్రశ్నిస్తాడు. తిలక్‌మార్కెట్‌లోనూ ఇదే వరుస.
 
 ఇక్కడ పాలను తెల్లటి పాలరాతి పొడితో కల్తీ చేస్తారు. స్థానిక బ్రాండుల పాల ఉత్పత్తుల్లో కల్తీ ఎక్కువ’’ అని వివరించారు. ఇక క ల్తీ ఇంత విచ్చలవిడిగా జరగడానికి ఆహార కల్తీ నిరోధక విభాగం ఫుడ్ ఇన్‌స్పెక్టర్లే ప్రధాన కారణం అని ఆయన ఆరోపించారు. ‘‘యావజ్జీవ కారాగార శిక్షలను గురించి సానుకూలంగా స్పందించే ముందు ప్రభుత్వం ముందుగా ఈ ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ప్రజల ప్రాణాలను బలి ఇవ్వడానికి సిద్ధమయి వారి బ్యాంక్ ఖాతాలను భర్తీ చేసుకుంటున్నారు’’ అని మోహన్‌సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు.  నగరంలో పాల కల్తీని గురించి ఢిల్లీ మిల్క్ స్కీమ్ జనరల్ మేనేజర్ డాక్టర్ బీఎల్ బేణివాల్ మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో కల్తీ పాలు అనేది పెద్ద సమస్యకాదు.
 
 ప్రజలు కచ్చితంగా నాణ్యమైన పాలను ఎంపిక చేసుకుంటున్నారు’’ అని సెలవిచ్చారు. ఢిల్లీ మిల్క్ స్కీమ్ పూర్తిగా పొరుగు రాష్ట్రాల స్టేట్ డెయిరీ ఫెడరేషన్‌ల మీద ఆధారపడి నడుస్తోంది. కో-ఆపరేటివ్ సొసైటీలు సరఫరాను పెంచుతున్నాయి. అయితే ఇది ఢిల్లీ పాల వినియోగంలో కేవలం ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ‘‘కొన్ని సొసైటీలు సరఫరా చేసిన పాలు నాణ్యతాప్రమాణాలకు సరితూగక పోవడంతో తిరస్కరించాము. అవన్నీ  కల్తీ జరిగినట్లు కాదు. పోషకాలు తక్కువ స్థాయిలో ఉన్నవాటిని కూడా నాన్ కన్‌ఫార్మింగ్ శాంపుల్‌గా ప్రకటిస్తాము. కొన్నిసార్లు ఇవి తాజా పాలు కాకపోవచ్చు. మరికొన్నిసార్లు వీటిలో తగిన స్థాయిలో పోషకాలు ఉండకపోవచ్చు. అయితే ఏదిఏమైనా కల్తీవ్యాపారులు చట్టానికి తూట్లు పొడవడంలో సమర్థులు’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement