పాలకేంద్రం ముసుగులో కల్తీపాలు | Adulterated milk in Dairy Farm Prakasam | Sakshi
Sakshi News home page

పాలకేంద్రం ముసుగులో కల్తీపాలు

Published Fri, Dec 28 2018 1:20 PM | Last Updated on Fri, Dec 28 2018 1:20 PM

Adulterated milk in Dairy Farm Prakasam - Sakshi

కల్తీపాల క్యాన్లతో అధికారులు

ప్రకాశం, గుడ్లూరు: పాల కేంద్రం ముసుగులో కల్తీపాలు తయారు చేసి అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న యువకుడిని ఎస్‌ఐ సంపత్‌కుమార్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగూర్‌మీరా గురువారం వలపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడి నుంచి కల్తీ పాల పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో కలకలం రేపుతున్న ఈ సంఘటన రావూరులో వెలుగు చూసింది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిరియం ప్రభాకర్‌ పాలకేంద్రం నడుపుతున్నాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో ఆరు నెలలు నుంచి ఇంట్లో కల్తీపాలు తయారు చేయడం ప్రారంభించాడు. కల్తీ పాలు తయారీకి అవసరమైన పాలపొడి, నూనె ప్యాకెట్లు, యూరియా, ఉప్పు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పశుపోషకుల వద్ద 30 లీటర్లు మంచి పాలు కొనుగోలు చేసి వాటికి తగిన మోతాదులో పాలపొడి, ఉప్పు, యూరియా, నూనె, నీళ్లు కలిపి 100 లీటర్లు చేస్తాడు. ఆ కల్తీపాలు కావలిలోని స్వీట్‌ దుకాణాలు, టీ షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇలా రోజుకు 200 లీటర్ల కల్తీపాలు తయారు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. కల్తీపాలు తయారీ సమచారం అందుకున్న ఎస్‌ఐ సంపత్‌కుమార్‌.. విషయాన్ని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగూర్‌మీరాకు చేరవేశారు. అనంతరం ఇద్దరూ తమ సిబ్బందితో కలిసి రావూరులో ప్రభాకర్‌ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నిల్వ ఉంచిన 200 లీటర్ల కల్తీపాలు, 11 బస్తాల పాలపొడి, 250 ప్యాకెట్ల  ప్రీఢం సన్‌ప్లవర్‌ ఆయిల్, యూరియా బస్తాలు, వేయింగ్‌ మిషన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ నాగూర్‌మీరా మాట్లాడుతూ కల్తీపాలను ప్రమాదకర కెమికల్స్‌ను ఉపయోగించి తయారు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కల్తీ పాలు ఉపయోగిస్తే కా>్యన్సర్‌తో పాటు ఊపిరి తిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కల్తీపాలు గృహాలకు కాకుండా స్వీట్, టి. దుకాణాలకు మాత్రమే సరఫరా చేయడంతో వారు పెద్దగా తనిఖీలు చేయరని భావించి ప్రభాకర్‌ ఈ మార్గాన్ని ప్రభాకర్‌ ఎన్నుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు రైటర్‌ డానియేలు, పోలీస్‌ సిబ్బంది ఖాదర్‌బాషా, కృష్ణ, శ్రీనివాసులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement