తెల్లనివన్నీ పాలు కాదు! | Scattered sale of adulterated milk in Greater Hyderabad city | Sakshi
Sakshi News home page

తెల్లనివన్నీ పాలు కాదు!

Published Thu, Jun 27 2024 3:54 AM | Last Updated on Thu, Jun 27 2024 4:30 AM

Scattered sale of adulterated milk in Greater Hyderabad city

సిటీ, శివారు జిల్లాల్లో  తగ్గిపోతున్న పాడి పశువులు 

పాల డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం 

దీంతో అడ్డదారులు తొక్కుతున్న వ్యాపారులు 

నీళ్లు కలపడం నుంచి యూరియా, రసాయనాలతో కల్తీ 

వివిధ డెయిరీల పేరిట నకిలీ ప్యాకింగ్‌లలో విక్రయాలు 

ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్ల తనిఖీల్లో బయటపడిన నాణ్యత లోపాలు 

కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న వైద్య నిపుణులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో విచ్చలవిడిగా కల్తీ పాల విక్రయాలు 

తెల్లనివన్నీ పాలు కాదు.. పాలు అనుకుని మనం తాగుతున్నవన్నీ అచ్చమైన పాలు కానే కాదు.. కుళాయి నీళ్ల నుంచి యూరియా, ఇతర రసాయనాల దాకా ఏవేవో కలిపిన కల్తీ పాలు.. నకిలీ పాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగిపోయి.. పాడి పశువుల పెంపకం తగ్గిపోయి.. పాల ఉత్పత్తి పడిపోతోంది. నగరంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడుతోంది. దీనితో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కి.. కల్తీ, నకిలీ పాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రేటర్‌ హైదరాబాద్, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సగటున 28 లక్షల లీటర్ల పాలు అవసరమని అంచనా. ఇందులో 22 లక్షల లీటర్లు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నాయి. డెయిరీ రైతులు, డబ్బావాలాలు, ఇతర వ్యాపారులు నేరుగా మరో ఆరు లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో రెండు, మూడు లక్షల లీటర్ల మేర కల్తీ చేసినవో, కృత్రిమంగా తయారు చేసినవో ఉంటున్నాయని అంచనా. 

ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు ఇటీవల చేవెళ్ల, నందిగామ, ఆల్మాస్‌గూడ, నాదర్‌గుల్, ముచ్చింతల్, పసుమాములలోని పలు ప్రైవేటు డెయిరీల నుంచి నమూనాలు సేకరించి.. పరిశీలించగా అక్రమాలు వెలుగుచూశాయి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు పాలు లేకపోవడంతో ఆయా డెయిరీల యజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. 

ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు.. బీర్‌ దాణా 
» పాలకు డిమాండ్‌ నేపథ్యంలో కొందరు డెయిరీల నిర్వాహకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అడ్డగోలు మార్గం పడుతున్నారు. అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. 

ప్రమాదకరమైన ‘బీర్‌ దాణా’ తాగిస్తున్నారు. దీనికితోడు పాలలో పాలపొడి, కుళాయి నీళ్లు, రసాయనాలు కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ఆ పాలు నాసిరకంగా, రుచి లేకుండా ఉంటున్నాయి. పెరుగు తోడుకోకపోవడం, తోడుకున్న పెరుగు కూడా సాయంత్రానికే దుర్వాసన వెదజల్లుతుండటం వంటివి జరుగుతున్నాయి. 

ఇదీ పాడి లెక్క 
»  ఒకప్పుడు సిటీలో వాడే పాలలో చాలా వరకు శివారు జిల్లాల్లోని వ్యక్తిగత డెయిరీల నుంచే సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం వ్యవసాయ భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లాలో 27,068 గోజాతి, 59,895 గేదె జాతి పశువులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,88,182 గోజాతి, 1,22,587 గేదె జాతి పశువులు ఉన్నాయి.

వీటిలో 1,25,246 ఆవులు, గేదెలు మాత్రమే పాలు ఇస్తున్నట్టు గుర్తించారు. వాటి నుంచి రోజుకు సగటున 5,56,055 లీటర్ల పాల దిగుబడి వస్తుండగా.. అందులో 43,688 లీటర్లు రైతులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. 97,998 లీటర్లు ప్రభుత్వ డెయిరీలకు విక్రయిస్తున్నారు. మరో 1,80,382 లీటర్ల పాలను స్వయంగా ఔట్‌లెట్లు తెరిచి విక్రయిస్తున్నారు.

ఇంటింటా తిరిగి పాలు పోసే డబ్బావాలాలు మరో 1,27,965 లీటర్ల మేర అమ్ముతున్నారు. ప్రైవేటు డెయిరీలు 1,60,556 లీటర్లు విక్రయిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నగరానికి పాలు దిగుమతి అవుతున్నాయి.

కృత్రిమంగా పాలు తయారు చేస్తూ.. 
»ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లికి చెందిన ఓ పాడి రైతు ఇంటిపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కృత్రిమంగా తయారు చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 120 లీటర్ల కృత్రిమ పాలు, పది పాల పౌడర్‌ ప్యాకెట్లను స్వా«దీనం చేసుకుని కేసు కూడా నమోదు చేశారు.

» పాశమైలారానికి చెందిన ఓ వ్యాపారి.. స్థానికంగా మూతపడ్డ ఓ పరిశ్రమను అద్దెకు తీసుకుని, గుట్టుగా కల్తీ పాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ డెయిరీ లేబుళ్లతో కల్తీ పాలు, పెరుగు, ఇతర పాల పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించి అరెస్ట్‌ చేశారు. 

పాల స్వచ్ఛతను గుర్తించొచ్చు ఇలా..
»  స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకడితే అందులో నీళ్లు కలిశాయని అర్థం.
» లాక్టోమీటర్‌ సాయంతో పాలలోని కొవ్వు, ఇతర ఘనపదార్థాలు ఎంత శాతం ఉన్నాయో గుర్తించవచ్చు.
» పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి.. మూతపై నీటిలా ఏర్పడితే సరే. అలాకాకుండా స్పటికాల్లా ఏర్పడితే యూరియా కలిసి ఉండే చాన్స్‌ ఎక్కువ. 
»  స్వచ్ఛమైన పాలను నున్నటి తలంపై వేస్తే.. అది పారినంత మేర తెల్లటి చార ఏర్పడుతుంది. అలా చార ఏర్పడకుంటే.. నీళ్లు ఎక్కువగా కలిసినట్టే.
»వేడి చేసినప్పుడు పాలపై పసుపు రంగులో మీగడ ఏర్పడటం, పెరుగు సరిగా తోడుకోకపోవడం జరిగితే.. అందులో వనస్పతి కలిసి ఉన్నట్టే.
»పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలుపుతుంటారు. అలాంటి పాలను మరిగించి, తోడు వేస్తే పెరుగు సరిగా ఏర్పడదు. అంతా నీళ్లలా కనిపిస్తుంది.

పాలలో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు.. 
» పాడి పశువుల సంఖ్య తగ్గి, పాలలో కల్తీ పెరిగింది. నీళ్లు కలిపితే పెద్దగా నష్టం లేదు. కానీ పాలు చిక్కగా కనిపించేందుకు కార్న్‌ఫ్లోర్‌.. వెన్నశాతం కోసం యూరియా, వనస్పతి వంటివి కలుపుతున్నారు. పాలు విరిగిపోకుండా ఉండేందుకు డిటర్జెంట్స్, తినే సోడా, అమ్మోనియం సల్ఫేట్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, రుచి మారకుండా ఉండేందుకు బోరిక్‌ యాసిడ్‌ కలుపుతున్నారు. అలాంటి పాలు తాగడం ప్రమాదకరం. అయోడిన్‌ సొల్యూషన్‌తో పాలను పరీక్షించడం ద్వారా పిండి పదార్థాలు కలిపారా? రెడ్‌ లిట్మస్‌ పేపర్‌ ద్వారా యూరియా కలిపారా గుర్తించొచ్చు. – ఎన్‌.రాజు, రసాయన శాస్త్రవేత్త 

ఆ పాలు తాగితే అనారోగ్యమే.. 
»   కొందరు పాల విక్రేతలు, చిన్న డెయిరీల నిర్వాహకులు పాల కల్తీకి పాల్పడుతున్నారు. ప్యాకెట్‌ పాలను నమ్మకుండా.. బయట కొనేవారి బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గం పడుతున్నారు. అపరిశుభ్ర పరిస్థితులతో.. వాటిలో ఈ–కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా మరిగించకుండా తాగితే రోగాల బారినపడటం ఖాయం. రసాయనాలు కలిపిన పాలు వాడితే అనారోగ్యమే.  – డాక్టర్‌ అమరవాది ప్రభాకరాచారి, సీనియర్‌ సర్జన్‌ (రిటైర్డ్‌) 

సబ్‌ స్టాండర్డ్‌ కేసులే..  
» ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే పాలు, ప్యాకెట్‌ పాల నాణ్యతా ప్రమాణాలను తరచూ పరిశీలిస్తున్నాం. చాలా వరకు సబ్‌ స్టాండర్డ్‌ (వెన్నశాతం, నాణ్యతలో తేడాలు)గా గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో ఏమీ దొరకలేదు. ఇక కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నారు.  – ఉదయ్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement