పాలను కల్తీ చేయడానికి వాడే ముడి సరుకు
పసిపిల్లలకు పాలు దివ్య ఔషధం అంటారు.. చిన్నారులు ఇష్టంగా తాగే పాలను అమృతంతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటిని అక్రమార్కులు ‘పాల’కూట విషంగా మార్చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పా‘పాల’ భైరవులు పెరిగిపోతున్నారు. రసాయనాలు, నూనె, పాల పౌడర్, యూరియాతో కృత్రిమపాలను సృష్టిస్తూ విషతుల్యంగా మార్చేస్తున్నారు. నిర్భయంగా వాటిని ప్రజలకు అంటగడుతూ ఆస్పత్రుల ‘పాలు’ చేస్తున్నారు. తమస్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో నురగ, చిక్కదనం పెరిగేందుకు యూరియా నీళ్లను కలుపుతున్నట్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది.
- ఘట్‌కేసర్ టౌన్/ ఘట్‌కేసర్
గతంలో పాడి సంపద విస్తారంగా ఉండేది. ఇంటిల్లిపాది పెరుగు, పాలను తీసుకునేవారు. అకాల వర్షాలు, కరువు కాటకాలు రావడంతో పశువులను సాకలేక కబేళాలకు తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగిన పాలు లభించకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. కల్తీపాల దం దాకు తెరలేపారు. గుట్టుగా తమ వ్యాపారం సాగించడానికి ఊరికి దూరంగా ఉన్న భవనాలు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బావులను ఎంచుకుంటున్నారు.
ఆటోల్లో తరలింపు..
ఇలా తయారు చేసిన పాలను స్థానికంగా విక్రయిస్తే అనుమానిస్తారని గుట్టుచప్పుడుగా ఆటోల్లో నగరానికి తరలిస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, బేకరీలు, మిఠాయి షాపులకు విక్రయిస్తుంటారు. అసలు పాలు లీటర్‌కు రూ. 50 నుంచి రూ.70 ఉండగా వీటిని రూ.40కే విక్రయిస్తుంటారు. ఇలా ఆవులు, గేదెలు లేకుండానే పాలను సృష్టిస్తూ తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు గడిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
ఆరోగ్య సమస్యలు...
వీటిని తాగినవారు తీవ్రమైన జీర్ణకోశవ్యాధుల బారినపడుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పాలు తాగిన చిన్నారుల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. బాల్యంలోనే స్థూలకాయం, మందబుద్ధి ఏర్పడతాయి. యూరియా ఆనవాళ్లున్న పాలను తాగినవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణుల్లో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ, క్యాన్సర్, కాలేయ సమస్యలు వస్తాయి.
కరువైన నిఘా..
అడపాదడపా అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు బనాయించినా బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరిగి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మండలంలోని అంకుశాపూర్, ఏదులబాద్ గ్రామాల్లో రెండు సార్లు కల్తీపాల తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. ఆ రెం డు సంఘటనల్లో నిందితుడు ఒకడే కావడం గమనార్హం.
తయారీ ఇలా...
10 లీటర్ల పాలు తయారు చేయడానికి కిలో పాల పౌడర్, లీటరు నూనె, 40 శాతం యూరియా, 10శాతం సర్ఫ్ వాడతారు. అందులో అవసరమైన నీళ్లను పోస్తారు. ఆ తర్వాత వాటిని కర్ర సాయంతో బాగా కలుపుతారు. అవసరమైతే మిక్సీని వాడతారు. బాగా కలిసిన తర్వాత వాటికి స్వచ్ఛమైన కొన్ని పాలు కలుపుతారు.
పాలలో వెన్న శాతాన్ని సరిచూస్తారు. దానిని బట్టి నూనె కలపాల్సిన పరిమాణాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. తెల్లదనం నురగ, పొంగు రావడానికి యూరియా, సర్ఫ్ కలుపుతారు. సాధారణ పాలు, కల్తీపాలకు ఏ మాత్రం తేడా కనిపించకుండా చూస్తారు.
ఇలా సొమ్ము చేసుకుంటూ..
కిలో పాల పౌడరుకు రూ.150, నూనె ప్యాకెటుకు రూ.80, యూరియాకు రూ.12, సర్ఫ్‌కు రూ.4 ఖర్చు చేస్తారు. 10 లీటర్లపాల తయారీకి దాదాపు రూ.250 ఖర్చవుతుంది. లీటరు పాలను రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. 10 లీటర్ల పాలు విక్రయిస్తే రూ.450 నుంచి రూ.500 వరకు వస్తాయి. ఖర్చులు పోను 10లీటర్లకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదిస్తారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లీటర్ల పాలను సరఫరా చేస్తారు. ఈ చొప్పున రోజుకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు అక్రమార్జన చేస్తున్నారు.
కల్తీ పాలతో తీవ్ర అనారోగ్యం ..
కల్తీ పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై సత్వర ప్రభావం కనిపిస్తుంది. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయం, హెపటైటిస్ బీ వంటి వ్యాధుల సోకే అవకాశం ఉంది. ఇతర అవయవాలు దెబ్బతీనే ప్రమాదం ఉంది. పాలను తీసుకునే ముందు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది గమనించాలి.
-డాక్టర్ సతీష్, ప్రాథమిక వైద్య కేంద్రం, ఘట్‌కేసర్