సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) భూ దోపిడీ వ్యవహారంలో అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసు అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర సహకారానికి సంబంధించినదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసు అని చంద్రబాబు తరపు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కుటుంబానికి, పార్టీ కి, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు పరస్పరం సహకరించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, బాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరపున ఏజీ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పోలీసు కస్టడీ కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి వీల్లేదని తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడానికి వీల్లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికే అరెస్టయిన నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన డీఫాల్ట్‌గా కస్టడీలో ఉన్నట్లు భావిస్తూ ఆయన న్యాయవాదులు ప్రస్తావిస్తున్న తీర్పులు ఇక్కడ వర్తించవన్నారు. ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్, మరో కేసులో పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడంలేదు కాబట్టే, ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందని చెప్పారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదన్నారు. కింది కోర్టుకెళ్లకుండా నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని తెలిపారు.
కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం శ్రీరామ్ వాదనల నిమిత్తం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గత ప్రభుత్వం, అధికారులు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలకు నేర స్వభావాన్ని ఆపాదిస్తున్నారని తెలిపారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగలేదని, ఎలాంటి భూమినీ సేకరించలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు.
హెరిటేజ్ కంపెనీతో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. అది లిస్టింగ్ కంపెనీ అని, లక్షల మంది వాటాదారులున్నారని తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా 2014లో ఆ కంపెనీ అమరావతి పరిధిలో కొన్న భూమి రింగ్ రోడ్డుకు 9 కి.మీ. దూరంలో ఉందన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చారని, అందులో భాగంగానే కరకట్ట వద్ద ఉన్న ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లింగమనేని రమేష్ ఖాతాలో జమ చేసిన రూ.27 లక్షలు అవినీతి సొమ్ము కాదని, ఈ డబ్బు చంద్రబాబు తను ఉంటున్న ఇంటికి చెల్లించిన అద్దె మొత్తమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment