సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం తీవ్ర నిరాశ మిగిల్చింది. వివిధ కేసుల్లో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఏపీ ఫైబర్‌గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అంగళ్లు విధ్వంసం కేసులకు సంబంధించి ఆయనకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైబర్‌గ్రిడ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను.. ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సైతం ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
ముందస్తు బెయిల్‌కు బాబు పిటిషన్..
ఏపీ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థకు ప్రాజెక్టు దక్కడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు.. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్‌తో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేష్‌రెడ్డి సుదీర్ఘ విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని ఈ నెల 5న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయంతెలిసిందే. ఈ కేసులో సోమవారం ఉదయం జస్టిస్ సురేష్‌రెడ్డి తన తీర్పును వెలువరించారు. ఆయన ఏమన్నారంటే..
అంతిమంగా నిధులెక్కడికి వెళ్లాయన్నది దర్యాప్తు చేయాలి..
‘టెరాసాఫ్ట్‌తో చంద్రబాబుకున్న సంబంధం, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చూపిన శ్రద్ధ తదితర అంశాలకు సంబంధించి సీఐడీ పలు లిఖితపూర్వక ఆధారాలను కోర్టు ముందుంచింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పటి అధికారులను ప్రభావితం చేశారు. ఎలాంటి విధి విధానాలను పాటించకుండా, ఎలాంటి పరిశీలన చేయకుండానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేశారు. అలాగే, టెరాసాఫ్ట్‌కు అనుకూలంగా వ్యవహరించని అధికారులను మార్చడానికి సంబంధించిన ఆధారాలను.. టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించడం, టెండర్ గడువు తేదీని పొడిగించడం వంటి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించింది.
రూ.330 కోట్ల విలువ చేసే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన నోట్‌ఫైళ్లలో ఎలాంటి అభ్యంతరాలను, ప్రతికూల అభిప్రాయాలను రాయవద్దని చంద్రబాబు తనకు సూచించారంటూ అప్పటి ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి నుంచి వాంగ్మూలాన్ని కూడా సీఐడీ సేకరించింది. అలాగే, టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తనకు చెప్పారంటూ అప్పటి పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్నీ సీఐడీ ఈ కోర్టు ముందుంచింది.
అంతేకాక.. వేమూరి హరికృష్ణ ప్రసాద్, అప్పటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (ఇన్‌క్యాప్) మాజీ ఎండీ కె. సాంబశివరావులతో కలిసి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. సాంబశివరావు చేసిన ప్రతిపాదన మేరకు హరికృష్ణ ప్రసాద్‌ను టెండర్ కమిటీ సభ్యునిగా నియమించారు. నిబంధనలకు, చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ఆమోదించారు. కానీ కేసు నమోదు చేసిన రెండేళ్లకు చంద్రబాబును నిందితునిగా చేర్చారని.. ఇప్పుడు నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయని సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు సాధ్యం కాదు..
ఇలాంటి కేసుల్లో దర్యాప్తునకు పట్టే సమయాన్ని, సీఐడీ సేకరించిన ప్రాథమిక ఆధారాలను, ఈ కేసుతో ముడిపడి ఉన్న పలువురు సాక్షులను గత నెల 14న విచారించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయన్న వాదనలో ఎలాంటి బలం ఈ కోర్టుకు కనిపించడంలేదు. విస్తత ప్రజా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఈ కేసులో నేర తీవ్రతను, టెరాసాఫ్ట్‌కు చంద్రబాబు రూ.114.53 కోట్ల మేర ఆయాచిత లబ్ధిచేకూర్చారన్న ఆరోపణలను, తద్వారా ఖజానాకు నష్టం కలిగించిన విషయాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అందువల్ల ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదు. అంతిమంగా నిధులు ఎక్కడికి వెళ్లాయన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ దశలో దర్యాప్తునకు ఎలాంటి భంగం కలగరాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు పిటిషన్‌ను కొట్టేస్తున్నా’.. అని జస్టిస్ సురేష్‌రెడ్డి తన తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment