fibergrid project
-
బాబుకు నో బెయిల్
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం తీవ్ర నిరాశ మిగిల్చింది. వివిధ కేసుల్లో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఏపీ ఫైబర్‌గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అంగళ్లు విధ్వంసం కేసులకు సంబంధించి ఆయనకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైబర్‌గ్రిడ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను.. ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సైతం ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. ముందస్తు బెయిల్‌కు బాబు పిటిషన్.. ఏపీ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థకు ప్రాజెక్టు దక్కడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు.. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్‌తో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేష్‌రెడ్డి సుదీర్ఘ విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని ఈ నెల 5న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయంతెలిసిందే. ఈ కేసులో సోమవారం ఉదయం జస్టిస్ సురేష్‌రెడ్డి తన తీర్పును వెలువరించారు. ఆయన ఏమన్నారంటే.. అంతిమంగా నిధులెక్కడికి వెళ్లాయన్నది దర్యాప్తు చేయాలి.. ‘టెరాసాఫ్ట్‌తో చంద్రబాబుకున్న సంబంధం, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చూపిన శ్రద్ధ తదితర అంశాలకు సంబంధించి సీఐడీ పలు లిఖితపూర్వక ఆధారాలను కోర్టు ముందుంచింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పటి అధికారులను ప్రభావితం చేశారు. ఎలాంటి విధి విధానాలను పాటించకుండా, ఎలాంటి పరిశీలన చేయకుండానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేశారు. అలాగే, టెరాసాఫ్ట్‌కు అనుకూలంగా వ్యవహరించని అధికారులను మార్చడానికి సంబంధించిన ఆధారాలను.. టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించడం, టెండర్ గడువు తేదీని పొడిగించడం వంటి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించింది. రూ.330 కోట్ల విలువ చేసే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన నోట్‌ఫైళ్లలో ఎలాంటి అభ్యంతరాలను, ప్రతికూల అభిప్రాయాలను రాయవద్దని చంద్రబాబు తనకు సూచించారంటూ అప్పటి ఎనర్జీ డిపార్ట్మెంట్ కార్యదర్శి నుంచి వాంగ్మూలాన్ని కూడా సీఐడీ సేకరించింది. అలాగే, టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తనకు చెప్పారంటూ అప్పటి పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్నీ సీఐడీ ఈ కోర్టు ముందుంచింది. అంతేకాక.. వేమూరి హరికృష్ణ ప్రసాద్, అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (ఇన్‌క్యాప్) మాజీ ఎండీ కె. సాంబశివరావులతో కలిసి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. సాంబశివరావు చేసిన ప్రతిపాదన మేరకు హరికృష్ణ ప్రసాద్‌ను టెండర్ కమిటీ సభ్యునిగా నియమించారు. నిబంధనలకు, చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ఆమోదించారు. కానీ కేసు నమోదు చేసిన రెండేళ్లకు చంద్రబాబును నిందితునిగా చేర్చారని.. ఇప్పుడు నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయని సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు సాధ్యం కాదు.. ఇలాంటి కేసుల్లో దర్యాప్తునకు పట్టే సమయాన్ని, సీఐడీ సేకరించిన ప్రాథమిక ఆధారాలను, ఈ కేసుతో ముడిపడి ఉన్న పలువురు సాక్షులను గత నెల 14న విచారించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయన్న వాదనలో ఎలాంటి బలం ఈ కోర్టుకు కనిపించడంలేదు. విస్తత ప్రజా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కేసులో నేర తీవ్రతను, టెరాసాఫ్ట్‌కు చంద్రబాబు రూ.114.53 కోట్ల మేర ఆయాచిత లబ్ధిచేకూర్చారన్న ఆరోపణలను, తద్వారా ఖజానాకు నష్టం కలిగించిన విషయాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అందువల్ల ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదు. అంతిమంగా నిధులు ఎక్కడికి వెళ్లాయన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ దశలో దర్యాప్తునకు ఎలాంటి భంగం కలగరాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు పిటిషన్‌ను కొట్టేస్తున్నా’.. అని జస్టిస్ సురేష్‌రెడ్డి తన తీర్పు చెప్పారు. -
మరిన్ని వ్యాపారాల్లోకి ఏపీ ఫైబర్‌గ్రిడ్
సాక్షి, అమరావతి: కేబుల్ టీవీ, టెలికాం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) మరిన్ని వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల నిర్వహణను ఏపీఎస్ఎఫ్ఎల్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా టెలికాం సంస్థలు పిలిచే టెండర్లలో పాలొ్గని ఆ ప్రాజెక్టులను కూడా చేపడతామన్నారు. వ్యాపార విస్తరణకు అనుగుణంగా మూలధనం పెంచుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం రూ. 7 కోట్లుగా ఉన్న మూలధనాన్ని రూ. 2,000 కోట్లకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీఎస్ఎఫ్ఎల్ ఆస్తుల విలువ రూ. 3,586.22 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ఫేజ్–2 ప్రాజెక్టును చేపట్టామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూ. 627 కోట్లను రుణ రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీఎస్ఎఫ్ఎల్ అకౌంట్లను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ ఆడిటింగ్ తర్వాత కాగ్‌కు సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సెట్‌టాప్ బాక్స్‌ల కొరత ఉండటంతో ఎంఎస్‌వోలు సొంతంగా వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తే తొమ్మిది నెలల గడువులో ఆ మొత్తం చెల్లించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పా.. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని గతంలోనే చెప్పానని గౌతమ్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కుంభకోణంలో లోకేశ్ పాత్ర ఉందా లేదా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని, తనను కూడా జైలుకు పంపించారన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబసభ్యులకు కూడా తెలుస్తుందన్నారు. -
ఫైబర్‌గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి : ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫైబర్ గ్రిడ్ కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. 2021 సెప్టెంబర్‌లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును సీఐడీ ఇటీవల 25వ నిందితునిగా చేర్చిందని తెలిపారు. ఆ మేర ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. ఇదీ కేసు.. : చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.321 కోట్ల మేర కుంభకోణం జరిగింది. ఈ ప్రాజెక్టు టెండర్‌ను టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ 2021లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
‘ఫైబర్‌గ్రిడ్’లోనూ అదే స్కిల్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవల్ప్మెంట్, రాజధాని తాత్కాలిక నిర్మాణాల్లో నిధులు కొట్టేయడానికి అనుసరించిన మార్గాన్నే ఫైబర్‌గ్రిడ్‌లోనూ టీడీపీ పెద్దలు అనుసరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో కూడా యథేచ్ఛగా అవినీతికి తెగబడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు కేటాయించారు. ఈ ప్రజాధనాన్ని అనేక డొల్ల కంపెనీల ద్వారా కొట్టేశారు. ఇందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని వేమూరి తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేర్పించారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలిసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పటివరకు ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవకుమార్ (ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి (ఏ–21)లతో పాటు కనుమూరి కోటేశ్వరరావును అరెస్టుచేసింది. ఈ డొల్ల కంపెనీల ద్వారా కాజేసిన సొమ్మును అందుకున్న అసలు వ్యక్తులను అరెస్టుచేసేందుకు సీఐడీ రంగం సిద్ధంచేస్తోంది. నెటాప్స్ ద్వారా ఇలా కొట్టేశారు.. ♦ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. ♦ నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ♦ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీచేసింది. ♦ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ♦ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం
-
ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్
సాక్షి, విజయవాడ: ఫైబర్ గ్రిడ్ టెండర్లలో మరోసారి అవినీతి బయటపడింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగింది. (చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు) వేమూరి, టెరాసాఫ్ట్, అప్పటి అధికారులపై కేసు నమోదైంది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా. బ్లాక్ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫోర్జరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. చదవండి: వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స -
పల్లెపల్లెలో ఉచిత వైఫై
- మూడేళ్లలో పనులు పూర్తి - ఫైబర్‌గ్రిడ్‌పై సమీక్షలో సీఎం - విస్తరణ పూర్తయితే రూ. 150 కే నెట్ కనెక్షన్ హైదరాబాద్: మూడేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన నిధుల సేకరణపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. 2018కల్లాఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పనుల్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకోసం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీనిపై ఎలాంటి పన్నులు విధించొద్దంటూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయా పనుల్ని జిల్లా కలెక్టర్లే పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ 10 నుంచి 20 ఎంబీపీఎస్, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఒకటి నుంచి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ఐటీ సలహాదారు సత్యనారాయణ ఫైబర్‌గ్రిడ్‌పై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని, విద్య, వైద్యశాలల సహా 46 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఉచిత కనెక్టివిటీ ఇవ్వాలనేది ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఆ తర్వాత వీటిని జిల్లా, మండల, పంచాయతీ స్థాయికి విస్తరిస్తామన్నారు. విస్తరణ పనులు పూర్తయితే కేవలం రూ. 150కే నెట్ కనెక్షన్ పొందవచ్చన్నారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎంవో సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.