పల్లెపల్లెలో ఉచిత వైఫై
- మూడేళ్లలో పనులు పూర్తి
- ఫైబర్‌గ్రిడ్‌పై సమీక్షలో సీఎం
- విస్తరణ పూర్తయితే రూ. 150 కే నెట్ కనెక్షన్
హైదరాబాద్: మూడేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన నిధుల సేకరణపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. 2018కల్లాఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పనుల్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకోసం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీనిపై ఎలాంటి పన్నులు విధించొద్దంటూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయా పనుల్ని జిల్లా కలెక్టర్లే పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి ఇంటికీ 10 నుంచి 20 ఎంబీపీఎస్, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఒకటి నుంచి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ఐటీ సలహాదారు సత్యనారాయణ ఫైబర్‌గ్రిడ్‌పై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని, విద్య, వైద్యశాలల సహా 46 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఉచిత కనెక్టివిటీ ఇవ్వాలనేది ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఆ తర్వాత వీటిని జిల్లా, మండల, పంచాయతీ స్థాయికి విస్తరిస్తామన్నారు. విస్తరణ పనులు పూర్తయితే కేవలం రూ. 150కే నెట్ కనెక్షన్ పొందవచ్చన్నారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎంవో సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.