స్కిల్‌ కుంభకోణంలో.. చంద్రబాబుకు బెయిల్‌ | Andhra Pradesh HC Gives N Chandrababu Naidu Bail in Skill Development Case | Sakshi
Sakshi News home page

స్కిల్‌ కుంభకోణంలో.. చంద్రబాబుకు బెయిల్‌

Published Tue, Nov 21 2023 6:24 AM | Last Updated on Tue, Nov 21 2023 7:11 PM

Andhra Pradesh HC Gives N Chandrababu Naidu Bail in Skill Development Case - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడికి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసింది. కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తాత్కాలిక బెయిల్‌ సందర్భంగా జారీచేసిన బెయిల్‌ బాండ్‌ ఆధారంగా చంద్రబాబును విడుదల చేయాలని ఆదేశించింది. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడంగానీ చేయరాదంటూ అప్పట్లో విధించిన షరతులను హైకోర్టు సడలించింది.

ఈ నెల 29 నుంచి (మధ్యంతర బెయిల్‌ గడువు ముగిసిన తరువాత) షరతుల సడలింపు ఉంటుందని తెలిపింది. మిగిలిన షరతులన్నీ యథాతథంగా ఉంటాయని స్పష్టంచేసింది. వైద్య నివేదికలను ఈ నెల 28లోపు రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌కు కాకుండా విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించాలని చంద్రబాబును ఆదేశించింది. అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తనపై స్కిల్‌ కుంభకోణం కేసు నమోదు చేసిందంటూ చంద్రబాబు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసు కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో చంద్రబాబు వాదనను ఆమోదించలేకున్నామని తేల్చిచెప్పింది. గత ప్రభుత్వ హయాంలోనే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా స్కిల్‌ కుంభకోణం కేసు తెరపైకి వచ్చిందన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదనను హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ తీర్పులో వెలువరించిన అభిప్రాయాలన్నీ కూడా ఈ బెయిల్‌ పిటిషన్‌కే పరిమితమని హైకోర్టు స్పష్టంచేసింది.

తదుపరి జరిగే విచారణపై తమ వ్యాఖ్యల ప్రభావం ఉండబోదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ‘‘మేం కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా భావించకూడదు. మేమేమీ ఈ దశలో ఈ కేసులో మినీ ట్రయల్‌ నిర్వహించాలని అనుకోవటం లేదు’’ అని వ్యాఖ్యానిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించారు. ఇందులో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం తరఫున చంద్రబాబు 10 శాతం నిధులను విడుదల చేసినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని పేర్కొనటం విశేషం.

కానీ, 90 శాతం పెట్టుబడులు పెట్టనున్నదంటూ సీమెన్స్‌ పేరిట అగ్రిమెంట్‌ జరగటం గానీ... సీమెన్స్‌ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకముందే చంద్రబాబు ప్రభుత్వం మొత్తం నిధులను విడుదల చేసి, వాటిని రకరకాల కంపెనీల్లోకి మళ్లించి విత్‌డ్రా చేయటాన్ని గానీ న్యాయమూర్తి ప్రస్తావించలేదు. పైపెచ్చు మినీ ట్రయల్‌ నిర్వహించటం లేదంటూనే... పూర్తి స్థాయి విచారణ నిర్వహించినట్లుగా బాబు పాత్రకు సంబంధించి న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేయటంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ తీర్పులోని వ్యాఖ్యల ద్వారా హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఐడీ నిర్ణయించింది. దీనిపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయనుంది. 

బెయిలుపై విచారణ జరుపుతూ  కేసుపై వ్యాఖ్యలా? 
వాస్తవానికి చంద్రబాబుకు తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయని, కంటికి చికిత్స చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరటంతో కోర్టు గతనెలాఖర్లో తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పలు షరతులతో మంజూరు చేసిన ఈ బెయిలు ప్రకారం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఆసుపత్రి వైద్యులిచ్చిన నివేదిక ఆధారంగా ఇపుడు ఆయన లాయర్లు రెగ్యులర్‌ బెయిలు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి... తాను కేసు మెరిట్స్‌ జోలికి వెళ్లటం లేదంటూనే... తన వ్యాఖ్యలు ఈ విచారణ వరకే పరిమితమని చెబుతూనే... కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ నేత లోకేశ్‌ సైతం... ‘న్యాయం గెలిచింది’ అంటూ ట్వీట్‌ చేయటం.. టీడీపీ వర్గాలు తాము కేసు గెలిచేసినట్లుగా సంబరాలు చేసుకోవటం గమనార్హం. వాస్తవానికి రిమాండ్‌ కోసం సీబీఐ అడిగినపుడు ఏసీబీ కోర్టులో కేసు మెరిట్స్‌పై విస్తృతంగా వాదనలు జరిగాయి.

సీబీఐ తనవద్దనున్న సాక్ష్యాలను అందజేసింది. అవన్నీ చూసిన మీదట... బాబు పాత్రపై తగిన ఆధారాలున్నాయని నిర్ధారిస్తూ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. కానీ హైకోర్టులో మినీ ట్రయల్‌ కాదంటూనే న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయటంపై న్యాయవర్గాలే విస్మయం వ్యక్తంచేశాయి. 

నిధులు కొల్లగొట్టడంపై పూర్తి వివరాలు సమర్పణ
చంద్రబాబు మొదట తన తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపారు. దీంతో జస్టిస్‌ మల్లికార్జునరావు కంటి శస్త్రచికిత్స నిమిత్తం ఈ నెల 28 వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. అనంతరం.. ప్రధాన బెయిల్‌పైనా ఆయనే  విచారణ జరిపారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, స్పెషల్‌ పీపీ యడవల్లి నాగ వివేకానందలు సుదీర్ఘ వాదనలు వినిపించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు అండ్‌ కో ఎలా నిధులను కొల్లగొట్టింది, వాటిని ఎలా మళ్లించింది, హవాలా మార్గంలో ఆ నిధులు తిరిగి ఎలా టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరాయో వివరించారు. ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు పొందిన ఆర్థిక లబ్ధిని ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. నోట్ల రద్దు సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన నిధుల వివరాలను కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు ఈ నెల 16న తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే.  

లిస్ట్‌ కాకుండానే అకస్మాత్తుగా తీర్పు 
ఈ నేపథ్యంలో.. సోమవారం నాటి కేసు విచారణ జాబితాలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాలేదు. అకస్మాత్తుగా ఉ.11 గంటల సమయంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై మ.2.15 గంటలకు తీర్పునిస్తున్నట్లు జస్టిస్‌ మల్లికార్జునరావు పేషీ నుంచి రిజిస్ట్రీకి సమాచారం అందింది. దీంతో రిజిస్ట్రీ ఈ విషయాన్ని సీఐడీ న్యాయవాదులకు అధికారికంగా తెలియజేసింది. అనంతరం, ఆన్‌లైన్‌లో కూడా స్క్రోల్‌ చేసింది. ఆ తరువాత మ.2.15 గంటలకు చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. తీర్పులో ప్రధాన పాఠాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. న్యాయమూర్తి తన తీర్పులో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లలేదని, మినీ ట్రయల్‌ నిర్వహించలేదని పేర్కొన్నప్పటికీ, తీర్పు మాత్రం అందుకు భిన్నంగా సాగింది.  తీర్పులోని ముఖ్యాంశాలివీ... 

పూర్తిస్థాయి పరిశీలన అవసరంలేదు
బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా పూర్తిస్థాయి సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరంలేదు. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నది మాత్రమే చూడాలి. మళ్లించిన రూ.370 కోట్లను చంద్రబాబు నగదు రూపంలో తీసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు. 1–6–2014 నుంచి 31–12–2018 వరకు తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాల నుంచి తీసుకున్నట్లు సీఐడీ చెప్పింది. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి.

పైగా ఆయన ప్రస్తుతం  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. సీఐడీ విశ్లేషణ, అభిప్రాయాల ఆధారంగా మళ్లించిన నిధులు తిరిగి టీడీపీ ఖాతాలకు చేరాయనేందుకు నిర్ధిష్టంగా ఓ ముగింపునకు రాలేం. నిధుల మళ్లింపు విషయంలో సీఐడీ ప్రాథమిక ఆధారాలను సమరి్పంచలేకపోయింది. సీమెన్స్‌కు చెందిన సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌కు చెందిన ఖన్విల్కర్‌ మధ్య పలు వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లు నడిచాయని సీఐడీ చెప్పింది. అందులో పేర్కొన్న కరెన్సీ నోట్ల నెంబర్లు ఈ కేసుకు సంబంధించినవే అని అనేందుకు ఎలాంటి ఆధారాల్లేవు.  

సబ్‌ కాంట్రాక్టర్ల ఎగవేతకు చంద్రబాబుని బాధ్యుడిగా చేయలేరు 
ఇక సీమెన్స్‌కు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులు విడుదల చేసినట్లు సీఐడీ చెప్పింది. అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు నిధులు విడుదల చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని సీఐడీ వాదించలేదు. నిధుల విడుదలకు చంద్రబాబు మొగ్గు చూపినంత మాత్రాన, నేరంలో ఆయన పాత్ర ఉన్నట్లు కాదు. ని«ధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాల్లేవు. సబ్‌ కాంట్రాక్టర్ల ఎగవేతకు చంద్రబాబును బాధ్యుడిగా చేయలేరన్న ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాదితో ఈ కోర్టు ఏకీభవిస్తోంది.

ఉల్లంఘనల గురించి అధికారులు చంద్రబాబుకు తెలియజేశారనేందుకూ ఎలాంటి ఆధారాల్లేవు. షౌజయత్‌ ఖాన్‌ అనే వ్యక్తి సీఐడీ ముందు ఇచ్చిన వాంగ్మూలం, సీమెన్స్‌ ఎండీ మాథ్యు థామస్‌ ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా కూడా నేరంలో చంద్రబాబు పాత్రకు ప్రాథమిక ఆధారాలను చూపలేదు. అయితే, ఈ దశలో ఈ వాంగ్మూలాలు సరైనవా? కావా? అన్న అంశాల జోలికి ఈ కోర్టు వెళ్లడంలేదు. బెయిల్‌ పిటిషన్‌ విషయంలో కేసు లోతుల్లోకి వెళ్లి మినీ ట్రయల్‌ నిర్వహించాల్సిన అవసరంలేదు. బెయిల్‌ మంజూరు సమయంలో సుదీర్ఘ కారణాలను సైతం తెలియజేయడం అనవసరం. అంతిమంగా అన్నీ అంశాలను ట్రయల్‌ కోర్టు జడ్జి తేలుస్తారు.   

పరిధి దాటినట్లనిపిస్తోంది 
‘బెయిల్‌ విషయంలో సుప్రీంకోర్టు నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది. చంద్రబాబు నాయుడు లేవనెత్తని పలు అంశాల జోలికి హైకోర్టు వెళ్లింది. వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండకూడదు. అందువల్ల హైకోర్టు తీర్పు లోపభూయిష్టం. బెయిల్‌ దశలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించింది. ఆధారాల గురించి హైకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాల విషయంలో పరిధి దాటింది. దర్యాప్తు కొనసాగుతుండగా దర్యాప్తులో లోపాలను ప్రస్తావించింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణను అడ్డంపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు అడ్డుగోడలా నిలిచాయి.

సీఐడీ కోరిన వివరాలు ఏ మాత్రం అందజేయలేదు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తీర్పునివ్వడం ద్వారా కింది కోర్టు అధికారాల్లో హైకోర్టులో జోక్యం చేసుకున్నట్లయింది. వాస్తవానికి బెయిల్‌ కేసుల్లో కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లకూడదు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీనిపై సీఐడీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ అభ్యంతరాన్ని హైకోర్టు రికార్డ్‌ కూడా చేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌ విషయంలో హైకోర్టు తీరు అసాధారణం. ఆరోపణలు, దర్యాప్తుపై కింది కోర్టు చేయాల్సిన పూర్తిస్థాయి ట్రయిల్‌ను హైకోర్టు నిర్వహించినట్లయింది.’ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

చంద్రబాబు పార్టీ ప్రణాళికలను ప్రభావితం చేసినట్లవుతుంది.. 
బెయిల్‌ మంజూరు చేయడం, తిరస్కరించడం పూర్తిగా కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ విచక్షణాధికారాన్ని న్యాయబద్ధంగా, మానవత్వ, కారుణ్య దృష్టితో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కేసులో చంద్రబాబు మినహా మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిల్‌ లేదా ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. 2021లో కేసు నమోదు చేయడానికి ముందు సీఐడీ 140 మందికి పైగా సాక్షులను విచారించి 4వేల పేజీల డాక్యుమెంట్లను సేకరించింది.

దర్యాప్తు ముగింపు దశకు చేరిందనేందుకు ఇదే ఆధారమంటూ కేసు కొట్టివేత కోసం చంద్రబాబు దాఖలు చేసిన మరో వ్యాజ్యంలో ఇదే హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. అన్నీ డాక్యుమెంట్లు కూడా ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నాయి. చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. అందువల్ల ఆయన విదేశాలకు పారిపోయే అవకాశంలేదు. అంతేకాక.. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, బెదిరించడంగానీ, సాక్ష్యాలను తారుమారు చేయడంగానీ జరగదు.

చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు, దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారనేందుకు సీఐడీ ఆధారాలను చూపలేదు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ సీఐడీ ముందు హాజరుకాకపోవడమన్నది ఇక్కడ అంత ప్రాధాన్యత విషయం కాదు. మధ్యంతర బెయిల్‌ సందర్భంగా ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనడం, నిర్వహించడం చేయరాదని చంద్రబాబును ఆదేశించడం జరిగింది. ఇప్పుడు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసే సమయంలో కూడా అలాంటి షరతులు విధిస్తే అది చంద్రబాబు రాజకీయ పార్టీ ప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. 

పది నిమిషాల్లోనే టీడీపీకి తీర్పు కాపీ.. 
మరోవైపు.. హైకోర్టు తీర్పు వెలువరించిన 10 నిమిషాల్లోనే తీర్పు కాపీ తెలుగుదేశం వర్గాలకు చేరిపోవడం గమనార్హం. దీంతో ఈ తీర్పు కాపీని వారు విస్తృతంగా వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేశారు. టీడీపీ న్యాయవాదులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement