బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే! | AP High Court Grant Anticipatory bail to C‍handra babu In All Case | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి ముందస్తు బెయిల్‌: ఆ మూడు కేసుల్లో అసలు జరిగింది ఇదే!

Published Wed, Jan 10 2024 2:34 PM | Last Updated on Wed, Jan 10 2024 3:45 PM

AP High Court Grant Anticipatory bail to C‍handra babu In All Case - Sakshi

గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

IRR భలే మలుపు.. 

టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు చేశారు. 

అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌ జరిగింది. 

కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు.

ఇసుకను అలా.. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. 


మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్‌ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 

ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ.  ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. 

మద్యంనూ వదలని బాబు అండ్‌ కో
ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో  ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనరేష్, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. 

ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement