denduluru mandalam
-
హెరిటేజ్ మేనేజర్ కల్తీ దందా
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్‌ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. -
పైలెట్ స్నిగ్ధ
కొవ్వలి (దెందులూరు): పైలెట్ గా రాణిస్తూ పురుషుల కంటే మహిళలు తక్కువేమి కాదని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పి.స్నిగ్ధ. కోస్తా జిల్లాల్లో తొలి మహిళా పైలెట్ గా పేర్గాంచిన ఆమె శనివారం స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో తను అనుభవాలను పంచుకున్నారు. ‘మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది.. ఇంజినీరింగ్, మెడిసిన్ వైపే కాకుండా విద్యార్థినులు అన్ని రంగాలపై ఆసక్తి పెంచుకోవాలి. ముఖ్యంగా కేంద్ర సర్వీసులపైనా, అంతర్జాతీయ స్థాయిలో రాణించే రంగాలపై దృష్టి పెట్టాలి. నా చిన్నతనంలో బాగా చదువుకోవాలని, ఆడవాళ్లు ఉన్నతస్థాయిలో ఉండాలని మా అమ్మమ్మ ఎప్పూడూ చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. దీంతో పాటు అమ్మ ఢిల్లీలో ఎయిడ్ హోస్టస్‌గా పనిచేసేవారు. అప్పుడు తరచుగా విమానాల్లో ప్రయాణించడంతో పైలెట్ కావాలని నిశ్చయించుకున్నా. ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో రెండేళ్లు పైలెట్ శిక్షణ పొందాను. 2008-09 బ్యాచ్ పైలెట్ గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముంబైలో జెట్ ఎయిర్వేస్ పైలెట్ గా పనిచేస్తున్నా. తండ్రి సివిల్ సర్వీస్ అధికారి పి.రవీంద్రబాబు, తల్లి సునీత స్ఫూర్తితో ఈ స్థాయికు చేరుకోగలిగా. యువతులు పైలెట్ కోర్సు చదివి స్థిరపడాలని అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఇందుకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి’అన్నారు. ముందుగా స్నిగ్ధకు గ్రామస్తులు, బంధువులు ఘనస్వాగతం పలికారు.