West Godavari Crime News
-
ఘరానా మోసగాడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: అద్దె వాహానాలను విక్రయిస్తూ ఘరానా మోసాలకు పాల్పడిన మెడపాటి మురళీ అనే వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు మీడియా ముందు హజరుపరిచారు. నిందితుడు అద్దె పేరుతో వాహనాలు తీసుకుని వాటిని విక్రయించినట్లు చెప్పారు. ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే 13 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిందితుడు 13 కార్లను అద్దెకు తీసుకుని వాటిని అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపామన్నారు. ఈ క్రమంలో నిందితుడు మొరళీని ఇవాళ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈజీ మని జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తాళే.. యమపాశంగా!
పశ్చిమగోదావరి ,గణపవరం: అనుమానంతో భర్త పెట్టే వేధింపులు భరించలేక చంటిబిడ్డతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి, తాను కట్టిన తాళినే ఉరితాడుగా మార్చి కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నెల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అనుమానంతో ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ బుధవారం గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తి మద్యానికి బానిసై, మొదటి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె అతనిని నుంచి విడిపోయింది. గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండేళ్లక్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. భార్యను తరచూ వేధించడం, మద్యానికి బానిసై రోజూ కొట్టడంతో నంగాలమ్మ రెండు నెలలక్రితం పుట్టింటికి గణపవరం వెళ్లి, కొద్దిరోజుల తర్వాత ఐ.పంగిడిలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది. అబ్బులు ఇటీవల పిప్పరలో ఒక చేపల చెరువుపై పనికి చేరాడు. అప్పటినుంచి భార్యను రమ్మని కబురు చేస్తూ పలుమార్లు బంధువులతో రాయబారం పంపాడు. తాను ఇకమీదట వేధించనని, చేయి చేసుకోనని, బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పి ఈ నెల 17న అబ్బులు తనతోపాటు భార్యను పిప్పర తీసుకువచ్చాడు. 18వ తేదీ రాత్రి అబ్బులు బాగా తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. నాలుగో నెల గర్భిణిగా ఉన్న ఆమెపై అనుమానంతో అదే రోజు రాత్రి భార్య మెడలో ఉన్న పసుపుతాడునే పీకకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తన భార్య పడుకుని కదలడంలేదంటూ కొంతసేపు హడావుడి చేశాడు. అనంతరం బీరు సీసాతో తన గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం తన తమ్ముడి ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడిని బుధవారం గణపవరం ఎస్సై ఎం.వీరబాబు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్, ఎస్సై వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
3వేల కోసమే అనూష హత్య
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఈనెల 7న పెదవేగి మండలం మొండూరు గ్రామం పోలవరం కుడికాలువ గట్టు వద్ద కనుగొన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు గుజ్జుల సందీప్‌కు మృతురాలు అనూషకు మధ్య రూ.3 వేల విషయమై ఏర్పడిన వివాదం కాస్తా హత్యకు దారితీసినట్లు పోలీసు విచారణ వెల్లడైంది. నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ విలేకరులకు వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ అనసూరి శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై చావా సురేష్, పెదవేగి ఎస్సై నాగ వెంకటరాజు, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఉన్నారు. దెందులూరు మండలం నాగులదేవుపాడు గ్రామానికి చెందిన గుజ్జుల సందీప్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మృతురాలు జానపూడి అనూష(30)తో శారీరక సంబంధం ఉంది. (అనూష భర్త గతంలో చనిపోయాడు). కొద్దిరోజుల క్రితం అనూషకు డబ్బులు అవసరం కావటంతో వారం రోజుల్లో తిరిగి ఇస్తానంటూ రూ.3 వేలు అప్పుగా అడిగింది. తాను ఆటో వాయిదా కట్టేందుకు దాచిన సొమ్ము రూ.3 వేలు అనూషకు ఇచ్చాడు. అనంతరం సందీప్ డబ్బులు అడుగుతూ ఉండగా ఆమె ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటోంది. లాక్డౌన్ కారణంగా ఆటో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న సందీప్ కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనూష ఫోన్ చేసి సందీప్‌ను 7వ మైలు దగ్గరకు రమ్మని చెప్పటంతో అతను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఆటోలో మొండూరు వద్ద పోలవరం కుడికాలువ గ్రావెల్ రోడ్డులోకి వెళ్ళి ఆటోను పక్కగా పెట్టి మట్టిదిబ్బల వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిశారు. అనంతరం సందీప్ ఆమెను డబ్బులు గురించి అడగటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సందీప్ కోపంతో అనూషను గట్టిగా కొట్టాడు. అనంతరం ఆమె ముక్కు, నోటిని తన రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టాడు. అనూష మెడలోని చున్నీతో బలంగా లాడి ముడివేశాడు. ఆమె చనిపోవటంతో అనూష మొబైల్ ఫోను, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ కార్డు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ హత్య కేసును ఛేదించటంలో ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది హెచ్‌సీ వై.ఏసేబు, కానిస్టేబుల్స్ కిషోర్, ఎస్కే నాగూర్, సురేష్, డీ.సురేంద్ర, టీ.జయకుమార్‌లను డీఎస్పీ దిలీప్‌కిరణ్ అభినందించారు. -
పోలీసుల అదుపులో డ్రగుల్బాజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. నాలుగురోజుల క్రితం నెదర్లాండ్స్ నుంచి చెన్నై వచ్చిన పార్శిల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా భీమవరానికి చెందిన పి.భానుచంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న చెన్నైలో అరెస్టు చూపించారు. దీంతో అసలు భానుచంద్రకు డ్రగ్స్ మాఫియాకు ఉన్న లింక్‌లు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. బీటెక్‌ను మధ్యలోనే వదిలివేసినభానుచంద్ర చాలా కాలంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభ్యం అవుతున్నాయి. ఎలా పట్టుబడ్డాడు... నెదర్లాండ్స్ నుంచి ఈ నెల 16న విమానంలో చెన్నైకి ఒక పార్శిల్ వచ్చింది. అందులో బొమ్మలు (టాయ్స్) ఉన్నట్లుగా ప్యాకింగ్‌పై ఉంది. నెదర్లాండ్స్ నుంచి భారతదేశానికి బొమ్మలు తెప్పించాల్సిన అవసరం ఏంటని అనుమానించిన కస్టమ్స్ అధికారులు దీన్ని తెరిచి పరిశీలించగా బొమ్మలలో 400కి పైగా పిల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఎండీఎంఏ (మెథిలియా డ్యాక్సీ మెతంపెటామైన్) అనే డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని మత్తుతో పాటు లైంగిక సామర్థ్యం పెరగడానికి వాడతారని సమాచారం. గతంలో కూడా భానుచంద్ర పదిసార్లు ఈ డ్రగ్స్‌ను ఇండియాకి తెప్పించినట్లుగా గుర్తించారు. డార్క్ నెట్ ద్వారా... భానుచంద్ర డార్క్‌నెట్ ద్వారా ఈ డ్రగ్స్‌ను బుక్‌చేసి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఐదు వందల డాలర్లను ఆన్లైన్ ద్వారా చెల్లించి దీన్ని తెప్పించాడు. వీటి ధర ఇండియన్ మార్కెట్లో రూ.12 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. టెర్రరిస్ట్‌లు, డ్రగ్‌మాఫియా మాత్రమే ఉపయోగించే డార్క్‌నెట్‌తో భానుచంద్రకు సంబంధాలు ఎలా ఉన్నాయి? అతని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. రంగంలోకి పోలీసులు జిల్లా పోలీసు యంత్రాంగం దీనిపై రంగంలోకి దిగింది. భీమవరంతోపాటు పరిసర ప్రాంతాలు నరసాపురం ప్రాంతాలలో డ్రగ్స్‌ను రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. భీమవరం పరిసర ప్రాంతాలలో సంపన్న వర్గాలకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా విషయంలో రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? ఇంకా డ్రగ్స్ ముఠాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలపై దృష్టి పెట్టారు. భీమవరం ప్రాంతాల్లో డ్రగ్స్‌తో పాటు గంజాయి అమ్మకాలు జరిపే వారి పాత్ర ఈ వ్యవహారంలో ఎంత ఉందనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపితే జిల్లాలో బిగ్షాట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. -
కాళ్ల పారాణి ఆరక ముందే..
భీమడోలు సమీపంలోని పూళ్ల గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోనవ జంట దుర్మరణం పాలైంది. కారు డ్రైవరూ అసువులు బాశాడు. ఇటీవలే వివాహమైన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన మానస నవ్య భర్త వెంకటేష్‌తో కలిసి అత్తవారింటికి విశాఖ జిల్లా సబ్బవరానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈనెల 14న జరిగిన నవ్య పెళ్లినాటి ఫొటో ఇది.. ఏలూరు టౌన్/భీమడోలు: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధూవరులు ఘోర రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొత్త ఆశలతో భవిష్యత్తును ఊహించుకుంటూ... నాలుగు రోజుల క్రితం ఎంతో వైభవంగా వివాహ వేడుకలు చేసుకున్న నవ జంటను చూసి కాలానికి కన్నుకుట్టిందో ఏమో గానీ... గురువారం మధ్యాహ్నం మృత్యుపాశం విసిరింది. సంతోషంగా అత్తారింటికి బయలుదేరిన నవ్యను, ఆమె భర్త వెంకటేష్‌ను విగత జీవులను చేసింది. నవ జంట కాళ్ళకు వేసిన పారాణి ఇంకా ఆరలేదు... కానీ ఇద్దరినీ మృత్యువు కబళించింది. ఈహఠాత్తు సంఘటన కుటుంబ సభ్యులు, బంధువులకు పుట్టెడు దుఃఖాన్ని మిగి ల్చింది. వధువు ఇంటి వద్ద వివాహ వేడుకలు పూర్తి చేసుకుని, వరుడి స్వస్థలం విశాఖపట్నం జిల్లా సబ్బవరంలోని ఇంటికి కారులో వెళుతుండగా గురువారం మధ్యాహ్నం భీమడోలు సమీపంలోని పూళ్ళ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవజంటతోపాటు డ్రైవర్ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. కంటతడి పెట్టిస్తున్న వైనం సాఫ్ట్వేర్ ఇంజినీర్ యడ్లపల్లి వెంకటేష్, ఆలపాటి మానస నవ్య ఇద్దరూ.. ఈనెల 14న ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు. తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో నవ్య ఇంటివద్దనే మూడు రోజులు ఆనందంగా గడిపారు. తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు. భర్త వెంకటేష్ ఇంటికి విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరారు. కారు డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. నవ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తెలిసి ఇరు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశపడితే ఇలా తిరిగిరాని లోకాలకు చేరటం తట్టుకోలేకపోతున్నామని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ ప్రమాదం ఎలా జరిగింది ? కారు ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. కారు డ్రైవర్ కునుకుతీయడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైనా కారణమా అనేది నిర్ధారణ కావలసి ఉంది. పెళ్ళి కుమార్తె నవ్య సోదరుడు భరత్ చెప్పే విషయాలను బట్టి.. ఏదో లారీ తమ కారును పక్కనుంచి బలంగా ఢీకొట్టటంతో తమ కారు గాలిలో ఎగురుతూ డివైడర్ దాటి అటువైపు దూసుకుపోయిందని చెబుతున్నాడు. కారు టైర్ పంక్చర్ కావటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపుకు వెళ్లి లారీని ఢీకొట్టి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించిన డీఎస్పీ పూళ్ళ గ్రామం వద్ద జరిగిన ఈ కారు ప్రమాదాన్ని అటుగా వెళుతున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ చూడడంతో వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే సరికే ముగ్గురు మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ పరి శీలించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
ఆడపడుచు భర్త లైంగిక దాడి.. ఫొటోలు తీసి
పశ్చిమగోదావరి, కొవ్వూరు : వరుసకు సోదరుడయ్యే వ్యక్తి (ఆడపడుచు భర్త) ఆరికిరేవుల గ్రామానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి తెగబడ్డాడు. జనవరి 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చీటీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి శుక్రవారంఆరికిరేవుల వస్తుంటాడు. ఆ గ్రామానికి చెందిన తన బావమరిది ఇంటికి ప్రతివారం వస్తుండేవాడు. జనవరి 31న ఉదయం వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బావమరిది భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీసి బయట ఎవరికైనా చెబితే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, మౌనంగా ఉంటే రూ.ఐదువేలు ఇస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన వివాహిత అప్పటి నుంచి బాధను దిగమింగుకుని మౌనంగానే రోధిస్తోంది. ఎట్టకేలకు విషయం భర్త, అత్తమామలకు చెప్పి వారి సహకారంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. -
కూతురు చనిపోయిందని తండ్రి ఆత్మహత్య
పశ్చిమగోదావరి,పెరవలి: కూతురు పుట్టిందని ఎంతో ఆనందించిన తండ్రికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పుట్టిన రెండు రోజులకే కూతురు మృతి చెందటంతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çఘటన పెరవలి మండలం ఖండవల్లిలో జరిగింది. పెరవలి ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. ఖండవల్లి గ్రామానికి చెందిన బండి నరేష్(35)కు ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. గత నెల 30వ తేదీన భార్యకు ఆడపిల్ల పుట్టడంతో ఆనందించాడు. ఈనెల 2వ తేదీన పుట్టిన బిడ్డ మృతి చెందటంతో తీవ్ర మనస్తాపం చెంది అదేరోజు పురుగుమందు తాగాడు. అతనిని ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
ఏలూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలో భార్యభర్త తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు రూరల్ ప్రాంతంలోని ఎస్ఎంఆర్ నగర్లో నివాసం ఉంటున్న పామర్తి రాంబాబు, భార్య లక్ష్మీరాటాలు కూలిపనులు, అదేవిధంగా ఒక ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి అనుష్క, చందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ యజమాని చెల్లెలి ఇంట్లో పనివారు లేకపోవటంతో లక్ష్మీరాటాలు రెండు ఇళ్లలోనూ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 6న యజమాని సోదరి ఇంట్లో 12 కాసుల బంగారు ఆభరణం పోయిందని గుర్తించారు. బంగారు ఆభరణాన్ని రాటాలు తీసిందనే అనుమానంతో ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా యజమాని భార్యతోపాటు, ఆమె చెల్లెలు కలిసి రాంబాబు ఇంట్లో సోదాలు చేశారు. కాగా రాటాలు కుమార్తె తన తల్లే బంగారు ఆభరణం తీసిందని యజమాని భార్యకు చెప్పినట్లు వారు చెబుతుండగా, బెదిరించి అలా చెప్పించారని బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా యజమాని భార్య, ఆమె సోదరి కలిసి రాటాలు, ఆమె కుమార్తెలను తీవ్రంగా కొట్టి, దూషించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాంబాబు, భార్య రాటాలు, ఇద్దరు కుమార్తెలు కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. -
ఏలూరులో మహిళ హత్య!
ఏలూరు టౌన్: అదృశ్యమైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఓ చిన్న బోదెలో శవమై తేలింది. ఈ ఘటన ఏలూరులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని శనివారపుపేట ప్రాంతానికి చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణికి కొంతకాలం క్రితం వివాహమైంది. నాగమణి (34) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త శివాజీ మానసిక వికలాంగుడు. దీంతో అతను ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వరుసకు మేనల్లుడైన సంతోష్ అనే వ్యక్తితో నాగమణి సన్నిహితంగా ఉంటోంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా బలపడింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ కొద్దిరోజులుగా నాగమణిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పనుల కోసం ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి నాగమణి అతనికి దూరంగా ఉంటోంది. నాగమణికి కంటి సమస్య రావటంతో ఈనెల 20న ఏలూరు ఆర్ఆర్పేటలో శంకర్ నేత్రాలయ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆమె సోదరుడు తీసుకువెళ్లాడు. ఈ సమయంలోనూ సంతోష్ వారిని వెంబడించినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్ళి పోయింది. ఈనెల 21న యథావిధిగా ఆటోలో సత్రంపాడులోని ఒక ఇంటికి పని చేసేందుకు వెళ్ళింది. అప్పుడు కూడా సంతోష్ ఆమెను వెంబడించాడు. అప్పటి నుంచి నాగమణి అదృశ్యమైంది. బంధువులు ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. సోమవారం ఏలూరు దొండపాడు దత్తాశ్రమం సమీపంలోని ఒక బోదెలో నాగమణి శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో త్రీటౌన్ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. హత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరికీ తాళికట్టి.. గొంతునులిమి హత్య
జంగారెడ్డిగూడెం: ఈ నెల 18న స్థానిక బస్టాండ్ వద్ద ఒక మహిళను హత్యచేసిన నేరంపై ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు. బేతపూడి హేమలత(29) అనే మహిళను కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్‌కుమార్ పీక నులిమి హత్యచేసినట్లు తెలిపారు. మండలంలోని నిమ్మలగూడేనికి చెందిన హేమలతకు 2012లో చాగల్లులో పనిచేస్తుండగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైనట్లు చెప్పారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారన్నారు. అయితే 2014లో హేమలతకు తెలియకుండా ప్రవీణ్‌కుమార్ కొవ్వూరుకు చెందిన వేరొక మహిళను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హేమలతకు కూడా ఏడాది క్రితం గౌరీపట్నం మేరీ మాత గుడిలో తాళికట్టినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నారు. తరువాత కొన్ని రోజులకు ప్రవీణ్‌కుమార్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు హేమలతకు తెలిసిందన్నారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని హేమలత నివాసం ఉంటున్నట్లు తెలిపారు. స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేస్తోందన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ అప్పుడప్పుడూ హేమలత వద్దకు వచ్చి వెళుతుండేవాడని, ఏ పనీ లేక, ఆదాయం లేక హేమలతను డబ్బులు అడుగుతుండేవాడన్నారు. దీంతో హేమలత ఎంతో కొంత డబ్బులు ఇస్తుండేదని డీఎస్పీ చెప్పారు. అయితే ఘటనకు ముందు వారం రోజులుగా ప్రవీణ్‌కుమార్ జంగారెడ్డిగూడెం వచ్చి ఆమె వద్ద ఉంటున్నాడని, ఆమెను డబ్బులు అడగ్గా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. ఈనేపథ్యంలో హేమలతను ప్రవీణ్‌కుమార్ కొట్టి గొంతునులిమి హత్యచేసినట్లు వెల్లడించారు. అయితే ఆమె బాత్రూమ్కు వెళ్లి పడిపోయి మృతిచెందినట్లు అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడన్నారు. నిందితుడిపై హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన బీఎన్ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు, ఏఎస్సై ఎన్వీ సంపత్‌కుమార్, హెచ్‌సీ ఎన్.రాజేంద్ర, పీసీలు కె.కిరణ్, బి.హరిప్రసాద్‌లను డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ వివాహిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాత్రూమ్లో పడి మృతి చెందినట్లు భర్త చెబుతుండగా, హతురాలి సోదరి, సోదరుడు మాత్రం భర్త ప్రవీణ్‌కుమారే హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతురాలు హేమలత (29) స్థానికంగా ఉన్న ఒక ఫొటో కలర్‌ల్యాబ్‌లో పనిచేస్తోంది. ఈమెకు ఆరేళ్ల క్రితం కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం కాగా, వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కొంతకాలం నిమ్మలగూడెంలో కాపురం ఉన్నారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ ఎదురుగా ఒక ఇల్లును అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉండగా, హేమలత బాత్రూమ్లో పడిపోయిందని, మాట రావడం లేదని, ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతున్నానని భర్త ప్రవీణ్‌కుమార్ బుధవారం ఉదయం మృతురాలి సోదరుడు రాంపండుకు ఫోన్లో చెప్పాడు. దీంతో రాంపండు, సోదరి లీల, వరుసకు మేనమామ అయిన భానుశివకుమార్ వెంటనే ప్రభుత్వాసుపత్రికి చేరుకోగా, అప్పటికే హేమలత మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రవీణ్‌కుమార్ తమ సోదరిని హత్యచేసి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల భర్త ప్రవీణ్‌కుమార్ తన ఖర్చుల కోసం డబ్బులు ఇమ్మని తమ సోదరిని వేధించేవాడని వాపోయారు. కాగా ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు పరిశీలించారు. అలాగే ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు పరిశీలించారు. అంతేగాక సోదరి లీల జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హేమలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలోనే ప్రవీణ్‌కుమార్‌కు వేరే మహిళతో వివాహమైనట్లు తెలిసింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయక్ తెలిపారు. -
కీచక ఉపాధ్యాయుడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలు మండలం తాడమళ్ల హైస్కూల్ తెలుగు కీచక ఉపాధ్యాయుడిని సమిస్రగూడెం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తెలుగు టీచర్ తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్ విద్యార్థిని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కీచక టీచర్‌పై 2012 పోక్స్ చట్టం-354(A), 376 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. 24 గంటల్లోపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
పురుగు మందు తాగి.. కొడుక్కి పట్టించి..
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ఏలూరు వన్‌టౌన్‌లో ఓ తండ్రి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి, దానిని తన ఐదేళ్ల కొడుకుకు తాగించి ఆత్మహత్యాయత్నం చేయటం నగరంలో కలకలం రేపింది. గమనించిన స్నేహితులు వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే తండ్రి మృతిచెందినట్లు నిర్ధారించారు. చిన్నారి ఆరోగ్యస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలో పడమరవీధి జోగిమేడ వద్ద నివాసం ఉంటోన్న ఉప్పలపాటి శివప్రసాద్ (35) ఏలూరుకు చెందిన ముస్లిం యువతి హరిణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శివప్రసాద్ ముసునూరు మండలం గోపవరానికి చెందిన వ్యక్తికాగా, కొంతకాలంగా ఏలూరులోనే నివాసం ఉంటున్నాడు. వారికి ఐదేళ్ల కుమారుడు రాణాకార్తికేయ ఉన్నాడు. కుమారుడు ఏలూరు సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నట్లు చెబుతున్నారు. శివప్రసాద్ ఏలూరులో వల్లభ మిల్క్‌డైరీ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య హరిణి విజయవాడ వెళ్లగా ఆకస్మికంగా మంగళవారం సాయంత్రం పురుగుల మందును కూల్‌డ్రింకులో కలిపి తాను తాగి, ఐదేళ్ల కొడుకు కార్తికేయతో కూడా తాగించాడు. రాత్రి 7.30 గంటల సమయంలో స్నేహితులు విషయం తెలుసుకుని ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శివప్రసాద్ మృతిచెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ తగాదాలా.. లేక వ్యాపార పరమైన అంశాలేవైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహత్యయత్నంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీ సుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. -
‘తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం’
సాక్షి, పశ్చిమ గోదావరి: భార్య మీద కోపంతో పిల్లలను చితకొట్టి హింసించిన ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నరసాపురం ఘటన తనను కలచివేసిందని, తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం అన్నారు. బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రి అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి వచ్చేవరకు చిన్నారులిద్దరిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్నారులను హింసించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి అదేశించారు. ఇటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, పిల్లలిద్దరిని తణుకు బాలసదనంలో చేర్పించి చదివిస్తామని మంత్రి పేర్కొన్నారు.(చదవండి: గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం) -
‘దేవుడి ప్రసాదం’ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు
సాక్షి, పశ్చిమగోదావరి : సులువుగా డబ్బులు సంపాందించాలనే దురుద్దేశంతో ఓ వ్యక్తి దేవుడి ప్రసాదం పేరుతో ఘోరాలకు పాల్పడ్డాడు. విషం కలిపిన ‘దేవుని ప్రసాదం’ ఇచ్చి అమాయక భక్తుల ప్రాణాలు తీసేవాడు. వారు చనిపోయిన తర్వాత నగదు, బంగారం దోచుకుపోయేవాడు. ఇలా 8 హత్యలకు పాల్పడిన కిరాతక సీరియల్ కిల్లర్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడు చంపిన వ్యక్తుల్లో ఎక్కువమంది అతని బంధువులే ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అక్టోబరు 16న ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ) అనుమానస్పద మృతితో.. ఈ సీరియల్ కిల్లర్ అసలు స్వరూపం బయటపడింది. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దోచుకున్న డబ్బుతో నిందితుడు ఇల్లు కట్టుకున్నాడని సమాచారం. -
మహిళా వీఆర్ఏకు లైంగిక వేధింపులు
సాక్షి, తాడేపల్లిగూడెం/పశ్చిమ గోదావరి : తాడేపల్లిగూడెం తహసిల్దార్ కార్యాలయంలోని ఓ మహిళా వీఆర్ఏతో మండలానికి చెందిన అప్పారావుపేట వీఆర్వో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఏపీ స్టేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ నాయకుడు జి.ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోమవారం వివరాలు వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేశారు. మహిళా వీఆర్ఏ పట్ల కొంత కాలంగా అప్పారావుపేట వీఆర్వో ఆర్వీ పోతురాజు అసభ్యంగా ప్రవరిస్తున్నాడని, బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. తహసిల్దార్ ఆదేశానుసారం ఆదివారం పనిచేసేందుకు వచ్చిన ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వో చేయి పట్టుకున్నాడని ఆరోపించారు. వేధింపులపై సదరు మహిళా వీఆర్ఏ తమ యూనియన్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అప్పారావుపేట వీఆర్వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. లేదంటే ఈ సంఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళతామని వెల్లడించారు. దీనిపై తహసిల్దార్ ప్రసాద్ వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య!
ఏలూరు టౌన్: ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతం ఏలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడానికి చెందిన కాటి నాగరాజు (48) ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పిల్లల చదువుల నిమిత్తం కొంతకాలంగా సత్రంపాడులో నివాసముంటున్నారు. ఇటీవల సొంతూరిలో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని మోటారు సైకిల్‌పై బయలుదేరారు. బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకువెళుతున్నారని తాను అడిగితే ఎల్ఐసీ వాళ్లు స్కాన్ చేసుకుని ఇస్తారని చెప్పి తీసుకువెళ్లినట్లు అతడి భార్య చెబుతోంది. అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. అటుగా విజయవాడ నుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్ ఆయన్ను గమనించారు. నాగరాజుతో పరిచయం ఉండటంతో విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యుల సాయంతో నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆయన హత్య చేసి ఎవరైనా సొత్తు అపహరించుకుపోయారా లేక అనారోగ్యంతో ఆయన మృతి చెందారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత నాగరాజు గుండెపోటులో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్లగా నగదు, నగలు ఆయన వద్ద లేకపోవటాన్ని గుర్తించి ఎవరైనా హత్యచేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మృతి వ్యాయామోపాధ్యాయుడు నాగరాజు మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుని శరీరంæపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఏవిధంగా ఆయన చనిపోయాడు? అనారోగ్యంతోనా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా ? ఆయన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఎలా మాయమయ్యాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో రోడ్డు పక్కన పడి ఉన్న అతని వద్ద నుంచి ఎవరైనా నగదు, నగలు మాయం చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేక హత్య చేసి దుండగులు దోచుకుపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కుటుంబసభ్యులు మాత్రం నాగరాజును చంపి ఎవరో నగదు, నగలు ఎత్తుకుపోయారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు గురువారం తన సిబ్బందితో లింగారావుగూడెం వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించటంతో స్వగ్రామానికి తరలించారు. మృతుడి అన్న పెదపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తమ్ముడు విజయవాడలో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. -
సినిమా చూస్తూ వ్యక్తి మృతి
పశ్చిమగోదావరి,ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్‌లోని సత్యనారాయణ థియేటర్లో మ్యాట్నీ సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందాడు. సినిమా ముగిసిన అనంతరం గమనించిన థియేటర్లోని సిబ్బంది యాజమాన్యానికి విషయాన్ని తెలియచేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు దెందులూరు మండలం వీరభద్రపురానికి చెందిన ఉప్పే మురళీకృష్ణ (45)గా గుర్తిం చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వా స్పత్రి మార్చురీకి తరలించారు. -
కళ్లెదుటే గల్లంతు
పోడూరు: తల్లి కాలువలో దుస్తులు ఉతుకుతుండగా ఆమెకు సహాయం చేసేందుకు వచ్చిన కుమార్తె కొట్టుకుపోయి గల్లంతైన ఘటన ఇది. ఆమెను పట్టుకునేందుకు తల్లి, మరో కుమార్తె కాలువలో దిగడంతో వారు సైతం కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. ఈ ప్రమాదం గురువారం మార్టేరు శివారు కంకరపుంతరేవు ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మార్టేరుకు చెందిన పడాల యమునాదేవి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని నరసాపురం ప్రధానకాలువ వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు భార్గవి(18), ప్రియ(17) కాలువ వద్దకు వెళ్లారు. తల్లి కాలువ రేవులో దుస్తులు ఉతుకుతుండగా బార్గవి, ప్రియ కాలువలోకి దిగారు. కాలువలో నీటిప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో భార్గవి ప్రమాదవశాత్తూ కాలువలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె తల్లి యమునాదేవి, సోదరి ప్రియ ఆమెను పట్టుకునేందుకు మరింత లోపలికి దిగారు. వారు కూడా కాలువలో కొట్టుకుపోతూ దాదాపు 50 మీటర్ల దూరం వెళ్లేసరికి కాలువకు అవతలివైపు నరసాపురం–మార్టేరు స్టేట్‌హైవే పక్కన ఉన్న స్థానికులు చూసి యమునాదేవిని, ప్రియను రక్షించారు. అప్పటికే ప్రియ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాలువలో మునిగిపోయిన భార్గవి జాడ తెలియలేదు. స్థానికులు, బంధువులు, పోలీసులు కాలువ వెంబడి భార్గవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాన్వాయ్ వాహనాన్ని పంపిన మంత్రి శ్రీరంగనాథరాజు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తూర్పుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఉండగా మార్టేరులో కాలువలో బాలిక గల్లంతైన సమాచారం ఆయనకు తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించి తన వెంట ఉన్న ఆచంట ఎస్సైను కాన్వాయ్ వాహనంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆచంట ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందితో ఘటనా ప్రదేశానికి వెళ్లారు. అప్పటికి ప్రమాదం నుంచి బయటపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రియను కాన్వాయ్ వాహనంలో ఎస్సై రాజశేఖర్ హుటాహుటిన తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గ్రామంలో విషాదఛాయలు పడాల భార్గవి కాలువలో గల్లంతవడంతో మార్టేరు శివారు కంకరపుంత రేవులో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్గవి పెనుగొండలోని ఎస్‌కేవీపీ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఆ తరువాత దుస్తులు ఉతికేందుకు తల్లికి సాయంగా వెళ్లింది. అంతలోనే ఆమె కాలువలో గల్లంతయిందన్న వార్త స్థానికులను త్రీవంగా కలచివేసింది. భార్గవి తల్లి యమునాదేవి సాధారణ గృహిణి కాగా తండ్రి బులి రామకృష్ణ ఉపాధి నిమిత్తం కొద్దినెలల కొందటే దుబాయ్ వెళ్లాడు. వీరికి భార్గవి, ప్రియ ఇద్దరు కుమార్తెలు సంతానం. ప్రియ మార్టేరు ఎస్వీజీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ తల్లి షాక్‌లో ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోతోంది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కర్రి వేణుబాబు, గ్రామానికి చెందిన పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. -
వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు గొడవ
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్: క్రికెట్ బెట్టింగ్ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ సొమ్ము విషయంలో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్‌లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. -
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో పాటు, ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : మద్యం మత్తు ఆ కుటుంబంలో చిచ్చురేపింది. తాగిన మైకంలో ఓ తమ్ముడు క్రికెట్ బాట్‌తో అన్న తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన పాలకొల్లు మండలం చందపర్రులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మద్యానికి బానిసలైన దేవాబత్తుల ప్రభాకరరావు (48) అతని సోదరుడు సుభాకర్ మంగళవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించారు. వీరు ఇద్దరూ కలిసి తాగడం అలవాటుగా చేసుకున్నారు. వారి మధ్య కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దీంతో ఉక్రోషంతో తమ్ముడు సుభాకర్ అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని ప్రభాకరరావుపై దాడి చేశాడు. తలపై క్రికెట్ బ్యాట్‌తో బ లంగా మోదడంతో ప్రభాకరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉద యం ప్రభాకరరావు మరణించాడు. తల్లి సమక్షంలోనే కొట్లాట : ప్రభాకరరావు, సుభాకర్ ఇద్దరూ కొట్లాడుకునే సమయంలో తల్లి నెలసనమ్మ అక్కడే ఉంది. అన్నయ్యను కొ ట్టవద్దని వారిస్తున్నా మద్యం మత్తులో ఉన్న సుభాకర్ ఆమె మాట పట్టించుకోలేదు. మృ తుడు ప్రభాకరరావు భార్య కృష్ణవేణి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అతని కుమారుడు సుకుమార్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో తొ మ్మిదో తరగతి చదువుతున్నాడు. పరారీలో నిందితుడు వీఆర్వో మీసాల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై పి.అప్పారావు ఘటనాస్థలానికి వచ్చి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభాకరరావును హత్య చేయడానికి ఉపయోగించిన క్రికెట్ బ్యా ట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త మ్ముడు సుభాకర్ పరారీలో ఉన్నాడు. రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 159 గ్రాముల బంగారం స్వాధీనం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్ రావులపాలెంలో లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
సాక్షి, పశ్చిమ గోదావరి : పాఠశాల నుండి అదృశ్యమైన మైనర్ బాలికలను పోలీసులు పట్టుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. చింతలపూడి మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు బుధవారం అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆచూకీ కోసం పోలీసులు వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, పిల్లలను తీసుకొచ్చి జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
పరీక్ష రాస్తూ యువకుడి మృతి
సాక్షి , పాలకొల్లు(పశ్చిమగోదావరి) : గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ పరీక్ష హాలులో గుండెపోటుకు గురై మృతిచెందిన ఓ అభ్యర్థి విషాదాంతమిది. వివరాల్లోకి వెళితే పాలకొల్లు పట్టణంలోని సోమేశ్వర అగ్రహారంలో నివాసం ఉంటున్న గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీ గౌతమి స్కూల్లో ఆది వారం పరీక్ష రాస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన అనంతరం సుమారు 10.30 గంటల 11 గంటల మధ్యలో మృతుడు నరేష్‌కు స్వల్ప నొప్పి రావడంతో స్థానికంగా విధుల్లో ఉన్న ఏఎ న్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి అక్కడ నుంచి పట్టణంలోని బృందా వన ఆసుపత్రికి తీసుకెళ్లి ఈసీజీ తీయించారు. గుండె పోటు వచ్చే సూచనలు కనిపించడంతో అతడ్ని స్థానికంగా ఉన్న కార్డియాలజిస్టు డాక్టర్ రాజశేఖర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం అత్యవరసర వైద్యం కోసం భీమవరం వర్మ హాస్పిటల్‌కి అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30గంటల సమయంలో నరేష్ ప్రాణాలు విడిచారు. పరీక్ష కోసం హైదరాబాద్ నుంచి వచ్చి మృతుడు నరేష్ స్వస్థలం పెనుగొండ మండలంలోని చినమల్లం పంచాయతీ పరిధిలోని మధనవారిపాలెం. వైజాగ్ ఆంధ్రాయూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. పాలకొల్లుకి చెందిన లక్ష్మీప్రసన్నతో అతనికి సుమారు ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి శర్వాణి అనే నాలుగేళ్ల వయస్సు గల కుమార్తె ఉంది. లక్ష్మీప్రసన్న బీఎస్సీ చదివింది. వివాహం అయిన తరువాత నరేష్ పాలకొల్లులో స్థిరపడ్డారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్ వెళ్లి చదువుకుంటున్నారు. నరేష్ బావ మరిది హర్ష హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గ్రామ సచివాలయ పరీక్షల కోసం సన్నద్ధమతున్నాడు. హర్ష, నరేష్ పరీక్షల రాయడం కోసం హైదరాబాద్ నుంచి ఉదయమే వచ్చారు. పూలపల్లి శ్రీ గౌతమి స్కూల్లో పరీక్షా కేంద్రంలో వీరిద్దరూ పరీక్ష రాస్తున్నారు. బావమరిదికి చెప్పవద్దని తనకు గుండె నొప్పి వచ్చిందని బావమరిది హర్షకి చెబితే తను ఎక్కడ పరీక్ష రాయడం మానేసి వస్తారోనని పరీక్ష పూర్తయ్యేవరకు తెలియజేయవద్దని తనకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి నరేష్ చెప్పారు. దీంతో బావమరిది హర్షకి సిబ్బంది సమాచారం ఇవ్వలేదు. పరీక్ష పూర్తయిన అనంతరం వెలుపలికి వచ్చిన హర్ష విషయం తెలుసుకుని బావ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే బావ నరేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంబులెన్స్‌లో బావ నరేష్‌ను తీసుకుని హర్షం భీమవరం వర్మ హాస్పిటల్స్‌కి తీసుకువెళ్లారు. అక్కడ గుండెపోటుతో నరేష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించడంతో హర్ష కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయం అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. ప్రభుత్వానికి నివేదించి నరేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విషాదంలో చినమల్లం పెనుగొండ: చినమల్లంకు చెందిన గుడాల నరేష్ సచివాలయ పరీక్షలు రాస్తూ గుండెపోటు తో మరణించడంతో చినమల్లంలో విషాదం నెలకొంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన గుడాల సత్యనారాయణ కుమారుడు గుడాల నరేష్. నరేష్ మృతదేహాన్ని రాత్రి చినమల్లంలోని స్వగృహానికి తీసుకు వచ్చారు. ఉన్నత చదువులు అభ్యసించి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి అసరాగా ఉంటాడనుకున్న తరుణంలో నరేష్ మృత్యువాత పడడంతో గ్రామస్తులు కన్నీరు పెట్టారు. తండ్రి సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొనడంతో పార్టీ నాయకులు వచ్చి ఆదివారం రాత్రి నరేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సిద్ధాంతంలోని వశిష్టాగోదావరి తీరంలోని కేదారీఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నరేష్ మృతికి వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు దంపనబోయిన బాబూ రావు, మాజీ ఎంపీటీసీ గండ్రేటి అప్పారావు, రామచంద్రరాజు, బీసీ సెల్ మండల కన్వీనరు కేశవరపు గణపతి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.