ఏటీఎం చోరీలకు ప్రయత్నించిన యువకులు
వారంతా బీటెక్ చదివిన యువకులు.. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీకి ప్రయత్నించారు. యూ ట్యూబ్‌లో చోరీ చేసే వీడియోలు చూసి బ్యాంక్ ఏటీఎంలను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ చోరీ ప్రయత్నం ఫలించకపోగా, పోలీసులకు చిక్కారు. నిడదవోలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమగోదావరి, నిడదవోలు: పట్టణానికి చెందిన చెరుకూరి మునీంద్ర, ఎస్‌కే అరుణ్ రహిద్, యంగాల ఆదిత్య కొవ్వూరు డివిజన్ పరిధిలో దేవరపల్లి, గౌరీపట్నం, చాగల్లు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఏటీఎం చోరీలకు ప్రయత్నించారు. వీరంతా బీటెక్ డిప్లమో పూర్తి చేశారు. చాగల్లు ఏటీఎం కేంద్రం వద్ద మంగళవారం మరోసారి ఏటీఎం చోరీకి ఉపక్రమిస్తున్న సమయంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. స్నేహితులైన ఈ ముగ్గురు ఏటీఎం కేంద్రాల్లో చోరీ ఎలా చెయ్యాలో యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను రాడ్‌తో పగలగొట్టిన అనంతరం ఏటీఎం యంత్రాలను రాడ్‌లతో ధ్వంసం చేస్తారు. ఏటీఎం యంత్రాల్లో ఉన్న బాక్స్‌లు తెరుచుకోకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేసేవారు. బాక్స్‌లు తెరచుకోకపోవడంతో డబ్బులు వీరికి దొరకలేదని డీఎస్పీ చెప్పారు. యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. నిడదవోలు సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్, చాగల్లు, నిడదవోలు ఎస్సైలు ఐ.రవికుమార్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment