
చేబ్రోలులో బైపాస్ రోడ్డులో టాటా మేజిక్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ(ఫైల్)
తూర్పుగోదావరి, గొల్లప్రోలు: చేబ్రోలులో రోడ్డు ప్రమాద ఘటన జరిగి ఐదు రోజులు గడచినా నేటి వరకు ప్రమాదకారకులను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చేబ్రోలు శివారు బైపాస్ రోడ్డులో సోమవారం టాటా మేజిక్ వ్యాన్‌ను రాంగ్ రూట్‌లో వచ్చిన మట్టి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా మాకవారిపాలేనికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడచినా నేటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిస్తున్న తీరు అనుమానాస్పదంగా మారింది. పచ్చతమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సంఘటన స్థలాన్ని పరిశీలించి లారీ డ్రైవరు, యజమాని, రోడ్డు నిర్వహణ సక్రమంగా లేదని జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన దిలీప్ బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ కంపెనీపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా నేటి వరకు ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
మట్టిమాఫియా బయటపడుతుందనా?
ప్రమాదానికి కారణమైన లారీ మట్టి తరలింపు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. మట్టి ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కడికి వెళుతోంది? మట్టి తరలించడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి? అనే విషయాలు బయట పడతాయనే కేసును జాప్యం చేస్తున్నారు. మట్టి మాఫియాలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సోదరుడు మట్టిమాఫియాలో కీలక పాత్రధారి. చెందుర్తి శివారు పోలవరం కాలువ గట్టు మట్టిని ఇష్టారాజ్యం తవ్వుకుని రియల్‌ఎస్టేట్ భూములకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం కాలువ గట్టు నుంచి చేబ్రోలులోని అడవిపుంత మీదుగా 216 జాతీయరహదారిపై రాంగ్ రూట్‌లో మట్టి లారీల రవాణా జరిగింది. మట్టి తరలింపు రాంగ్‌రూట్‌లో చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై విచారణను పక్కదోవ పట్టించడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కేసును నీరుగార్చేందుకు జాప్యం
కేసును నీరుగార్చేందుకే నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి ఉన్నట్టు అనుమానం బలపడుతోంది. నిందితులంతా టీడీపీ నియోజకవర్గ నాయకుడు అనుచరులు కావడం వల్లే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా జిల్లాకు చెందిన హోంశాఖ మంత్రి, ఆర్థికశాఖా మంత్రి గానీ నేటి వరకు స్పందించకపోవడం విచారకరం. ఇతర జిల్లాల్లో ప్రమాదాలు జరిగితే క్యూ కట్టే నాయకులు జిల్లాలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా పట్టించుకోకపోవడం దారుణం.
సాయం లేదు..పరామర్శ కరువు
ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన క్షతగాత్రులకు కనీసం ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం నేటి వరకు ప్రకటించలేదు. ప్రమాదంలో చనిపోయిన వారందరూ వ్యవసాయకూలీలే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. కనీసం మృతులు కుటుంబాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించిన సందర్భాలు లేవు.
విచారణ జరుగుతోంది
రోడ్డు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఒక రోజుల్లో నిందితులను అరెస్ట్ చేస్తాం. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు.– బి.శివకృష్ణ , ఎస్సై , గొల్లప్రోలు
Comments
Please login to add a commentAdd a comment