వరంగల్: వలస జీవులను లారీ మింగేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయా కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన సుమారు పది కుటుంబాలు తేనే సేకరణ కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓసిటీ మైదానంలో డేరాలు వేసుకుని నివాసం ఉంటున్నాయి.
నెల రోజుల క్రితం వచ్చిన ఈ వలసజీవులు నిత్యం ఉదయమే ఇక్కడ నుంచి ఆటోల్లో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి తేనె సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక ఆటోలో వర్ధన్నపేట, తొర్రూరు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద లారీ రాంగ్‌రూట్‌లో వచ్చి ఆటోను ఢీకొంది.
అలాగే కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో ఒకే కుటుంబానికి చెందిన కురేరి సురేష్ (43), అతడి కుమారులు అమిత్ కురేరి (23), నితీష్ కుమార్ కురేరి (11), సురేష్ సోదరి కుమారులు (మేనల్లుళ్లు) రూప్‌చంద్ దామి(33), జలావత్ దామి అలియాస్ జాబీర్ (19)తోపాటు ఆటోడ్రైవర్ నగరంలోని కరీమాబాద్ ఏసీరెడ్డి నగర్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ (42)మృతి చెందారు. మృతుడి కురేరి సురేష్ మరో కుమారుడు అమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రీతి, పూజ తెలిపారు.
ఆకలి తీర్చిన వ్యాపారులు..
రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారని తెలుసుకున్న లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు చెందిన పలువురు వ్యాపారులు చలించారు. తమ కుటుంబ సభ్యులు మృతి చెందారని, అందుకే ఉదయం నుంచి ఏమి తినలేదని చెప్పడంతో భోజనం తయారు చేయించి వారి ఆకలి తీర్చినట్లు వ్యాపారులు బిట్ల కృష్ణ, పాపాని భాస్కర్, బూర ప్రకాశ్ తెలిపారు.
అమ్మా వస్తున్నా.. అంతలోనే దుర్మరణం
ఖిలా వరంగల్: అమ్మా వస్తున్నా...కలిసి భోజనం చేద్దాం అంటివి.. అంతలోనే మాయమైనవా.. రెండు రోజులాయే నా చేతి కూడు తినక కొడుకా...తినకుండానే వెళ్లిపోయినావా .. అంటూ ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ తల్లి రాజమ్మ రోదిస్తుంటే అక్కడున్న వాళ్లంతా కంటితడి పెట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ కూడా ఉన్నారు.
శ్రీనివాస్‌కు పదేళ్ల క్రితం వివాహం జరగగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం భార్య కల్పన తన పిల్లలను వెంటబెట్టుకుని నర్సంపేట ద్వారక పేటలోని పుట్టింటికి వెళ్లిపోగా.. శ్రీనివాస్ మాత్రం పుప్పాలగుట్ట ఏసీరెడ్డినగర్‌లోని తన పెద్దన్న నివాసం ఉండే తల్లి రాజమ్మ ఇంటికి చేరుకున్నాడు.
అతను ప్రస్తుతం నాగమయ్య టెంపుల్ సమీప కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అద్దె ఆటో నడిపిస్తున్నాడు. బుధవారం ఉదమే యజమానికి ఆటో ఇచ్చేసి ఇంటికి వస్తాననుకున్నాడు. ఈ లోపు ఓసిటీలో డేరాలు ఏర్పాటు చేసుకున్న జైపూర్‌కు చెందిన వలస జీవులు అండర్ బ్రిడ్జి వద్ద బట్టు శ్రీనివాస్ ఆటో ఎక్కి తొర్రూరులో దించాలని కోరారు. దీంతో వారిని ఎక్కించుకుని బయలుదేరగా ఇల్లంద వద్ద లారీ ఢీకొంది. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో శ్రీనివాస్ సోదరుడు బట్టు కిషన్, వదిన మాలతీ, మృతుడి తల్లి రాజమ్మ, నర్సంపేట నుంచి చేరుకున్న భార్య కల్పన, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వరంగల్ పుప్పాలగుట్ట ఏసిరెడ్డినగర్‌లో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment