కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు, తలుపు గొళ్లెం తీసేందుకు నిందితుడు తయారు చేసుకున్న పరికరం
పశ్చిమగోదావరి, తణుకు: కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే నిద్రిస్తున్నారు.. హాలుతో పాటు రెండు బెడ్రూముల్లో వారంతా గాఢ నిద్రలో ఉన్నారు.. అయినా ఎలాంటి బెరుకు లేకుండా ఇంట్లోకి చొరబడిన దుండగులు బెడ్రూమ్ కబోర్డులో దాచుకున్న బంగారు ఆభరణాలతోపాటు రూ.90 వేల నగదును దర్జాగా ఎత్తుకెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీ తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నివాసం ఉంటున్న టీడీపీ నాయకుడు శీని గోపాలం ధాన్యం వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తుంటారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకుని పొద్దుపోయాక వచ్చిన యజమాని శీని గోపాలం, కుమారుడు జగదీష్‌లు 11 దాటాక పడుకున్నారు. ఒక బెడ్రూంలో గోపాలంతో పాటు కుమార్తె మంజూష పడుకోగా మరో బెడ్రూమ్‌లో జగదీష్ పడుకున్నారు. హాలులో గోపాలం భార్య సీతారత్నం ఆమె తల్లి లక్ష్మీకాంతం పడుకున్నారు. గురువారం అర్థరాత్రి సుమారు ఒంటిగంట వరకు ఫోన్ మాట్లాడిన మంజూష అనంతరం నిద్రలోకి జారుకున్నారు.
చాకచక్యంగా తలుపు తీసి..
ప్రధాన గేటు దాటి ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన దండుగులు హాలు కిటికీ నుంచి లోపల తలుపు చాకచక్యంగా తెరిచారు. ఇందుకు కర్రకు ప్రత్యేకంగా ఇనుప ఊచను చుట్టి కొక్కెం మాదిరిగా రెండు పరికరాలు తయారు చేసుకున్నారు. వీటి సాయంతో తలుపులు తెరిచిన దుండగులు నేరుగా బెడ్రూంలోకి వెళ్లి కబోర్డులో ఉన్న స్టీలు బాక్సుల్లో దాచుకున్న బంగారు ఆభరణాలు, రూ.90 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో అదే బెడ్రూంలో నిద్రిస్తున్న గోపాలం, కుమార్తె మంజూషకు మెలకువ రాకపోవడం విశేషం. అనంతరం జగదీష్ పడుకున్న బెడ్రూం తలుపు తీసిన దుండగులు అక్కడ ఏమీ దొరక్కపోవడంతో పలాయనం చిత్తగించారు. అయితే ప్రధాన ద్వారం తలుపు గడియ తీసే సమయంలో సైతం చప్పుడుకు కుటుంబ సభ్యులకు మెలకువ రాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరికి మత్తు పదార్థం వంటిది ఏదైనా స్ప్రే చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులను నుంచి ఫిర్యాదు తీసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment