
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: అత్తా కోడళ్ల మద్య జరిగిన ఘర్షణలో క్షణికావేశంలో అత్తను హతమార్చిన ఘటన ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో వెలుగు చూసింది. రేలంగి గ్రామానికి చెందిన కూసంపూడి వెంకట్రావు, మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులు, కుమార్తెలకు వివాహాలు చేసి కుమారుల వద్ద మహాలక్ష్మి, వెంకట్రావు ఉంటున్నారు. పెద్ద కోడలు కూసంపూడి వరలక్ష్మి, మహాలక్ష్మికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో శనివారం మద్యాహ్నం ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో అత్త మహాలక్ష్మిని (68) కోడలు కొట్టడంతో చనిపోయింది. దీనిని సహజ మరణంగా చిత్రీకరించి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి కుమార్తెలకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం కుమార్తెలు వచ్చి ఫ్రీజర్‌లో వున్న మహాలక్ష్మి మృత దేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలు గమనించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో తన అత్తను కొట్టి చంపినట్టు వరలక్ష్మి అంగీకరించినట్టు ఎస్సై తెలిపారు. మృతురాలి కుమార్తె దుర్గాభవాని ఫిర్యాదు మేరకు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్సీ ప్రభాకరబాబు, సీఐ విజయకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment