
గుడాల నరేష్‌కు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
సాక్షి , పాలకొల్లు(పశ్చిమగోదావరి) : గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ పరీక్ష హాలులో గుండెపోటుకు గురై మృతిచెందిన ఓ అభ్యర్థి విషాదాంతమిది. వివరాల్లోకి వెళితే పాలకొల్లు పట్టణంలోని సోమేశ్వర అగ్రహారంలో నివాసం ఉంటున్న గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీ గౌతమి స్కూల్లో ఆది వారం పరీక్ష రాస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన అనంతరం సుమారు 10.30 గంటల 11 గంటల మధ్యలో మృతుడు నరేష్‌కు స్వల్ప నొప్పి రావడంతో స్థానికంగా విధుల్లో ఉన్న ఏఎ న్‌ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి అక్కడ నుంచి పట్టణంలోని బృందా వన ఆసుపత్రికి తీసుకెళ్లి ఈసీజీ తీయించారు. గుండె పోటు వచ్చే సూచనలు కనిపించడంతో అతడ్ని స్థానికంగా ఉన్న కార్డియాలజిస్టు డాక్టర్ రాజశేఖర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం అత్యవరసర వైద్యం కోసం భీమవరం వర్మ హాస్పిటల్‌కి అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30గంటల సమయంలో నరేష్ ప్రాణాలు విడిచారు.
పరీక్ష కోసం హైదరాబాద్ నుంచి వచ్చి
మృతుడు నరేష్ స్వస్థలం పెనుగొండ మండలంలోని చినమల్లం పంచాయతీ పరిధిలోని మధనవారిపాలెం. వైజాగ్ ఆంధ్రాయూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. పాలకొల్లుకి చెందిన లక్ష్మీప్రసన్నతో అతనికి సుమారు ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి శర్వాణి అనే నాలుగేళ్ల వయస్సు గల కుమార్తె ఉంది. లక్ష్మీప్రసన్న బీఎస్సీ చదివింది. వివాహం అయిన తరువాత నరేష్ పాలకొల్లులో స్థిరపడ్డారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్ వెళ్లి చదువుకుంటున్నారు. నరేష్ బావ మరిది హర్ష హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గ్రామ సచివాలయ పరీక్షల కోసం సన్నద్ధమతున్నాడు. హర్ష, నరేష్ పరీక్షల రాయడం కోసం హైదరాబాద్ నుంచి ఉదయమే వచ్చారు. పూలపల్లి శ్రీ గౌతమి స్కూల్లో పరీక్షా కేంద్రంలో వీరిద్దరూ పరీక్ష రాస్తున్నారు.
బావమరిదికి చెప్పవద్దని
తనకు గుండె నొప్పి వచ్చిందని బావమరిది హర్షకి చెబితే తను ఎక్కడ పరీక్ష రాయడం మానేసి వస్తారోనని పరీక్ష పూర్తయ్యేవరకు తెలియజేయవద్దని తనకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి నరేష్ చెప్పారు. దీంతో బావమరిది హర్షకి సిబ్బంది సమాచారం ఇవ్వలేదు. పరీక్ష పూర్తయిన అనంతరం వెలుపలికి వచ్చిన హర్ష విషయం తెలుసుకుని బావ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే బావ నరేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంబులెన్స్‌లో బావ నరేష్‌ను తీసుకుని హర్షం భీమవరం వర్మ హాస్పిటల్స్‌కి తీసుకువెళ్లారు. అక్కడ గుండెపోటుతో నరేష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించడంతో హర్ష కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయం అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. ప్రభుత్వానికి నివేదించి నరేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
విషాదంలో చినమల్లం
పెనుగొండ: చినమల్లంకు చెందిన గుడాల నరేష్ సచివాలయ పరీక్షలు రాస్తూ గుండెపోటు తో మరణించడంతో చినమల్లంలో విషాదం నెలకొంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన గుడాల సత్యనారాయణ కుమారుడు గుడాల నరేష్. నరేష్ మృతదేహాన్ని రాత్రి చినమల్లంలోని స్వగృహానికి తీసుకు వచ్చారు. ఉన్నత చదువులు అభ్యసించి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి అసరాగా ఉంటాడనుకున్న తరుణంలో నరేష్ మృత్యువాత పడడంతో గ్రామస్తులు కన్నీరు పెట్టారు. తండ్రి సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొనడంతో పార్టీ నాయకులు వచ్చి ఆదివారం రాత్రి నరేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సిద్ధాంతంలోని వశిష్టాగోదావరి తీరంలోని కేదారీఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నరేష్ మృతికి వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు దంపనబోయిన బాబూ రావు, మాజీ ఎంపీటీసీ గండ్రేటి అప్పారావు, రామచంద్రరాజు, బీసీ సెల్ మండల కన్వీనరు కేశవరపు గణపతి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment