
ఆందోళనకారులతో చర్చిస్తున్న డీఎస్పీ కె.నాగేశ్వరరావు
సాక్షి, ఆకివీడు(పశ్చిమగోదావరి) : స్థానిక జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున యువకుడు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మండలంలోని పెదకాపవరం గ్రామానికి చెందిన తాటిపర్తి జీవరత్నం (23), తన స్నేహితుడు మద్దా అహోరోన్‌తో కలిసి శుక్రవారం ఆకివీడు వచ్చారు. శనివారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరి వెళుతుండగా స్థానిక మాదివాడ సెంటర్ సమీపంలో ఈ దారుణం జరిగింది. మృతదేహాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అందరూ రోడ్డు ప్రమాదంగా భావించారు. బంధువులు వచ్చి అక్కడ పరిస్థితిని, జీవరత్నంతో పాటు వచ్చిన అహోరోన్‌కు ఏ విధమైన దెబ్బలు తగలకపోవడం, ప్రమాదానికి సంబంధించిన సంఘటనలు ఏమీ కన్పించకపోవడంతో ఇది హత్యేనని మృతుడు సోదరుడు తాటపర్తి రాజేష్, బంధువులు, స్నేహితులు, పలువురు పెదకాపవరంకు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు.
జీవరత్నం ప్రేమ వ్యవహారంలో గుమ్ములూరుకు చెందిన అహోరోన్ గతంలో బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని భీమవరం రూరల్ ఎస్సై కె.సుధాకరరెడ్డి చెప్పారు. అహోరోన్, ఆ యువతి తండ్రి ఏసురత్నం, మరికొంత మంది కలిసి హత్య చేశారని రాజేష్ ఫిర్యాదు చేశారన్నారు. ఆరు నెలల క్రితం మృతుడు తండ్రి సుగుణరావు స్థానిక మాదివాడ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ కేసును కూడా పోలీసులు నీరు గార్చారని, నేటికీ తేల్చలేదని, జీవరత్నం కేసును కూడా అదే విధంగా నీరుగార్చే ప్రమాదం ఉందని, బంధువులు ఆరు గంటల పాటు ఆందోళన చేశారు. రాస్తారోకో చేసి వాహనాల రాకపోకల్ని నిలుపుదల చేశారు. నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, భీమవరం రూరల్ సీఐ శ్యాంకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment