గొరగనమూడిపాలెంలో ఉరివేసుకుని మృతి చెందిన బొక్కా తులసి గొరగనమూడిపాలెంలో భర్త సత్యనారాయణను పొడిచిన చాకు ఇదే ఉరికి ఉపయోగించిన చీర ఇదే
పశ్చిమగోదావరి, పాలకోడేరు: భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకుంది. అర్ధరాత్రి అతడు నిద్రపోతున్న వేళ కత్తితో దాడి చేసి పలుసార్లు పొడిచింది. భర్త మరణించాడని భావించి ఆపై ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన గురువారం రాత్రి పాలకోడేరు మండలం గొరగనమూడిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
గొరగనమూడిపాలెంకు చెందిన బొక్కా తులసి (55), బొక్కా సత్యనారాయణ (60) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో వివిధ చోట్ల స్థిరపడ్డారు. ఆ దంపతులు మాత్రం గొరగనమూడిపాలెంలో కాపురం ఉంటున్నారు. తులసికి ఎప్పటి నుంచో భర్త సత్యనారాయణపై అనుమానం ఉంది. తులసి కొన్నాళ్లుగా అల్సర్‌తో బాధపడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను భర్త పట్టించుకోవడం లేదని, ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సత్యనారాయణ నిద్రపోయిన తర్వాత కర్రతో అతడి తలపై మోది కత్తితో శరీరంపై పలుచోట్ల పొడిచేసింది. భర్త చనిపోయాడని భావించిన అనంతరం పక్కగదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సత్యనారాయణ తీవ్ర గాయాలతో రక్తమోడుతూ బయటకు వచ్చి పొరుగు వ్యక్తి సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. హత్యాయత్నం, ఆత్మహత్యపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంత వయసు వచ్చినా దాంపత్య జీవితంపై అవగాహన లేక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సైకాలజిస్ట్ డాక్టర్ బి.చలపతిరావు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment