
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ కె.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలో వ్యక్తిని కిరాతకంగా హతమార్చి మొండెం నుంచి తలను వేరుచేసి హతుడు ఆధారాలు తెలియకుండా తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ చేసి హత్య చేసిన నిందితులను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు వెల్లడించారు. ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, వైవీవీఎల్ నాయుడుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏలూరు వన్‌టౌన్ నవాబుపేటకు చెందిన కంచి సతీష్ అలియాస్ జోజి అనే వ్యక్తిని వెంకటాపురం పంచాయితీ సుంకరవారితోట ప్రాంతానికి చెందిన కిరాణా వ్యాపారం చేసుకునే కల్లపల్లి వేణు, తన దుకాణంలో పనిచేసే బావిశెట్టివారిపేటకు చెందిన రుప్ప మురళీకృష్ణ సహాయంతో హత్య చేశాడు. కేసును పక్కదారి పట్టించేందుకు ఆధారాలు లభించకుండా సతీష్ తలను మొండెం నుంచి వేరు చేశారు. మొండెం మాత్రమే పోణంగి కాలువలో లభించటంతో తల కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. మొండెం ఎవరనేదానిపై సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతరం దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు కేసును పదిరోజుల్లోనే చేధించారు.
అనుమానం పెనుభూతమై
హత్య కేసులో ప్రధాన నిందితుడు వేణు వన్‌టౌన్ ప్రాంతంలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వేణు నవాబుపేటలో ఒక మహిళతో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన హతుడు కంచి సతీష్ మహిళ ఇంటికి తరచూ వస్తోన్న వేణును రాత్రి వేళల్లో అడ్డగిస్తున్నాడు. వేణుకు మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో హత్యకు గురైన సతీష్ ఆ మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని వేణుకు అనుమానం వచ్చింది. ఫిబ్రవరి 14న వేణు తన భార్యతో కలిసి ఆ మహిళ ఇంటికి వెళుతుండగా హతుడు సతీష్ మరోమారు వారిద్దరినీ నిలువరించి అతని భార్యను సైతం దుర్భాషలాడాడు.
దీంతో కోపంతో రగిలిపోయిన వేణు ఎలాగైనా సతీష్‌ను అడ్డుతొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. వేణు కిరాణ దుకాణంలో పనిచేస్తున్న రుప్పా మురళి సహాయంతో సతీష్‌ను మోటారు సైకిల్ ఎక్కించుకుని పోణంగి, మాదేపల్లి సరిహద్దు తమ్మిలేరు వాగు ప్రాంతానికి తీసుకువెళ్లి ఫూటుగా మద్యం తాగించారు. అనంతరం కత్తితో దాడి చేసి సతీష్‌ను హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలియకుండా ఉండేందుకు హతుడి తలను నరికి అదేరోజు రాత్రి దెందులూరు చెక్‌పోస్టు సమీపంలోని గోదావరి కాలువలో పడేశారు. ఏలూరు రూరల్ పోలీసులు ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మృతుని వివరాలు గుర్తించారు. అనంతరం పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 27న ఉదయం 11.30 గంటలకు ఏలూరు ఆశ్రం ఆసుపత్రి సెంటర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు హత్యకు వినియోగించిన కత్తి, మోటారు సైకిల్‌తోపాటు, హతుడి తలను స్వాధీనం చేసుకున్నారు. తలను పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు నిందితులపై క్రైం నెంబర్ 54/2019 మేరకు సెక్షన్ 302, 201 ఐపీసీ మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులైన వేణు, మురళిపై నిఘా ఉంచేందుకు రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశా>లు జారీ చేశారు. సమావేశంలో ఏలూరు రూరల్ ఎస్సై పి.వాసు, ట్రైనీ ఎస్సై రాజేష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment