పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణానికి చెందిన నరేష్ (పేరు మార్చాం) సెకండ్‌హ్యాండ్ వస్తువులు విక్రయించే యాప్ ద్వారా ఓ స్మార్ట్‌ఫోన్ విక్రయ ప్రకటన చూశాడు. ఆ మోడల్ ఫోన్ వాస్తవ ధర సుమారు రూ.40 వేలు ఉండగా... సగం ధరకే విక్రయానికి పెట్టడం ఆకర్షించింది. ప్రకటనలో ఉన్న నంబర్‌కు ఫోన్ చేశాడు. ప్రకటనదారుడు కొద్దిసేపటికే నరేష్ సూచించిన చోటకు ఫోన్ తీసుకొచ్చాడు. ఏ మాత్రంసంకోచించకుండా నరేష్ దానిని కొనేశాడు. బిల్లు అడిగితే ప్రకటనదారుడు ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. కొన్న ఫోన్‌లో సిమ్ వేసుకుని నరేష్ వాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత రెండురోజులకు పోలీసులు నరేష్‌కు ఫోన్ చేసి మీరు వాడుతున్న ఫోన్ దొంగిలించినదని చెప్పారు. ఫోన్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే చోరీ సొత్తు కొన్నందుకు కేసు తప్పదని మర్యాదగానే చెప్పారు. దీంతో నరేష్ వెంటనే ప్రకటనదారుడికి ఫోన్ చేశాడు. అయితే ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో యాప్‌లో ప్రకటన కోసం వెతికాడు. అక్కడ ప్రకటన కూడా లేదు. ఇక చేసేది లేక ఫోన్‌ను పోలీసులకు అప్పగించాడు. ఇది కేవలం ఒక్క నరేష్‌కు ఎదురైన అనుభవం కాదు. జిల్లావ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొన్న వారిలో అత్యధిక శాతం మందికి ఇదే తరహాలో పరాభవం ఎదురవుతోంది.
ఆన్‌లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. సరికొత్త ఉత్పత్తులు మొదలుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే వెబ్‌సైట్లు, యాప్‌లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఉపకరణాల ప్రకటనలు ఆకర్షిస్తున్నాయి. ఎంతో ఖరీదైనవి సగం ధరకే అనే ప్రకటనలకైతే వినియోగదారులు ఇట్టే బుట్టలో పడిపోతున్నారు. అప్రమత్తంగా లేకపోతే తక్కువ ధరకే కొన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోవచ్చు. కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని సైట్లలోని ప్రకటనల ద్వారా కొనే సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఎక్కువగా చోరీ చేసినవే. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల నుంచి పోలీసులు ఆయా ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు. దొంగలు ఒకవేళ కొట్టేసిన ఫోన్‌లోని సిమ్ కార్డు తీసేసి విక్రయించినా ఐఎంఈఐ విశిష్ట సంఖ్య కావడంతో సెకండ్‌హ్యాండ్ కొనుగోలుదారులు కొత్త సిమ్ వేసిన వెంటనే పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కుతోంది. ఆ ఐఎంఈఐ నంబరు కలిగిన హ్యాండ్‌సెట్‌లో ఏ కొత్త నంబరు వేశారో కనిపెట్టే పరిజ్ఞానం పోలీçసుల వద్ద ఉండటంతో సులభంగానే పసిగట్టగలుగుతున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ లభిస్తుందనే ఆశకు పోయిన నరేష్‌లాంటి వ్యక్తులు బాధితుల జాబితాలో చేరుతున్నారు.
కొంటున్నారా...? ఇవి గమనించండి
♦ ప్రతి సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబరు తప్పనిసరిగా ఉంటుంది. ఫోన్‌ను కొనేటప్పుడు బిల్లుపై ఈ నెంబరు నమోదై ఉంటుంది. ఆ ఫోన్‌కు యజమాని అనేందుకు ఆ బిల్లే ఆధారం. అందుకే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నప్పుడు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ ఐఎంఈఐ నంబరు తనిఖీ చేసేందుకు ఫోన్‌లో #06# టైప్ చేస్తే కొన్ని క్షణాల తర్వాత నంబరు తెరపై ప్రత్యక్షమవుతుంది.
♦ ఆ ఐఎంఈఐ నంబరు కలిగిన ఒరిజినల్ బిల్లులో యజమాని, ఫోన్ విక్రయిస్తున్న వ్యక్తి ఒకరేనా అని సరిచూసుకోవాలి. అవసరమైతే ఫోన్ అమ్మే వ్యక్తి ఫొటో, అతనికి సంబం ధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం జిరాక్సు ప్రతిని తీసుకోవాలి.
♦ అత్యవసరం ఉంది కాబట్టి తక్కువ ధరకే విక్రయిస్తున్నామని చెప్పినా... ఒరిజినల్ బిల్లు లేకుంటే మాత్రం ఎట్టిపరిస్థితితుల్లో కొనొద్దు.
దొంగల చేతివాటం ఇలా...
♦ దొంగలు అసలు వినియోగదారుల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను కొట్టేస్తారు.
♦ వాటిపై భాగాలను మార్చి ఆకర్షణీయంగా మార్చేస్తారు.
♦ అనంతరం వాటిని ఫోటోలు తీసి ఆన్‌లైన్ పోర్టల్స్, యాప్‌లు, వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తారు.
♦ వాస్తవ ధరకంటే తక్కువకే విక్రయిస్తామంటూ ఆకర్షిస్తారు.
♦ ఆ ఫోన్‌ను అమ్మదలిస్తే దొంగ స్వయంగా రంగంలోకి దిగుతాడు. బేరం కుదిరితే దొంగే నేరుగా వచ్చి డబ్బులు తీసుకుని సెల్‌ఫోన్ ఇచ్చేస్తాడు.
♦ సాధారణంగా దొంగలు ఫోన్ కొట్టేసిన కొద్ది రోజుల పాటు దాన్ని ఆఫ్ చేసేస్తుంటారు. ఆ సమయంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆఫ్ చేసి ఉండటంతో పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కదు. ఒకట్రెండు నెలల అనంతరం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతుంటారు.
♦ అప్పటివరకు స్విచ్ఛాఫ్ చేసి ఉన్న ఫోన్‌ను కొన్న వ్యక్తి ఆన్ చేయగానే పోలీసుల ట్రాకింగ్‌కు దొరుకుతుంది. ఒకవేళ కొనుగోలుదారుడు గట్టిగా మాట్లాడితే దొంగ ఫోన్ కొన్నందుకు పోలీసు కేసు ఎదుర్కోక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment