నాగదుర్గాప్రసాద్ మృతదేహం
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: తండ్రి మందలించాడని మనస్థాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. మండలంలోని పట్టెన్నపాలెంకు చెందిన పి.నాగదుర్గాప్రసాద్ స్థానికచైతన్య(వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ) జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే దుర్గాప్రసాద్ సక్రమంగా కళాశాలకు వెళ్లడం లేదు. దసరా సెలవుల అనంతరం కూడా కళాశాలకు డుమ్మాకొట్టాడు. అయితే ఈ నెల 26న కళాశాలకు వెళ్లిన దుర్గాప్రసాద్ మధ్యాహ్నం నుంచి కళాశాల మానివేశాడు. అదే సమయంలో కళాశాల అధ్యాపకుడు ఒకరు స్థానిక కళాశాల రోడ్డులో వెళుతుండగా దుర్గాప్రసాద్ అక్కడ తారసపడ్డాడు.
దీంతో ఆ అధ్యాపకుడు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో దుర్గాప్రసాద్ తండ్రి సీతారాముడు వచ్చి కొడుకును మందలించాడు. అయితే శనివారం సాయంత్రం వరకు దుర్గాప్రసాద్ స్నేహితులతో గడిపాడు. సాయంత్రం సమయంలో ఇద్దరు స్నేహితులతో స్థానిక ఆర్టీఓ కార్యాలయం వెనుక కొద్దిసేపు గడిపిన అనంతరం అకస్మాత్తుగా పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. దీనినిగుర్తించిన ఇద్దరు స్నేహితులు వెంటనే తండ్రి సీతారాముడికి సమాచారం ఇవ్వగా, దుర్గాప్రసాద్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎ.దుర్గారావు చెప్పారు.
కళాశాల బస్సుల ధ్వంసం
నాగదుర్గాప్రసాద్ మృతిచెందాడని తెలుసుకున్న కొందరు విద్యార్థులు కళాశాల బస్సులు ఐదింటిని ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఇదే కళాశాలలో కొందరు విద్యార్థులు కళాశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం, సరిగా చదవకపోవడంతో యాజమాన్యం టీసీలు ఇచ్చి పంపించివేసింది. ఈ విధంగా టీసీలు తీసుకున్న విద్యార్థులు మరికొందరితో కలిసి వచ్చి కళాశాల బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం, చుట్టుపక్కల వారు విద్యార్థులను అదుపు చేయడంతో శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment