
మోకెనపెల్లి త్రిష
బోయినపల్లి (చొప్పదండి): నన్ను ప్రేమించు..పెళ్లి చేసుకో.. లేదంటే పురుగు మందు తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో క్రిమిసంహారకమందు తాగిన ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన మోకెనపెల్లి రాజు–స్వప్న దంపతుల కుమార్తె త్రిష (18) గంగాధరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది.
అదే కాలేజీలో చదువుతున్న తడగొండకు చెందిన కోరెపు సతీశ్ ప్రేమించాలంటూ ఆరు నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సతీశ్‌ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యువకుడు సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి వచ్చి ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
వెంట తెచ్చిన పురుగు మందు డబ్బా చూపిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించా డు. సతీశ్ వేధింపులు భరించలేక త్రిష పురుగు మందు తాగింది. అప్పుడే వచ్చిన త్రిష సోదరిని చూసిన సతీశ్ పరారయ్యాడు. త్రిషను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కాగా సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరెపు సతీశ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి మంగళవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment