కుక్కునూరులో వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు, వెనుక నిందితులు
పశ్చిమగోదావరి, కుక్కునూరు: మండలంలోని గుంపెనపల్లి–గణపవరం గ్రామాల మధ్య ఈనెల 10న జరిగిన హత్యకేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్టు కుక్కునూరు సీఐ డి.భగవాన్‌ప్రసాద్ ఆదివారం విలేకరులకు వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుంపెనపల్లి గ్రామానికి చెందిన వల్లె వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మృతి చెందడంతో అదే గ్రామానికి చెందిన వితంతు మహిళ తుర్సం సుశీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పిల్లలు పెద్దవారు అవుతున్నారని ఇకపై వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని వెంకటేశ్వర్లును సుశీల కుటుంబసభ్యులు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో సుశీల అన్న తుర్సం సూరిబాబు, తుర్సం నాగేశ్వరరావు కలిసి వెంకటేశ్వర్లు హత్యకు ప్రణాళిక వేశారు.
ఈనెల 10న రాత్రి ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్లును బయటకు వెళ్దామని తీసుకెళ్లి హతమార్చారు. శరీరంపై నరికి ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంకటేశ్వర్లు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆదివారం ఉదయం నిందితుడు సూరి బాబును ఇబ్రహీంపేట వద్ద, నాగేశ్వరావును అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకోని అరెస్ట్ చేశారు. నిందితులను సోమవారం కోర్టుకు రిమాండ్ చేయనున్నట్టు సీఐ పేర్కొన్నారు. వేలేరుపాడు ఎస్సై బి.మధువెంకటరాజా, ఏఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment