ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య | Wife And Her Boy Friend Killed Husband in West Godavari | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Published Wed, Apr 24 2019 1:50 PM | Last Updated on Wed, Apr 24 2019 1:50 PM

Wife And Her Boy Friend Killed Husband in West Godavari - Sakshi

భార్య, ప్రియుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన చిన్నారావు (ఫైల్‌)

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య, ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. మండలంలోని జి.కొత్తపల్లిలో చోటు చేసుకున్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. ద్వారకాతిరుమల ఎస్సై ఎం.సూర్యభగవాన్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరానికి చెందిన చప్పా చిన్న చిన్నారావు ఈనెల 16 ఉదయం జి.కొత్తపల్లి నుంచి దూబచర్లకు వెళ్లే రహదారి పక్కన తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి 108 అంబులెన్స్‌లో బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారావు ఈ నెల 19న మృతిచెందాడు. ఈ కేసును హత్యా నేరం కింద నమోదు చేసిన భీమడోలు సీఐ సీహెచ్‌.కొండలరావు దర్యాప్తును వేగవంతం చేశారు. అమ్మాజీ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాపు చేశారు. అమ్మాజీకి లక్కోజు సత్యనారాయణ అనే వ్యక్తితో అక్రమం సంబంధం ఉందని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే దాడి చేసినట్టు ఒప్పుకున్నారు.

చిన్నారావును అతని భార్య అమ్మాజీ అడ్డుతొలగించుకోవాలన్న తలంపుతో ఆమె ప్రియుడు లక్కోజు సత్యనారాయణతో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలో చిన్నారావును ఈనెల 16న భీమవరం నుంచి తీసుకొచ్చి ఘటనాస్థలం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం చిన్నారావు మృతిచెంది ఉంటాడని భావించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి వచ్చిన అమ్మాజీ తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిపడేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐ కొండలరావు అసలు విషయాన్ని రాబట్టి, నిందితులు అమ్మాజీ, ఆమె ప్రియుడు సత్యనారాయణలను మంగళవారం అరెస్ట్‌  చేసి కోర్టుకు పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement