
రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మి, పుష్పవతి మృతదేహాలు
సాక్షి, పశ్చిమ గోదావరి: గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి భార్య, అత్తను అతికిరాతకంగా నరికి చంపాడు. వివరాల ప్రకారం దొండపూడి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మితో గంగోలు పంచాయతీ పరిధిలోని రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మర కాంతారావుకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కాంతారావు వ్యవసాయ కూలి. ఏడాది కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. నాలుగు నెలల క్రితం భర్త కాంతారావు తప్పతాగి ఇంటికి వచ్చి తరచూ కొట్టడం చేస్తుండటంతో విసుగు చెందిన లక్ష్మి భర్త కాంతారావును పిల్లలను వదిలి పుట్టింటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం జామాయిల్ తోటలో కర్రలు నరకడానికి వెళ్లి పనులు ముగించుకుని మద్యం మత్తులో అత్తగారింటికి వచ్చాడు. వచ్చిన వెంటనే భార్యను పిలిచి గొడవ పడతున్నాడు.
దీంతో అత్త కప్పల పుష్పవతి (55) అడ్డుతగలడంతో తనతో తీసుకువచ్చిన కత్తితో తల, మెడపైన నరకడంతో అత్త కుప్పకూలిపోయింది. వెంటనే భార్య లక్ష్మి(32)ని కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో వీరిద్దరూ రక్తపు మడుగులోపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీనిని గమనించిన బావమరిది కప్పల మంగారావు కాంతారావును పట్టుకోవడానికి ప్రయత్నించగా అతని చేతిపై కత్తితో నరికాడు. కాంతారావును స్థానికులు పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. భార్యపై అనుమానంతోనే కాంతారావు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment