చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడి కాలువ నుంచి తీసిన లక్ష్మిమృతదేహం
పశ్చిమగోదావరి, దెందులూరు: గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గుణ్ణం లక్ష్మి (21) చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడికాలువలో శుక్రవారం శవమై తేలింది. వివరాల ప్రకారం దెందులూరు గ్రామానికి చెందిన గుణ్ణం రాధాకృష్ణ, కుమారి దంపతుల కుమార్తె లక్ష్మి రేషన్ దుకాణం నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం వీరు నివసిస్తున్న వీధికి చెందిన రెడ్డి అలేఖ్యను ఆశ్రం వైద్యశాలలో చూపించేందుకు లక్ష్మి తీసుకువెళ్లింది. ఆస్పత్రి పరీక్షల అనంతరం ఆలస్యం అవుతుందని అలేఖ్యకు చెప్పి లక్ష్మి సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటకు వచ్చేసింది.
అనంతరం అలేఖ్య తన తండ్రికి ఫోన్ చేసి లక్ష్మి వెళ్లిపోతోంది మీరు రండి అని చెప్పింది. కొంత సమయానికి చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడి కాలువలో కొట్టుకువస్తున్న గుర్తుతెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి కాలువలో కొట్టుకువస్తున్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం దెందులూరు గ్రామానికి చెందిన రేషన్ షాపు డీలర్ గుణ్ణం లక్ష్మిగా గుర్తించారు. మృతదేహాన్ని దెందులూరులో కుటుంబ సభ్యులకు చూపించి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్, దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి దెందులూరులో మృతురాలి తల్లి, సోదరుడు, నానమ్మలను కలసి సంఘనట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ రూమ్ వద్ద లక్ష్మీ మృతదేహాన్ని పరిశీలించారు. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment