సాక్షి, పశ్చిమ గోదావరి: చిన్నారి ఎంతగానో ఇష్టపడి తిన్న ఆ చాక్లెట్ అతని ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. అతనితో పాటు ఆ చాక్లెట్స్ తిన్న మరో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోయరాజమండ్రి పంచాయతీ కి చెందిన రావిగూడెం అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది ...
బాలుడి తల్లి తెలిపిన వివరాలప్రకారం .. కురసం అభయ్ చరణ్ తేజ్ (5) అనే బాలుడు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం తన ఇంటికి సమీపంలోని ఓ కొట్టు వద్ద నుండి తెచ్చిన చాక్లెట్స్ ని తన స్నేహితులతో కలసి తిన్నాడు. అనంతరం ఇంట్లో వండిన చేపల కూరతో భోజనం చేసి ఆడుకోడానికి బయటకు వెళ్ళాడు కొద్దిసేపటికి ఒక్కసారిగా నోట్లో నుంచి నురగలు వస్తూ పడిపోయాడు, బాలుడు ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో చేపల కూరలో చేప ముల్లు గొంతులో అడ్డుపడిందేమో నని తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికుల సహాయంతో బుట్టాయగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గ మద్యంలో అభయ్ చరణ్ తేజ్ మృతి చెందినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా అభయ్ చరణ్ తేజ్ చాక్లెట్ తింటూ ఆడుకుంటున్న సమయంలో మాకు పెట్టమని అడిగి తీసుకుని తిన్నామరో ఇద్దరు చిన్నారులు కట్టం సంతోష్(7),మడకం రాహుల్ వర్మ(6) లు కూడా అస్వస్థత కు గురికావడంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి కి తరలించగా వారు అక్కడ చికిత్సపొందుతున్నారు.
తల్లి పైనే స్థానికుల అనుమానం...
ఆదివారం సాయంత్రం అభయ్ చరణ్ తేజ్ (5) తిన్న చాక్లెట్ లో ఎలుకల మందు కలిసిందని అది తిన్న బాలుడు మృతి చెందాడని తెలిపారు. దీనిపై బాలుడు తల్లిపైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ధి కాలంగా భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారని,కొడుకు అభయ్ చరణ్ తేజ్ మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడని ఈ క్రమంలో కొడుకును అడ్డు తొలగించుకోవడం కోసం తల్లి ఇలా ప్లాన్ చేసిందా అనే అనుమానం కలుగుతుందని స్థానికులు తెలిపారు.
గతంలో కూడా ఇలాగే అస్వస్థకు గురి కావడంతో బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రాణాపాయం తప్పిందని తిరిగి మళ్ళీ అదే విధంగా జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని వారు తెలుపుతున్నారు. కాలం చెల్లిన చాక్ లెట్స్ అని ప్రచారం జరుగుతుందని ఇందులో నిజం లేదని అదే జరిగితే చాల మంది పిల్లలకు ఇలాగే జరగాలని వారు తెలిపారు. పలు అనుమానాలకు తావిస్తున్న చిన్నారి మరణం అసలు మిస్టరీ వీడాలంటే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న బుట్టాయగూడెం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment