తమ్ముడు,చెల్లితో ఈశ్వర్. (సర్కిల్‌లో ఉన్న బాలుడు)
పాపం.. ఆ చిన్నారి బడికి పోయినా బతికెటోడు. మాయదారి మృత్యువు మాటువేసి కాటువేసింది. పాఠశాలకు వెళ్లకుండా చిన్నారిని ఏమర్చి తండ్రితో వస్తాయని మారం చేయించింది. ఈ విషయంలో తండ్రితో కూడా సరేననిపించి చివరకు రోడ్డు ప్రమాద రూపంలో అమాంతం బలితీసుకుంది. ఫలితంగా ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
జనగామ: ఎండు మిర్చిని విక్రయించేందుకు తండ్రితో కలిసి వెళ్లిన కొడుకు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ మండలం పెంబర్తి కాకతీయ కళాతోరణం సమీపంలో జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం రఘునాథపల్లి మండలం నక్కబొక్కలతండా శివారు సోమయ్య కుంట తండాకు చెందిన గుగులోత్ తిరుపతి, గంగా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. తిరుపతి తన సొంత ఆటోలో ఎండు మిర్చితో పాటు సీజనల్ వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఊరూరా తిరిగి ఎండు మిర్చి విక్రయించేందుకు బయలుదేరగా.. పెద్ద కుమారుడు ఈశ్వర్ (07) తండ్రితో వెళ్తానని మారం చేయడంతో వెంట తీసుకెళ్లాడు. పటేల్ గూడెంలో ఎండు మిర్చి అమ్ముకుని... పెంబర్తి కాకతీయ కళాతోరణం సమీపంలో ఆలేరు వైపునకు యూటర్న్ చేసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రితో కలిసి ముందు సీటులో కూర్చున్న ఈశ్వర్ అక్కడిక్కడే మృతి చెందగా.. తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే కారులో ఈశ్వర్‌తో పాటు తిరుపతిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించగా, తండ్రికి వైద్య పరీక్షలు చేశారు. కాగా, తమ కుమారుడు మృతి చెందాడని తెలియగానే తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. జిల్లా కేంద్రంలోని అరబిందో స్కూల్‌లో ఒకటో తరగతి చదువుకుంటున్న ఈశ్వర్.. బడికి వెళ్లినా బతికెటోడేమోనంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment